పెళ్లి పందిరి తీయలేదు.. తోరణాలు వాడిపోలేదు.. కాటికి చేరిన నవ వధువు..

సత్యసాయి జిల్లాలో విషాదం.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-08-05 11:49 GMT
కళకళలాడుతున్న పెళ్లి పందిరి

పెళ్లి పందిరి తీయలేదు. తోరణాల కళ వాడనే లేదు. పారాణి కూడా ఆరని ఓ నవ వధువు ఉరితాటికి వెలాడింది. పెళ్లిబాజాలు ఇంకా అక్కడ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఉదయం ఆనందంగా వివాహం చేసుకున్న ఆ యువతి అదే రాత్రి ఇంట్లోనే ఉరితాడుకు వెలాడింది. ఉమ్మడి అనంతపురం జిల్లా (సత్యసాయి జిల్లా) సోమందేవపల్లెలో జరిగిన ఈ ఘటన పెళ్లి ఇంటిలోని వారినే కాదు. పల్లె మొత్తం విషాదంలో నింపింది.

వివాహానికి హాజరైన వధువు స్నేహితుల ప్రవర్తనపై వధువు తల్లిదండ్రులు సందేహిస్తున్నారు. ఇంతకీ ఇక్కడ ఏమి జరిగింది?

ఉదయం పెళ్లి జరిగింది. రాత్రి ఆ నవవధువు ఉరితాడును ముద్దాడింది. ఈ సంఘటనతో వధువు, వరుడి ఇంట్లోనే కాకుండా, బంధువులను కూడా విషాదంలో నింపింది. నవ్వులతో తుళ్లిపడాల్సిన ఇంట కన్నీరు పారిన సంఘటన సోమవారం రాత్రి జరిగింది.

సత్యసాయి జిల్లా సోమందేవపల్లెకు చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల కూతురు హర్షిత (22) హైదరాబాదులో ఇంటీరియల్ డిజైనర్ గా నాలుగేళ్ల నుంచి పనిచేస్తోంది. ఆమెకు కర్ణాటక రాష్ట్రం బాగేపల్లెకు సమీపంలోని దిబ్బూరిపల్లెకు చెందిన నరేంద్రతో రెండు కుటుంబాల పెద్దల సమ్మతితో వివాహం నిశ్చయించారు. నిర్ణయించిన ముహూర్తంలోనే సోమవారం ఉదయం బాజాబంత్రీల మధ్య వివాహం ఘనంగా జరిగింది. వివాహ భోజనం చేసిన బంధువులు కొందరు వెళ్లిపోయారు. వరుడు నరేంద్ర తరఫున బంధువులు వధువు హర్షిత ఇంటి వద్దనే ఉన్నారు. హర్షిత వివాహానికిహైదరాబాద్ నుంచి కారులో వచ్చిన స్నేహితులు సాయంత్రం తిరిగి వెళ్లారు. ఇదిలావుంటే..


సాయంత్రం వేళ..

నవదంపతులను కలపడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సాయంత్రం వరకు ఆ ఇంటిలో పెళ్లికళ ఉట్టిపడుతోంది. నవదంపతులు కూడా ఆనందంగానే ఉన్నారు. వివాహ ఘట్టం జరిగే సమయంలో కూడా వధువు హర్షిత ఆనందంగానే ఉన్నట్లు కనిపించిందని అక్కడి వారి ద్వారా తెలిసింది.

సోమవారం ఉదయం వివాహ ఘట్టం పూర్తయింది. అప్పటి వరకు బాగానే ఉన్న హర్షిత రాత్రి పది గంటల తరువాత గదిలోకి వెళ్లి, తలుపులు వేసుకున్నట్లు ఆ గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఎంతకీ బయటికి రాకపోవడంతో సందేహించిన హర్షిత తల్లిదండ్రులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లీ సరికి హర్షిత ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుని వెలాడుతుండడం కనిపించింది.

ఎందుకు తల్లీ ఇంత శిక్ష

పెళ్లి దుస్తుల్లోనే ఉన్న కూతురు హర్షిత ఉరితాడుకు వెలాడుతుండడం చూసిన తల్లిదండ్రులు కృష్ణమూర్తి, వరలక్ష్మి గుండెలు బాదుకుంటూ రోదించారు. కూతురు ఈ ఘాతుకానికి పాల్పడడం జీర్ణించుకోలేని స్థితిలో వారు తల్లడిల్లారని గ్రామస్తుల కథనం. వరుడు నాగేంద్ర తరఫు కుటుంబీకులు తీవ్రం ఆందోళనకు గురయ్యారు.

వెంటనే హర్షితను ఉరితాడు నుంచి కిందికి దించి, ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే హర్షిత చనిపోయినట్లు నిర్ధారించారు.

పెళ్లి పారాణి కూడా ఆరకముందే హర్షిత ఆత్మహత్యకు పాల్పడడానికి కారణాలు తెలియలేదు. ఈ ఘటనతో వారి రెండు కుటుంబాల్లోనే కాకుండా, బంధువులు కూడా తీవ్ర వేదనకు గురయ్యారు.

"పెళ్లికి వచ్చిన స్నేహితులే కారణం" అని హర్షిత తల్లిదండ్రులు కృష్ణమూర్తి, వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.


హర్షిత ఇంట ఇదీ పరిస్థితి

"స్నేహితుల బెదిరింపుల కారణంగానే మా కూతురు ప్రాణాలు తీసుకుంది" అని కృష్ణమూర్తి ఆరోపిస్తున్నట్లు సమాచారం. పెళ్లికి వచ్చిన స్నేహితులు వెళ్లిన అరగంటకే హర్షిత ఆత్యహత్యకు పాల్పడినట్లు తల్లిండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ సంఘటనపై హర్షిత తల్లి వరలక్ష్మి తల్లి మీడియాతో మాట్లాడుతూ,

"హర్షిత అంగీకారం తీసుకున్న తరువాత వివాహం నిర్ణయించాం" అని వరలక్ష్మి స్పష్టం చేశారు. మా ఇంకో కూతురు కూడా మాట్లాడిన అభ్యంతరం చెప్పలేదని ఆమె అంటున్నారు.

"హర్షిత ఇక లేదు. అనే సమాచారం తెలిసిన తరువాత స్నేహితుల నుంచి పోన్స్ కాల్స్ లేవు" అని సందేహం వ్యక్తం చేశారు. ఫోన్ లాక్ తీస్తే కానీ, ఏమి జరిగిందనేది తెలిసే అవకాశం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.

హర్షిత బంధువు ఒకరు మాట్లాడుతూ,

"హైదరాబాద్ నుంచి ఓ యువకుడు మాట్లాడాడు. ఏంటి అంకుల్ మాకు ఎవరికీ తెలియనేలేదు" అని గట్టిగా నిలదీశాడని చెబుతున్నారు. ఈ సందేహాలను వెల్లడిస్తూ, పోలీసులకు హర్షిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

"మెడలో తాళి పడిన తరువాత హర్షితలో మార్పు కనిపించింది" సమీప బంధువు తాను గమనించిన స్థితిలో వెల్లడించారు.

"వరుడు నాగేంద్ర కూడా మంచి మాటలే చెప్పాడు. స్నేహితులతో గతంలో ఎలా ఉన్నావో.. ఇకపై కూడా అలాగే ఉండు" అని హర్షితకు సూచించినట్లు ఆ మహిళ చెప్పారు.

ఈ పరిణామాలన్నీ గమనిస్తే, పెళ్లి అంటే హర్షిత భయపడిందా? లేదా మరే కారణం ఏదైనా ఉందా? అనేది సందేహాస్పదంగా మారింది. హైదరాబాద్ లో ఇంటీరియర్ డిజైనర్ గా ఉద్యోగం చేస్తున్న మా బిడ్డ ప్రవర్తనలో కొత్త మార్పులు ఏమీ కనిపించలేదని తల్లిదండ్రులు కృష్ణమూర్తి, వరలక్ష్మి స్పష్టం చేశారు.

Similar News