పెన్సిల్ తెచ్చిన తంటా.. ఓ తండ్రి ప్రాణం పోయింది
అనంతపురం జిల్లా శెట్టూరులో విషాదం.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-08-06 05:56 GMT
పిల్లలు ఘర్షణ పడ్డారు. ఈ విషయం వారి ఇళ్లలో తెలిసింది. తల్లిదండ్రులు కూడా సిగపట్లు పట్టారు. ఈ దాడిలో ఓ పిల్లాడి తండ్రి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మరణించాడు.ఈ ఘర్షణలకు కారణం వింటే ఆశ్చర్యం కలగక మానదు.
పెన్సిల్ విరిచేశాడని ఇద్దరు పిల్లలు కొట్టుకున్నారు.
ఇది తెలిసి వారి తల్లిదండ్రులు దాడులు చేసుకున్నారు. అనంతపురం జిల్లా శెట్టూరు పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోనే జరిగిన ఈ సంఘటనలో ఓ పిల్లాడి తండ్రి ప్రాణాలను కోల్పోయాడు. ఆ వివరాలివి.
అనంతపురం జిల్లా శెట్టూరు లోని ఎర్రిస్వామి, మరియమ్మ దంపతుల కొడుకు ప్రాథమిక విద్య చదువుతున్నాడు. ఇదే ఊరికి చెందిన ప్రకాష్ ప్రమీల దంపతుల కొడుకు గగన్ కూడా అదే పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నాడు.
శెట్టూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి విద్యార్థులు క్రిష్, గగన్ పెన్సిల్ కోసం ఘర్షణ పడ్డారు. తన పెన్సిల్ క్రిష్ విరిచేశాడని గగన్గొ గొడవపడ్డాడు.
ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థుల మధ్య ఇలాంటి వాతావరణం సహజం. ఇద్దరూ ఆగ్రహంతో పాఠశాల ఆవరణలోనే ఒకరిపై మరొకరు మట్టి వేసుకొని తిట్టుకున్నారు. సాయంత్రం బడి నుంచి ఇంటికి వెళ్లారు. పెన్సిల్ కోసం ఇద్దరు విద్యార్థులు ఘర్షణ పడిన విషయం తల్లిదండ్రులకు తెలిసింది.
తమ కొడుకును క్రిష్ ను కొట్టాడని తెలుసుకున్న తల్లిదండ్రులు ఎర్రిస్వామి, మరియమ్మ ఆగ్రహించారు. శెట్టూరు మండలం ఎర్రబోయిన పల్లెలో ఉన్న బంధువులను పిలిపించారు. ఇంటిలో వారందరూ ఏం చర్చించుకున్నారో తెలియదు.
తమ కొడుకు పెన్సిల్ విరిచేసిన గగన్ ఇంటి వద్దకు వెళ్లి అతని తల్లిదండ్రులు ప్రకాష్ ప్రమీలపై మర్రి స్వామి తో పాటు వారి బంధువులు దాడికి దిగారు. దీంతో గగన్ తండ్రి ప్రకాష్ (37) తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో పడిపోయారు
ఆ కాలనీవాసులు వెంటనే స్పందించి ప్రకాష్ ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కాలనీకి సమీపంలోనే అంటే కూతవేటు దూరంలోనే శెట్టూరు పోలీస్ స్టేషన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణ పోలీసుల దృష్టికి రాలేదని చెబుతున్నారు.
క్రిష్ తల్లిదండ్రుల దాడిలో గాయపడిన ప్రకాష్ ను మెరుగైన చికిత్స కోసం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స తీసుకుంటూ ప్రకాష్ అక్కడ మృతి చెందాడు. మెడికో లీగల్ కేసు కావడంతో (medico legal case -MLC) అక్కడి పోలీసుల నుంచి సమాచారం అందడంతో శెట్టూరు పోలీసులు రంగంలోకి దిగారు.
"నా భర్త పై దాడి చేసి గాయపరచడంతో మరణించాడు" అని ప్రకాష్ భార్య ప్రమీల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మర్రిస్వామికి మద్దతుగా వచ్చి దాడికి పాల్పడిన ఆయన బంధువులు ఎర్రబోయినపల్లికి చెందిన ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
శెట్టూరు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలాజీ ఏమన్నారు అంటే..
"ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గగన్, క్రిష్ పాఠశాల ఆవరణలో ఘర్షణ పడలేదు. బహుశా బయట జరిగి ఉండవచ్చు" అని ప్రధానోపాధ్యాయుడు బాలాజీ మీడియాకు వివరణ ఇచ్చారు.
పిల్లలు ఘర్షణ పడితే పెద్దలు సర్ది చెప్పాలి. పిల్లల గర్షణలోకి పెద్దలు తలదూర్చకూడదు అనే విషయాన్ని కూడా ఇక్కడ మరిచారు. ఇది ఒకరి ప్రాణం తీస్తే, యాడికి పాల్పడినవారు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాలనీవాసులకు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి.