కుమార్తెకు న్యాయం కోసం.. కువైట్ నుంచి వచ్చి చంపేసి వెళ్లిపోయిన తండ్రి

కుమార్తెపై చేయి వేసిన వ్యక్తిని కువైట్ నుంచి వచ్చి చంపేసి వెళ్లిపోయిన తండ్రి. ప్రస్తుతం ఈ సంఘటన సంచలనం సృష్టిస్తోంది.;

Update: 2024-12-12 04:39 GMT
ఎక్కడ కువైట్.. ఎక్కడ ఓబులవారిపల్లె.. సుమారు 3,500 కిలోమీటర్లు.. విమాన ప్రయాణం దాదాపు మూడున్నర గంటలు.. అక్కడి నుంచి ఓబులవారిపల్లె వచ్చి తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని చంపేసి తిరిగి వెళ్లిపోయాడో తండ్రి. ప్రస్తుతం ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తండ్రి విడుదల చేసిన వీడియో హల్ చల్ చేస్తోంది. పగలు, ప్రతికారం, పోలీసుల పట్టింపులేని తనమే ఈ సంఘటనకు కారణమని భావిస్తున్నారు. అసలింతకీ ఏమి జరిగిందంటే... వరుసకు మనుమరాలయ్యే 13 ఏళ్ల బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ దివ్యాంగుణ్ణి ఓ తండ్రి చంపేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఈ పని చేశానంటున్నాడు నిందితుడు.
పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే ఈ చావు తప్పేదేమోననే వాదన కూడా వినిపిస్తోంది.
తన బిడ్డ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువుపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు సరిగా స్పందించకపోవడంతో ఒక వ్యక్తి ఏకంగా కువైట్‌ నుంచి వచ్చి అతన్ని హతమార్చాడు. తిరిగి కువైట్‌ వెళ్లిపోయాడు. అక్కడి నుంచి డిసెంబర్ 11న వీడియో విడుదల చేశారు. దీంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం కొత్తమంగంపేటలో శనివారం తెల్లవారుజామున దివ్యాంగుడైన గుట్ట ఆంజనేయులు దారుణ హత్యకు గురయ్యారు. ఆయన వయసు 59 ఏళ్లు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుట్ట ఆంజనేయులు తన కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో తానే కువైట్‌ నుంచి వచ్చి మరీ హత్య చేసి వెళ్లానని నిందితుడే సామాజిక మాధ్యమాలల్లో వీడియోను పోస్టు చేయడం సంచలనమైంది.
కొత్త మంగంపేటకు చెందిన చంద్రకళ, ఆమె భర్త ఆంజనేయప్రసాద్‌ కువైట్‌లో ఉంటున్నారు. కువైట్ వెళుతూ 12 ఏళ్ల తమ కుమార్తెను ఊళ్లో ఉంటున్న చెల్లెలు లక్ష్మి, వెంకటరమణ దంపతుల వద్ద ఉంచారు. ఇటీవల వెంకటరమణ తండ్రి ఆంజనేయులు మనవరాలి వరసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని సమాచారం.
ఆ విషయాన్ని బాలిక తన తల్లి చంద్రకళకు ఫోన్‌ చేసి తెలిపింది. ఆమె వెంటనే చెల్లెలు లక్ష్మికి ఫోన్‌ చేసి అడిగింది. ఆమె నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో ఆందోళన చెందిన చంద్రకళ కువైట్‌ నుంచి వచ్చి ఓబులవారిపల్లె పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు ఆంజనేయులును పిలిపించి మందలించి వదిలేశారు. ఇది ఆమెకు నచ్చలేదు. ఈ విషయాన్ని భర్త ఆంజనేయ ప్రసాద్‌కు చెప్పింది.
తీవ్ర ఆవేదనకు గురైన ఆ బాలిక తండ్రి.. ఆడపిల్లపై అసభ్యకరంగా ప్రవర్తించినా పోలీసులు పట్టించుకోకపోవడం ఏమిటని ఆవేదన చెందాడు. తనకు తెలిసిన వాళ్లతో వాకబ్ చేయించారు. అయినా పోలీసుల నుంచి స్పందన కరవైంది.
దాంతో తానే కువైట్‌ నుంచి వచ్చాడు. శనివారం తెల్లవారుజామున ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేసి వెంటనే కువైట్‌ వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని వివరిస్తూ బుధవారం సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేశారు. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనన్నాడు. చట్టం ముందు తాను దోషినే అయినా తన బిడ్డ పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వ్యక్తిని వదలకూడదని అనుకున్నాను అన్నారు. పోలీసులకు లొంగిపోతానని వెల్లడించాడు. చట్ట ప్రకారం న్యాయం జరగకే హత్య చేశానని పేర్కొన్నారు.
Tags:    

Similar News