లిక్కర్ స్కాం విచారణ సమయంలో కోర్టులోకి మీడియాను నిషేధిస్తారా?

'కోర్టులోకి మీడియాను అనుమతించవద్దని' వైసీపీ తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడిది పెద్ద చర్చకు దారితీసింది.;

Update: 2025-08-02 11:30 GMT
ACB Court complex, Vijayawada
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం విచారణలో వైసీపీ తరఫు న్యాయవాదులు చేసిన తాజా డిమాండ్ చర్చనీయాంశంగా మారింది. 'కోర్టులోకి మీడియాను అనుమతించవద్దని' వైసీపీ తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ఇప్పుడిది పెద్ద చర్చకు దారితీసింది. ఈ కేసు స్వభావం, ఇందులో ఉన్న రాజకీయ ప్రాధాన్యత, ఆరోపణల తీవ్రత కారణంగా ప్రజలు, మీడియా, ప్రతిపక్షం అందరూ దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మీడియా ప్రవేశాన్ని నిరాకరించమని కోర్టుకు చెప్పడం సబబు కాదని న్యాయవాదులు చెబుతున్నారు.

వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెబుతున్న లిక్కర్ స్కాం కేసు విచారణ సమయంలో మీడియా ప్రవేశాన్ని పరిమితం చేయాలని విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టును అభ్యర్థించింది.
ఈ కేసులో వైసీఆర్‌సీపీ నాయకుల తరఫున వాదిస్తున్న న్యాయవాదులు, వాదనలు-ప్రతివాదాలను రిపోర్ట్ చేయడానికి కోర్టులోకి మీడియా ప్రతినిధులను అనుమతించవద్దని ఏసీబీ కోర్టు జడ్జి పి. భాస్కర్‌రావును కోరారు.
లిక్కర్ స్కాం కేసులో కీలక నిందితులు పేదిరెడ్డి మిథున్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కె. ధనుంజయరెడ్డి, పి. కృష్ణమోహన్‌రెడ్డి, రాజ్ కేసిరెడ్డి కోర్టులో హాజరైన సమయంలో ఈ ప్రస్తావన వచ్చింది. కోర్టులో సున్నితమైన సమాచారం మీడియాకు లీక్ అవుతూ, వక్రీకరిస్తున్నారనే మిషతో మీడియా కవరేజీ నిషేధం అవసరమని వైసీఆర్‌సీపీ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. దీనికి స్పందించిన జడ్జి భాస్కర్‌రావు, “ఈ లీక్‌లకు ఎవరు బాధ్యులు? మీడియా ప్రవేశాన్ని ఎలా నియంత్రిస్తాం?” అని ప్రశ్నించారు. దీనికి న్యాయవాదులు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.
ప్రస్తుత సమాచార విస్పోటన యుగంలో ఇదెలా సాధ్యం..
డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్స్ విస్తరణతో కోర్టు గోడలకే సమాచారం పరిమితం కావాలనుకోవడం సరికాదని అడ్వకేట్ సీహెచ్ అప్పారావు వ్యాఖ్యానించారు.
లీకులు అనివార్యం
కోర్టులోకి జర్నలిస్టులు రాకపోయినా, కేసుకు సంబంధించిన న్యాయవాదులు, హాజరైన వ్యక్తులు, రాజకీయ వర్గాలు, లేదా ఇతర పక్షాలు బయట చెప్పే సమాచారం ద్వారా వార్తలు బయటకు వస్తాయి. అసెంబ్లీలో ఓ మంత్రి రమ్మీ ఆడుతున్న వీడియోలు, సినిమాలు చూస్తున్న దృశ్యాలే బయటకు వస్తున్నప్పుడు కోర్టు రూంలో జరిగేవి బయటకు రాకుండా ఉంటాయా.. ఇదేం డిమాండ్ అని అప్పారావు ప్రశ్నించారు. కాబట్టి ప్రవేశం నిలిపివేయడం అంటే సమాచార ప్రవాహం ఆగిపోతుందనే హామీ లేదు. సుప్రీంకోర్టులో కేసు విచారణలనే లైవ్ చేస్తున్నప్పుడు ఇదేం అభ్యంతరం అని సీనియర్ జర్నలిస్టు జి.ఆంజనేయులు ప్రశ్నించారు.
వైసీపీ న్యాయవాదుల డిమాండ్ వెనుక కారణాలు..
వైసీపీ నాయకులపై ఆరోపణలు తీవ్రంగా ఉండటంతో కొంతమంది మీడియా ప్రతినిధులు చిలవలు పలవలుగా రాస్తున్నారు. విచారణలో వాద, ప్రతివాదనలను తమకు తోచిన రీతిలో విశ్లేషిస్తున్నారు. కొందరైతే సొంత కథనాలనే వండివార్చుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఈ డిమాండ్ చేసి ఉంటారు. సమాచార వక్రీకరణ భయంతో కూడా వైసీపీ న్యాయవాదులు ఆందోళన చెంది ఉండవచ్చు.
ప్రజాస్వామ్య, న్యాయవ్యవస్థ దృష్టిలో...
ప్రజాస్వామ్య న్యాయవ్యవస్థలో కేసుల విచారణలు సాధ్యమైనంత వరకు పబ్లిక్గా జరగాలని అంటున్నారు. కోర్టు ప్రక్రియను పౌరులకు చేరవేయడం, ప్రభుత్వాలను, రాజకీయ పార్టీలను జవాబుదారులుగా నిలబెట్టడం మీడియా బాధ్యత. ఇదే ప్రజాస్వామ్యంలో నమ్మకాన్ని పెంచుతుంది. రహస్యంగా ఉంచడం అనుమానాలను పెంచుతుంది. మీడియా నిషేధ ప్రయత్నం చేయడం వల్ల ఏదో దాచిపెడుతున్నారు అనే అనుమానం పెరుగుతుంది. ఇలాంటి డిమాండ్ ప్రతిపక్షానికి రాజకీయంగా బలమైన దాడి అవకాశం ఇస్తుంది.
లిక్కర్ స్కాం విచారణలో మీడియా ప్రవేశాన్ని ఆపాలని వైసీపీ చేసిన డిమాండ్ సాంకేతికంగా కష్టమైనదే కాక, రాజకీయంగా ప్రమాదకరమైంది కూడా. సమాచార వక్రీకరణను నివారించాలన్న ఉద్దేశం ఉన్నా, ఈ విధానంతో చివరికి ప్రతికూలతే ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంది.
ఇలాంటి సందర్భాల్లో క్రమబద్ధమైన మీడియా బ్రీఫింగ్‌లు, అధికారిక సమాచారం విడుదల వంటి మార్గాలు అనుసరించడం ద్వారా గోప్యత, పారదర్శకత రెండింటినీ సమన్వయం చేయడం సాధ్యమవుతుంది.
ఇదిలా ఉండగా, కేసుకు సంబంధించిన పలు పిటిషన్లను కోర్టు వాయిదా వేసింది. డి. వాసుదేవరెడ్డి, డి. సత్యప్రసాద్‌లకు సంబంధించిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ల విచారణ ఆగస్టు 5కి వాయిదా పడింది. ధనుంజయరెడ్డి, కృష్ణమహెన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప, మిథున్‌రెడ్డి కేసులపై విచారణ ఆగస్టు 4కి వాయిదా వేసింది.
బాలాజీ కుమార్, నవీన్ కృష్ణ బెయిల్ పిటిషన్‌లను ఆగస్టు 7న విచారించనున్నారు. అదే రోజున బాలాజీ కుమార్ యాదవ్ అరెస్టు సమయంలో స్వాధీనం చేసుకున్న రూ. 3.5 లక్షల నగదు విషయంలో ప్రత్యేక పిటిషన్‌ను కూడా విచారణకు తీసుకోనున్నారు.
చెరుకూరి వెంకటేష్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది.
Tags:    

Similar News