'పులి'వెందులలో టీడీపీది 'కేకే’నా.. జగన్ తీరే కారణమా?
'వైనాట్ పులివెందుల'కు ఇదే సంకేతం అంటున్న మంత్రి సవిత.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-08-14 07:24 GMT
కడప జిల్లా పులివెందులలో మొదటిసారి టీడీపీ జెండా ఎగరవేసింది. జిల్లా పరిషత్ ప్రాదేశికి నియోజకర్గానికి (జెడ్పీటీసీ) జరిగిన ఉప ఎన్నికలో గెలుపొందడం ద్వారా వైసిపి అధితనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగు దేశం పార్టీ గట్టి సవాల్ విసిరింది. పోలింగ్ ఆగస్టు 12న జరిగింది.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి భార్య మారెడ్డి లతారెడ్డి 6.716 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే దక్కాయి. లతా రెడ్డికి 6033 ఓట్ల మెజారిటీ వచ్చింది. స్వతంత్ర అభ్యర్థులకు, కాంగ్రెస్‌కు 100 లోపు ఓట్లు లభించాయి. ఈ స్థానానికి 11 మంది పోటీపడ్డారు. మొత్తంగా 74 శాతం పోలింగ్ నమోదైంది. పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి 2016లో తప్ప ఐదంచెల పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చినప్పటినుంచి ఎపుడూ ఎన్నిక జరగలేదు. జడ్ పిటిసి సభ్యుడు మహేశ్వర్ రెడ్డి 2023లో ఒక ప్రమాదంలో మరణించడంతో ఈ ఉపఎన్నిక అవసరమయింది.
పులివెందుల జగన్మోహన్ సొంతవూరు.సొంత అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ వైఎస్ ఆర్ కుటుంబ సభ్యలు లేదా వైసిపిఅభ్యర్థులే గెలుస్తారు. ఎన్నికలు సాధారణంగా ఏకగ్రీవంగానే ఉంటాయి. పోలింగ్ దాకా వ్యవహారం పోదు. అయితే, ఇపుడు జిల్లా పరిషత్ ప్రాదేశికి నియోజకర్గానికి జరిగిన ఉప ఎన్నికకు పోలింగ్ జరిగింది. తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. జగన్ కోటలోకి టిడిపి ప్రవేశించేందుకు చిన్న కన్నం ఏర్పడింది. అందుకే చిన్న ఎన్నికఅయినా, పులివెందలు జడ్ పిటిసి ఎన్ని రాష్ట్రమంతా ఉత్కంఠ సృష్టించింది.
పులివెందుల ప్రజలకు ఓటు స్వేచ్ఛ
"ఈ విజయం అద్భుతం. ఓటర్ల చైతన్యానికి నిదర్శనం" అని జెడ్పీటీసీ విజేత లతారెడ్డి వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒక రోజు ముందు పులివెందుల ప్రజలకు స్వేచ్ఛ లభించింది" అని జిల్లా ఇన్ చార్జి మంత్రి ఎస్. సవిత అభివర్ణించారు. రానున్నఎన్నికల్లో "వైనాట్ పులివెందుల" అనేది నిరూపించడానికి ఇదే నిదర్శనం అని మంత్రి ఎస్. సవితమ్మ హెచ్చరించారు. ఆమె దృష్టిలో 2029 అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం లో జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు బాట ఏర్పడిందని అర్థం.దీనికి కారణం, అక్కడ ఓటర్లు స్వేచ్ఛగా ఓటువేసేందుకు పోలింగ్ స్టేషన్ కు రావడమేని, పులివెందుల ప్రజలకు స్బాతంత్య్రం వచ్చిందని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ ఎన్నికల నేపథ్యంలో
కడప జిల్లా పులివెందులలో రాజకీయం తిరగబడిందా? వైఎస్. జగన్ కు ఎదురుగాలి ప్రారంభమైందా? క్యాడర్, నేతలను నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలు ఆయన స్వయంకృతమే అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ ఎదురు దెబ్బలకు పులివెందుల ప్రాంతంలో కార్యకర్తలు నేతలను పట్టించుకోకపోవడం కూడా కారణంగా భావిస్తున్నారు. అందువల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒంటిమిట్టలోనూ ఎదురుదెబ్బ
రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఆకేపాటి అమరనాథరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీని పరిధిలోని ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానం ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఇరగంరెడ్డి వెంకటసుబ్బారెడ్డికి 4,632 ఓట్లు దక్కాయి. వైసీపీ అభ్యర్థి ముద్దుకృష్ణారెడ్డికి 1,212 ఓట్లు దక్కాయి. దీంతో ఐదు వేల ఓట్లకు పైగానే టీడీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి వెంకటసుబ్బారెడ్డి విజయం సాధించారు. ఇది వైసీపీ నేతలకు ఊహించని చెంపదెబ్బగా భావిస్తున్నారు.
అంతర్మధనం
ఈ ఎన్నికపై కడప వైసిపి ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డి స్పందించారు.
" ఇది అనైతిక ఎన్నిక. కార్యకర్తలు నిరుత్సాహ పడవద్దు" అని ఎంపీ అవానాష్ రెడ్డి ఓ వీడియో విడుదల చేశారు.
"మాకు గుణపాఠం చెప్పే రోజు వస్తుంది. కానీ, ఈ తరహాలో ఏకపక్షం పోలింగ్ ఉండదు" అని ఆయన అన్నారు.