‘పళనిస్వామి నిర్ణయంతో అన్నాడీఎంకే కార్యకర్తలు సంతోషంగా లేరు’
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్..;
బీజేపీ(BJP)తో పొత్తు పెట్టుకోవడంపై అన్నాడీఎంకే(AIADMK) కార్యకర్తలు సంతోషంగా లేరని తమిళనాడు(Tamil Nadu) సీఎం స్టాలిన్(CM Stalin) పేర్కొన్నారు. తమిళనాడు పట్ల కఠిన వైఖరి అవలంభిస్తోన్న కాషాయ పార్టీతో ఎఐఎడిఎంకె చీఫ్ ఎడప్పాడి కె పళనిస్వామి చేతులుకలపడాన్ని ఆయన తప్పుబట్టారు. "తమిళనాడుకు ద్రోహం" చేస్తోన్న వారికి మద్దతు ఇస్తున్న వారికి 2026 అసెంబ్లీ ఎన్నికలలో తగ్గిన బుద్ధి చెప్పాలని కోరారు. తన తండ్రి, మాజీ సీఎం ఎం. కరుణానిధి ఏడో వర్ధంతి(ఆగస్టు 7) సందర్భంగా పార్టీ కార్యకర్తలకు స్టాలిన్ ఓ లేఖ రాశారు. తన తండ్రికి తమ తమ జిల్లాల్లోనే నివాళి అర్పించాలని కోరుతూనే.. బీజేపీ-ఎఐఎడిఎంకె పొత్తుపై నిప్పులు చెరిగారు.
‘పళనిస్వామికి నైతిక విలువల్లేవు’
‘‘బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ చూస్తోంది. రాష్ట్ర బిల్లులను గవర్నర్ ఆమోదించే విషయంలో న్యాయ పోరాటం చేసి విజయం సాధించింది డీఎంకే ప్రభుత్వమే. ఇలాంటి పోరాటాలను ప్రోత్సహించకపోగా.. తమిళనాడు గురించి ఏ మాత్రం పట్టని అన్నాడీఎంకే.. రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తోన్న బీజేపీతో జతకట్టింది. నైతిక విలువలు ఏ మాత్రం లేని ప్రతిపక్ష నాయకుడు (పళనిస్వామి) ఢిల్లీకి వెళ్లి బీజేపీ ముందు మోకరిల్లాడు. పళనిస్వామి చేసిన పనితో నిజమైన అన్నాడీఎంకే కార్యకర్తలెవరూ సంతోషంగా లేరు" అని స్టాలిన్ రాసుకొచ్చారు.
వర్ధంతి సందర్భంగా శాంతి యాత్ర..
కరుణానిధి ఏడో వర్ధంతి (ఆగస్టు 7) సందర్భంగా.. ఆయన స్మారకం వరకు శాంతి యాత్ర చేపడతామని స్టాలిన్ చెప్పారు. పార్టీ కార్యకర్తలు తమ తమ జిల్లాల్లో కరుణానిధికి నివాళి అర్పించాలని కోరారు. తమిళుల హక్కులను కాపాడేందుకు గతంలో తన తండ్రి అనుసరించిన మార్గాన్ని తాము కూడా అనుసరిస్తామని స్టాలిన్ తెలిపారు.