అబ్బబ్బా.. ఏమి సొర.. అదిరేన్ దీని ధర..
“ఇంత పెద్ద సొరను ఈ తీరంలో ఎప్పుడూ చూడలేదు” అని పెద్దలు గుర్తుచేశారు.;
అనకాపల్లి జిల్లా పూడిమడక తీరం. శనివారం తెల్లవారుజామున మత్స్యకారులు ఎప్పటిలాగే గాలాలు వేశారు. అయితే ఎప్పటి మాదిరి కాకుండా ఈరోజు సముద్రం వారికో అద్భుత కానుక ఇచ్చింది. వారి గాలానికి చిక్కింది సాధారణ చేప కాదు… 15 అడుగుల పొడవు, 500 కిలోల బరువున్న భారీ సొర!
“మొదటిసారి దగ్గరికి రాగానే గుండె కొట్టుకోవడం మరిచిపోయినట్టుంది” అని మత్స్యకారుడు మడ్డు నూకరాజు నవ్వుకుంటూ గుర్తుచేసుకున్నారు.
“ఆ సైజ్ చూసి క్షణం భయపడ్డాం. కానీ వదిలేస్తే జీవితంలో మళ్లీ ఇలాంటిది రావొచ్చా? అనిపించింది. అందరం పడవలో ఒక్కసారిగా ఉత్సాహంగా కదిలిపోయాం” అని ఆయన చెప్పారు.
ఆ భయాన్ని పక్కన పెట్టి, బల్లేలతో పొడిచి, తాడుతో బిగించి, అలలతో పోరాడుతూ 5 గంటలపాటు పడవ వెనుక లాగుతూ తీరం చేరువ చేశారు.
“మధ్యలో అలలు ఎంత దెబ్బకొట్టాయో… కానీ మేము కూడా అట్టే పట్టుదలతో లాగాం. చివరికి తీరం కనిపించగానే ఊపిరి పీల్చుకున్నాం” అని నూకరాజు గారు సంతోషంగా చెప్పారు.
తీరం చేరుకున్న తర్వాత పూడిమడకలో గుమిగూడిన ప్రజలు ఆశ్చర్యంతో ఆ సొరను చూశారు. “ఇంత పెద్ద సొరను ఈ తీరంలో ఎప్పుడూ చూడలేదు” అని పెద్దలు గుర్తుచేశారు.
ఆ సొర చివరికి వేలం వేసి రూ.34 వేలకు అమ్ముడైంది. ధర మా అంచనాలకు మించి వచ్చింది. కానీ దీన్నెప్పుడూ మర్చిపోలేము… ఇది మా వేట జీవితంలో ఒక మైలురాయి” అని నూకరాజు గారు గర్వంగా చెప్పారు.