మదనపల్లెలో చరిత్ర సాక్షుల ఊచకోత....
చల్లదనానికి కేరాఫ్ మదనపల్లె. ఈ ఊరికి ఆత్మ వంటిది సీటీఎం రోడ్డు . ఇక్కడి చెట్లు, ప్రకృతి ప్రేమికులు ఎందుకు శోకిస్తున్నారు!
Byline : SSV Bhaskar Rao
Update: 2024-11-10 14:38 GMT
పదునెక్కిన రంపపు కోతకు చెట్లు నేలకొరిగాయి. చెట్టు మొదళ్లను బుల్డోజర్లతో పెకిలించారు. వీటిని చూస్తున్న వారి హృదయాలు బరువెక్కాయి. కొందరి కళ్ళ నుంచి నీళ్లు కూడా జలజలరాలాయి. చరిత్ర కాలగర్భంలో కలిసింది. పర్యావరణానికి సవాల్ గా మారింది. రోడ్డు పక్కన చల్లదనం, సేదదీర్చే చెట్లపై కాఠిన్యం చాటుకున్నారు.
బ్రిటిషర్లు దేశాన్ని ఆక్రమించి, సంపదను దోచుకుని ఉండవచ్చు గాక. వారు చేసిన కొన్ని పనుల్లో జనజీవనానికి మేలు చేసేవి కూడా ఉన్నాయని చెప్పడంలో సాహసం ఏమి కాదు. ఆ కోవలోనిదే..
మదనపల్లి పట్టణ నుదిటిన దిద్దిన పచ్చటి తిలకం సీటీఎం రోడ్డు. విస్తరణ పేరిట ఈ రోడ్డు వెంట ఉన్న దాదాపు వందేళ్లకు పైబడే వయస్సున్న చింతచెట్లను అడ్డంగా నరికి వేశారు. ఈ వృక్ష సంహారం నిరాటంకంగా సాగింది. జిడ్డు కృష్ణమూర్తి తాత్వికతకు జీవం పోసిన పురిటిగడ్డ మదనపల్లి తల్లడిల్లింది. కొందరు శరీరం నుంచి ఓ భాగమే వేరైందనే మానసిక వేదనకు గురయ్యారు. కారణం ఒకటే..
మదనపల్లి పట్టణానికి మధ్యలో సీటీఎం రోడ్డు ఉంటుంది. ఈ రోడ్డుకు కుడి పక్కన ఉండే కమర్షియల్ బిల్డింగ్స్ వెనకవైపు బాహుదా అన్నది కూడా ప్రవహిస్తుంది. ఇది ఒక ఓ కాలువలా కనిపిస్తుంది. 1996లో వచ్చిన వరదల కారణంగా భారీ ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. అయితే, టౌన్ బ్యాంకు సమీపంలో ఉన్న పచ్చారిచెట్టుతో పాటు ఈ చింతచెట్లు కూడా వరద ప్రవాహాన్ని నిలువరించాయి. అని చెప్పడం అతిశయోక్తి కాదు.
చరిత్ర చెప్పే పాఠం
మదనపల్లెకు శా.శ 907 మంచి చరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కాలంలో చోళ సామ్రాజ్యం భాగంగా ఇది ఉండేదననేది చరిత్ర. మదనపల్లె పట్టణంలోని సిపాయివీధి, కోటగడ్డ (ఖిలా), అగర్తవీధి (కందక్ గలి)తో పాటు పలు ప్రాంతాలు ఇక్కడ ఒకానప్పుడు రాజులు పరిపాలించినట్లు చరిత్ర చెప్పే పాఠం. అంతేకాదు.
మదనపల్లిని విజయనగర సామ్రాజ్య పాలగాళ్లు బసవన్న, మాదన్న కూడా పాలించినట్లు చెబుతున్నచరిత్రకు సాక్ష్యంగా ఇక్కడ రెండు కొండలు ఉన్నాయి. ఒకటి మాదన్నకొండ రెండవది బసన్నకొండ. దీనివల్లే ఈ పట్టణానికి మదనపల్లె అనే పేరు వచ్చినట్లు కూడా ఇంకో కథనం ప్రచారంలో ఉంది. మర్యాద రామన్నపురం అనే పేరు ఉండేదని కాలక్రమంలో అది మదనపల్లెగా రూపాంతరం చెందినట్లు చెబుతారు. ఒకానొకప్పుడు సౌదీ అరేబియాలోని మదీనా నుంచి కొందరు తత్వవేత్తలు వచ్చి స్థిరపడ్డారు. వారి పేరున మదీనావారిపల్లె అనే పేరు కూడా ఉండేదని తర్వాత ప్రస్తుతం మదనపల్లిగా స్థిరపడి కూడా మరో కథనం.
మదనపల్లె 1565లో గోల్కొండ నవాబు ఆధీనంలోకి వెళ్లిందని, 1713లో కడప నవాబ్ అబ్దుల్ నబీ ఖాన్ తన ఆధీనంలోకి తీసుకున్నారనేది చరిత్ర పాఠం. ఆ తర్వాత ఈ ప్రదేశం బ్రిటిషర్ల ఆధీనంలోకి వెళ్ళింది. రాజులు మారినా, బ్రిటీషర్లు వచ్చినా, జన సంక్షేమానికి వారు చేసిన పనులు చరిత్రలో చిరస్థాయి స్థానం పొందారు. అందులో బ్రీటీషర్ల వాసనలు ఇంకా చెక్కుచెదరని గుర్తులుగా ఉన్నాయి.
వారి కాలంలోనే సబ్ కలెక్టర్ బంగాళా, కార్యాలయం, క్షయ వ్యాధిగ్రస్తులు కోసం ఆరోగ్యవరం మెడికల్ సెంటర్- సానిటోరియం (AMC-Sanitorium), 1911 లో ఎంఎల్ఎల్ (Mary lott Lyles) ప్రసూతి ఆసుపత్రి, ఐరిష్ మహిళ అనిబిసెంట్ సారధ్యంలో రాయలసీమలోనే బీటీ (Besant theosophical) మొదటి కాలేజీని 1915 జూలై 19న ప్రారంభించి డాక్టర్ అన్నెబిసెంట్ 1917లో మద్రాసు యూనివర్సిటీకి అనుబంధం చేశారు. పట్టణంలో జేసీఎం చర్చ్, సి ఎస్ ఐ చర్చలు కూడా ప్రముఖమైనవి. ఇంతటి చారితత్రక నేపథ్యం ఉన్న ఈ పట్టణం ఏ పరిధిలో ఉండేదంటే..
కడప మొదటి కలెక్టర్ గా సర్ ధామస్ మన్రో (Sir Thomas Munro) కాలంలో మదనపల్లిలో కలెక్టర్ బంగ్లా నిర్మించారు. 1850లో మదనపల్లి ను సబ్ డివిజన్ గా ఏర్పాటుచేసి ఎఫ్బి మనోలెను సబ్ కలెక్టర్ గా నియమించారు. ఆ తర్వాత మదనపల్లి సబ్ కలెక్టర్ గా వచ్చిన సర్ రాబర్ట్ హార్సిలీ పాలనలో ఉండగా, ప్రస్తుతం ఆంధ్ర ఊటీగా ఉన్న హార్సిలీ హిల్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. అక్కడ వేసవి విడిది కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు కొండకు తాను గుర్రంపై వెళ్లే సందర్భంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, పర్యాటకులను ఆకర్షించడానికి వీలుగా రోడ్డు సదుపాయాన్ని కల్పించారు. హార్సీలీహిల్స్ లోని పున్నమి రెస్టారెంట్ లోకి వెళ్లే ముందు కుడి చేతిపపు ఓ సమాధి కనిపిస్తుంది. అది హార్సిలీ ప్రభువు కొడుకుది. పుట్టినరోజే చనిపోయిన తన కొడుకును హిర్సిలీ ఆ కొండపైనే ఖననం చేశారు. ఇదిలా ఉంటే...
మరో అశోకుడు..
మదనపల్లి సబ్ కలెక్టర్ గా సర్ కాలరిమ్స్ అవెన్యూ అనే బ్రిటిష్ అధికారి పనిచేశారు. ఆయన పేరు మదనపల్లె చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. బ్రిటిషర్ల కాలంలోనే రైల్వే నిర్మాణం పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తిరుపతి- పాకాల- ధర్మవరం మార్గంలో సీటీఎం (చిన్నతిప్పసముద్రం) వద్ద మదనపల్లి రైల్వేస్టేషన్ ఉంది. ఇక్కడి నుంచి మదనపల్లె పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఉన్న దాదాపు పది కిలోమీటర్లు రోడ్డుకు ఇరుపక్కల భారీ చింతచెట్లు చల్లదనాన్ని పంచుతూ ఉంటాయి. ప్రస్తుతం ప్రభుత్వానికి ఏటా రూ.లక్షల్లో ఆదాయం కూడా ఇస్తున్నాయి. ఈ విషయం పక్కన ఉంచితే..
మదనపల్లి ఆత్మ
పట్టణంలోకి ప్రవేశించిన తర్వాత ఆర్టీసీ బస్టాండ్ నుంచి బెంగళూరు బస్టాండ్ వరకు ఉన్న సీటీఎం రోడ్డు మదనపల్లెకు ఆత్మ వంటిది. ఈ రోడ్డు పక్కన దాదాపు 100 ఏళ్ల వయసుకు పైబడిన చింత చెట్లు చల్లదనమే కాదు ఆహ్వాదాన్ని పంచుతాయి. వీటిని ఆనాటి మదనపల్లె సబ్ కలెక్టర్ సర్ కాలరిమ్స్ అవెన్యూ నాటించారు. ఆయన పేరిట మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో శిలాఫలకం కూడా ఉంది.
ఈయన పేరుతో వీధి..
బ్రిటిషర్లు ఇంకా ఈ ప్రాంతంలో సజీవంగానే ఉన్నారు. పేర్లు చిరస్థాయిగా ఉన్నాయి. అందులో మదనపల్లె పట్టణంలో ఓ వీధికి "అవెన్యూ" పేరుతోనే ఉంది. అధికారిక రికార్డుల్లో కూడా ఇప్పటికీ అవన్నీ వీధిగానే దాన్ని మున్సిపాలిటీలో పరిగణిస్తారు. ఈయన కాలంలోనే సీటీఎం రోడ్డులో చింతచెట్లను నాటించారు. అవి భారీ వృక్షాలుగా మారి రోడ్డు పక్కన ఉండడమే కాదు. వృక్ష సంస్కృతిని ఆ పదానికి అర్థాన్ని చెబుతాయి. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. మదనపల్లి అంటే పెన్షనర్ల స్వర్గధామం కూడా. చల్లదనానికి మారుపేరైన ఈ పట్టణంలో ఉద్యోగ విరమణ తర్వాత స్థిరపడాలని చాలామంది కోరుకుంటారు. ఈ వాతావరణమే ఆరోగ్యవరం సమీపంలో టీబీ శానిటోరియం ఏర్పాటు చేయడానికి కూడా అవకాశం కల్పించింది. చల్లదనానికి మారుపేరైన ఈ ప్రదేశం క్షయరోగులకు ప్రకృతి అందించిన వరం.
ఇప్పుడు ఏమైంది అంటే..
మదనపల్లి పట్టణం విస్తరించింది. అవసరాలు పెరిగాయి. వాహనాల సంఖ్య కూడా పెరిగింది. ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ కారణాలతోనే సీటీఎం రోడ్డు (మదనపల్లె పట్టణానికి గుండెగా మధ్యలో ఉంటుంది) లో వందల ఏళ్ల నాటి చింత చెట్లు ఓ ల్యాండ్ మార్క్ గా నిలిచాయి. ఆర్టీసీ బస్టాండ్ నుంచి టౌన్ బ్యాంక్ సర్కిల్ కు వెళ్లే ఈ మార్గంలో కుడిపక్క వాణిజ్య దుకాణాలు, నివాసాలు. వీటిని అనుకునే రోడ్డు. దీనిని అనుకునే వరుసగా పేర్చినట్లు నిటారుగా ఉన్న భారీ చింతచెట్లు. వాటికి పక్కనే విశాలమైన ఖాళీ స్థలం. ఆ స్థలానికి పక్కనే కమర్షియల్ భవనాలు ఉన్నాయి.
రవాణాకు ఆటంకమనీ..
ఆంధ్రలోని మదనపల్లె నుంచి కర్ణాటక, తమిళనాడుకు దగ్గరగా ఉంటుంది. దీంతో పెరిగిన అవసరాల దృష్ట్యా రవాణాకు ఆటంకంగా మారిందనే కారణంతో వంద నుంచి 150 సంవత్సరాల చరిత్ర కలిగిన చింత చెట్లను నిర్దాక్షిణ్యంగా నేలకూల్చారు. వీటితోపాటు మద్దిమాన్లు కూడా ఇక్కడి చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తాయి. వీటిని కూడా చరిత్ర పుటల నుంచి చెరిపేసే విధంగా. కూకటివెళ్లతో సహా పెకిలించారు. ఇక్కడి సీటీఎం రోడ్డులో 27 చింతచెట్లు అందులో ఓ రావి చెట్టు ఉంటే, వీటిని నరికేయం వల్ల సుమారు 180 టన్నుల కలప వచ్చిందని చెబుతున్నారు. ఆర్ అండ్ బీ పరిధిలోని ఆ చెట్లను కూల్చడానికి అటవీశాఖ అనుమతి ఇవ్వాలి. ఆ తరువాత వేలం ద్వారా విక్రయించిన తరువాత నరికివేత జరగాలి. ఇవేమీ ఇక్కడ అమలు జరిగినట్లు లేదంటున్నారు.
అనుమతి ఏమని ఇచ్చారంటే..
కాలం తీరిన చెట్లు తొలగించడానికి 2022 ఏప్రిల్ 18వ తేదీ అప్పటి చిత్తూరు వెస్ట్ ఢీఎఫ్ఓ రవిశంకర్ అనుమతి మంజూరు చేశారు. అదే సమయంలో మరో ప్రదేశంలో అందకు రెండింతలుగా 52 మొక్కలు నాటడం ద్వారా రక్షించాలనే నిబంధన కూడా చేర్చారు. దీనిపై మదనపల్లె ఆర్ అండ్ బీ ఈఈకి స్పష్టమైన సూచనలు చేశారు. "రోడ్డుకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించడానికి అనుమతి ఇస్తున్నాం. అంతకుముందు బహిరంగ వేలం నిర్వహించడానికి ప్రకటన ఇవ్వండి. ఆ తరువాత కలప తరలించుకోవడానికి అటవీశాఖ ట్రాన్సిట్ పర్మిట్ ఇవ్వడానికి వేలం పాట నిర్వహించాలి" అని స్పష్టంగా పేర్కొంది. కాగా,
ఇటీవల కూడా అన్నమయ్య జిల్లా కలెక్టర్ ద్వారా పట్టణంలో అన్ని ప్రాంతాలను పరిశీలించడంలో మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా (జహా) శ్రద్ధ తీసుకున్నారు. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా చింతచెట్లను తొలగించడానికి తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో అన్నివర్గాల అభిప్రాయం తీసుకున్న తరువాతే ఎమ్మెల్యే జహా చెట్ల తొలగించే ప్రక్రియ పూర్తి చేశారనేది ఆయన కార్యాలయం స్పష్టం చేస్తోంది.
చెట్లు కొట్టేయడానికి ముందు వేలం పాట నిర్వహించకపోవడం వల్ల రాజకీయ వివాదానికి తెర లేసినట్లు కనిపిస్తోంది.
దీనిపై టీడీపీ రైతు సంఘం నేత రాటకొండ గుర్రప్పనాయుడు మాట్లాడుతూ, అంతర్మథనానికి గురయ్యారు. "ఈ చింతచెట్ల జీవితకాలం తీరింది. అందువల్ల తొలగిస్తున్న మాట వాస్తవమే. ప్రత్యామ్నాయంగా మొక్కలు నాటుతారు" అని చెప్పిన గుర్రప్పనాయుడు జరిగిన పొరపాటున కూడా ప్రస్తావించారు. "మదనపల్లె వ్యక్తులుగా ఇక్కడి చల్లదనం అనే మారుపేరును కాపాడాల్సిన బాధ్యత ఉంది. కనీసం 20 ఏళ్ల కిందట అయినా సరే జాగ్రత్త పడి ఉంటే బాగుండేది. ఈ చింత చెట్లకు చుట్టూ మట్టితో చిన్నపాటి అరుగు నిర్మించి ఉంటే, బాగుండేది. ఆ పని చేయడానికి ఆలోచన చేయకపోవడం పొరబాటే" అని గుర్రప్పనాయుడు అభిప్రాయపడ్డారు.
మదనపల్లె పట్టణానికి ఆత్మగా ఉన్న సీటీఎం రోడ్డులో చింతచెట్లను తొలగించకుండా కాపాడే పరిస్థితి ఉంది. దానిని విస్మరించారని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ముందుగా చెప్పినట్లు ఎడమవైపు ఉన్న భవనాల ఆక్రమణలు తొలగించి, కుడివైపు ఖాళీ స్థలంలో సర్వీస్ రోడ్డు నిర్మించడం ద్వారా మధ్యలో చింత చెట్లను అలాగే కాపాడేందుకు ఆస్కారం ఉండేది. దీనిని ఎందుకు విస్మరించారనేది అటవీ అధికారులు, ఆర్ అండ్ బి తోపాటు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులే చెప్పాలి.
దీనిపై సీనియర్ జర్నలిస్టు శివప్రసాద్ మాట్లాడుతూ, "మదనపల్లె చరిత్ర నుంచి ఓ పేజీ చెదిరిపోయింది." అని అన్నారు. ఈ ప్రాంతంలో ప్రకృతి "వృక్ష సంస్కృతి పాఠాలు" నేర్పుతుంది" అని గుర్తు చేశారు. చింతచెట్లను తొలగించకుండానే, రోడ్డు విస్తరణకు ఉన్న అవకాశాలను పరిశీలించి ఉంటే బాగుండేది" అని శివప్రసాద్ అభిప్రాయపడ్డారు.
ట్రీ కల్చర్ c/o మదనపల్లి..
పేదవాడి ఊటీ (poor man's Ooty)గా మదనపల్లి సమీపంలోని హార్సిలీహిల్స్ (horsley hills)కు ఉన్న పేరు. ఇక్కడికి వెళ్లాలంటే మదనపల్లి మీదుగానే ప్రయాణించాలి. కడప జిల్లా రాయచోటి నుంచి కూడా కురబలకోట మండలం అంగళ్లు వరకు చేరుకుని అటు నుంచి అనంతపురం మార్గంలో ఉన్న కాండ్లమడుగు క్రాస్ నుంచి హార్సిలీహిల్స్కి వెళ్ళవచ్చు. సమస్య ఇది కాదు. మదనపల్లెకు ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి తాలూకాలకు ఒక ప్రత్యేకత ఉంది.
ఏ పల్లె కైనా వెళ్ళండి. ఆ ఊరికి ఒక చెరువు. ఇంటి ముందు ఓ చెట్టు. ఆ ఇంటికి ఒక ఆవు. తప్పకుండా కనిపిస్తుంది. అంతేకాదు ఆ ఊరి మధ్యలో ఓ చెట్టు ఉంటే దాని చుట్టూ గ్రామస్తులు కూర్చునేందుకు రచ్చబండ నిర్మించి ఉంటారు. ఆ ఊరిలోకి వెళ్లడానికి ప్రయాణించే రోడ్డుకు ఇరుపక్కల పచ్చటి చెట్ల నుంచి వచ్చే ల్లటి గాలిని ఆస్వాదిస్తూ, నీడపట్టున హాయిగా ప్రయాణం చేయవచ్చు. ఇది మదనపల్లె ప్రాంతంలో కనిపించే ట్రీ కల్చర్. ఇంకో మాట కూడా చెప్పుకోవాలి.
ఏ మార్గంలో అయినా వెళ్లండి..
మీరు ఎప్పుడైనా తిరుపతికి చేరుకుంటే. కడప నుంచి, నెల్లూరు వైపు నుంచి, మద్రాస్ పక్క నుంచి, అనంతపురం నుంచి మదనపల్లి మార్గం, కడప నుంచి రాయచోటి మార్గం నుంచి మదనపల్లికి వచ్చినా సరే. తిరుపతి నుంచి పీలేరు, మదనపల్లి, చిత్తూరు నుంచి అటు కుప్పం, ఇటు హైదరాబాద్ వెళ్లడానికి మదనపల్లి మార్గం. కుప్పం నుంచి తమిళనాడులోని క్రిష్ణగిరి వైపు, లేదా చెన్నైమార్గం వైపు ఎటు వెళ్లినా సరే. మనకు కనిపించే దృశ్యాలు ఒకటే.. అనేక పెద్ద మలుపులు, రోడ్డు వెంట వద్దన్నా కనిపించే భారీ చింత, వేప, నీలగిరి, కానుగ, అల్లనేరేడు చెట్లు మొక్కలు విపరీతంగా ఉంటాయి.
వేసవికాలంలో ఈ మార్గంలో పయనిస్తూ ఉంటే మనకు ఏమాత్రం ఎండవేడి అనే భావన కలగదు. వాతావరణం అంత చల్లగా ఆహ్లాదంగా ఉంటుంది. ఇక శీతాకాలం అయితే వాహనాల్లో వెళ్లేవారు కిటికీలు మూసేసి, సెలవులు మఫ్లర్లు లేదా స్వెటర్లు ధరించాల్సిందే. అంతటి హాయిగా ఉంటుంది.
ఈ చిత్రంలో కనిపించే వాతావరణం చెదిరిపోయింది. వందల ఏళ్లుగా మదనపల్లెకు ఆత్మగా భావించే గుర్తుల్లో ఇధొకటి. చెరిగిన చరిత్రలో ఇది కూడా కలిసిపోయింది.
ప్రకృతి ఒడిలో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఛిద్రం చేయాలని భావించడం ఎంతవరకు సమంజసం; మదనపల్లె పట్టణంలో ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. ఈ పట్టణానికి వచ్చే స్థానికులు చుట్టుపక్కల వారే కాదు. పొరుగు ప్రాంతాలు వారిని కూడా చల్లటి వాతావరణం కట్టిపడేస్తుంది, ఈ ప్రాంతంతో అవినాభావ ఏర్పడేలా చేస్తుంది. చల్లదనానికి మారుపేరైన మదనపల్లి పట్టణానికి ఉన్న ప్రత్యేకత ఇదే. పెరిగిన అవసరాలు, రాజకీయ క్రీనీడ వల్ల జరుగుతున్న పరిణామాలు మదనపల్లి చరిత్ర పుస్తకంలో ఒక పేజీ చిరిగిపోతోంది. మిగతా పేజీలైన కాపాడడానికి లాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది వేచి చూడాలి.