జగన్ హయాంలో 7లక్షల ఎకరాలను తొలగించారు
సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో శుక్రవారం మంత్రి వర్గ సమావేశం జరిగింది.;
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో నిషేధిత భూముల జాబితా నుంచి భారీ ఎత్తున భూములను తొలగించారని, అలా 7లక్షల ఎకరాలను జగన్ ప్రభుత్వం తొలగించిందని, దీనిపైన అధ్యాయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సత్యసాయి జిల్లాతో పాటు అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఈ భూముల తొలగింపు ఎక్కువుగా జరిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, ఈ భూములపై మంత్రుల ఆధ్వర్యంలో ప్రత్యేక సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించిన 7లక్షల ఎకరాల భూమిని ఏమి చేయాలనే దానిపై స్టడీ చేసి ప్రభుత్వానికి మంత్రి వర్గ ఉప సంఘం నివేదిక అందజేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా భూముల అవకతవలపై నివేదిక ఇవ్వాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో శుక్రవారం మంత్రి వర్గ సమావేశం జరిగింది. నిషేధిత భూములపైనే ఎక్కువ సమయం మంత్రి వర్గ సమావేశంలో చర్చించారు. దీంతో పాటు పలు అంశాలపై చర్చించిన కేబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మరో 62 అసెంబ్లీ నియోజక వర్గాల్లో 63 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ధాన్యం కొనుగోలుకు రూ. 700 కోట్లు రుణం తీసుకోవాలనే ప్రతిపాదనలను ఆమోదం తెలిపింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను హేతుబద్దీకరణకు, వాటిల్లో ఆర్‌టీజీఎస్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తోటపల్లి బ్యారేజీపై మినీ హైడల్ ప్రాజెక్టుల నిర్మాణాలకు ఆమోదం తెలిపిన మంత్రి వర్గం కడప జిల్లా సీకేదిన్నెలో 2,595 ఎకరాల బదిలీకీ స్టాంప్ డ్యూటీ మినహాయింపులు ఇవ్వాలనే ప్రతిపాదనలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఎలాంటి అభ్యంతరాలు లేని ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరణకు కూడా ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫెర్రో, అల్లాయ్స్ ఇండస్ట్రీస్‌కు విద్యుత్ టారిఫ్ తగ్గింపు ఇవ్వాలనే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన కేబినెట్ విద్యుత్ పన్నులో టారిఫ్ తగ్గింపును మార్చి నెల వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మత్స్యకార భరోసా వంటి పలు పథకాలపైన చర్చించిన కేబినెట్ ఎప్పటి నుంచి అమలు చేస్తామనే విషయాన్ని స్పష్టం చేయలేదు. వచ్చే ఆర్థిక సంవ్సరం నుంచి వీటికి శ్రీకారం చుట్టే విధంగా చర్చలు సాగాయి. పేదల ఇంటి స్థలానికి సంబంధించి ఆదేశాలు మాత్రం జారీ చేశారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలం పేదలకు ఇచ్చే విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు.