తొక్కిసలాటలో మరణించిన కుటుంబాలకు 25లక్షలు నష్ట పరిహారం

సంఘటన పై పూర్తి విచారణ చేపడుతామని, సంబంధిత అధికారుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రులు వెల్లడించారు.;

Update: 2025-01-09 08:13 GMT

వైకుంఠ ఏకాదశి దర్శనం టోకన్‌ ఇచ్చే కేంద్రం వద్ద బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన మృతుల కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నష్ట పరిహారం ప్రకటించింది. ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. గురువారం ఉదయం రాష్ట్ర హోం మంత్రి అనిత, రాష్ట్ర రెవెన్యూ మంత్రి, తిరుపతి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి కొలుసు పార్థసారథి, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌ వెంకటేశ్వర్, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, జాయింట్‌ కలెక్టర్‌తో కలసి రుయా ఆసుపత్రి మార్చురిలో ఉన్న మృతులను పరిశీలించారి. మృతుల కుటుంబాలను ఓదార్చి వారి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం మీడియా తో మంత్రులు మాట్లాడుతూ ఏకాదశి దర్శనం టోకన్‌ ఇచ్చే ప్రదేశం వద్ద తొక్కిసలాటలో మరణించిన బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. వైకుంఠ ఏకాదశి దర్శనం టికెట్లు పొందే ప్రతి చోట సీసీ కెమేరాలు ఉన్నాయని, వాటిని పరిశీలించి ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మృతి చెందిన వారి కుటుంబానికి రూ.25 లక్షలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ సంఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. ఇకపై ఇలాంటి సంఘటన జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మృతులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారని, వారి మృత దేహాలను ప్రత్యేక వాహనం ద్వారా ఒక అధికారిని పంపించి వారి స్వగ్రామాలకు చేర్చడం జరుగుతుందని వెల్లడించారు. ఈ ఘటనకు కారణాలు తొందరపాటు చర్యా? లేక సమన్వయ లోపమా? అనేది విచాణలో తేలుతుందని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత చెప్పారు. టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద ఒక్క సారిగా గేట్లు తెరవడంతో తొక్కిసలాట జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు.

Tags:    

Similar News