కృష్జా జలాల కేటాయింపులో సీమకు తీవ్ర అన్యాయం: బొజ్జా దశరథ రామిరెడ్డి

కృష్జా జలాల కేటాయింపులో సీమకు తీవ్ర అన్యాయం జరిగిందని, పాలకులు ఇప్పటికైనా స్పందించి దీనిని సరిదిద్దాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు డిమాండ్ చేశారు.

Update: 2024-02-13 11:27 GMT

భారతదేశంలో అత్యంత తక్కువ వర్షపాతం కలిగిన రాయలసీమకు, కృష్ణా జలాలు కేటాయింపులలో తీవ్ర వివక్షకు గురైందని, ఇది చారిత్రక తప్పిదమని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తప్పిదాన్ని సరిదిద్దడం అటుంచి, పాలకులు రాయలసీమ సాగునీటి అభివృద్ధిపై అశ్రద్ద వహించడం మరింత శోచనీయమని తీవ్రంగా విమర్శించారు.

రాయలసీమ ప్రాంతం ఇతర అభివృద్ధి చెందిన కోస్తా ప్రాంతంతో సమానాభివృద్దికి పాటు పడాల్సిన పాలకులు రాయలసీమకు కేవలం 15 శాతం బడ్జెట్ కేటాయింపులు చేసి, 85 శాతం బడ్జెట్ నిధులు కోస్తా ప్రాంతానికి కేటాయించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

రాయలసీమ సమగ్రాభివృద్దికై రాజకీయ పార్టీలు చేపట్టాల్సిన అంశాలను తమ ఎన్నికల మ్యానిఫెస్టోలలో చేర్చాలని కోరుతూ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు దశరథరామిరెడ్డి లేఖ వ్రాసారు. ఈ సందర్భంగా మంగళవారం నంద్యాల సమితి కార్యాలయంలో దశరథరామిరెడ్డి మాట్లాడారు.

పాలకుల నిర్లక్ష్యం వలన కృష్ణా నదీ జలాల నీటి కేటాయింపులలో వెనుకబడిన రాయలసీమ తీవ్ర వివక్షతకు గురవుతోందనీ, సాగునీటి అంశంలోనే గాకుండా అన్ని రంగాలలో రాయలసీమ ప్రాంతం పాలకుల చేతిలో పూర్తిగా వెనుకబడ్డ వేయబడిందని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలవుతున్నా విభజన చట్టంలో రాయలసీమకు కల్పించిన హక్కులను అమలు పరచడంలో పాలకులు విఫలమయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.రాయలసీమ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లోని ఇతర ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే రాయలసీమ సమగ్రాభివృద్దికై రాష్ట్ర బడ్జెట్‌లో సింహభాగం నిధుల కేటాయింపుల చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

రాయలసీమ సమగ్రాభివృద్దికై కార్యాచరణ ప్రణాళిక రూపొందించే కార్యక్రమంలో భాగంగా క్రింద అంశాలను రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మ్యానిఫెస్టోలలో చేర్చాలని దశరథరామిరెడ్డి రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.


1. చెరువుల నిర్మాణం, పునరుద్దరణ, పెన్నానది పునరుజ్జీవననానికి ‌నిధులు కేటాయించి నిర్దిష్ట కాలవ్యవధితో రాయలసీమ ఇరిగేషన్ కమీషన్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

2. కృష్ణా, తుంగభద్ర నదులలో నీరు ప్రవహిస్తున్నా సరైన సామర్థ్యంతో రిజర్వాయర్లు, ప్రధాన కాలువలు, పంట కాలువలు లేకపోవడంతో రాయలసీమకు కేటాయించిన నీటిలో 40 శాతం కృష్ణా జలాలను వినియోగించుకొనలేని పరిస్థితి ఉందనీ, ఈ పరిస్థితిని సరిదిద్దడానికి అత్యంత ప్రాధాన్యతతో రాయలసీమ ప్రాజెక్టుల స్థిరీకరణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

3. రాష్ట్ర విభజన చట్టం అనుమతించిన తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టుల నిర్మాణానికి బడ్జెట్ లో నిధులు కేటాయింపులు చేసి రెండు సంవత్సరాల కాలంలో పూర్తి చేయడమే కాకుండా, పట్టిసీమ /పోలవరం ద్వారా ఆదా అయిన 80 టిఎంసి ల కృష్ణా జలాలను ఈ ప్రాజెక్టులకు నికర జలాలుగా కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

4. రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల అమలులో భాగంగా పాలనా వికేంద్రీకరణలో భాగంగా రాజధాని లేదా హైకోర్టును కర్నూలులో ఏర్పాటు,రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరైన కృష్ణా జలాల నీటి పంపిణీకి అనువుగా కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం కర్నూలులో ఏర్పాటు, వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు బుందేల్ఖండ్, కోరాపుట్, బోలంగీర్ తరహా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా 35 వేల కోట్లతో రాయలసీమ అభివృద్ధి చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేసారు.

వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి అన్ని రాజకీయ పార్టీలు అండగా నిలబడాలని రాజకీయ పార్టీలకు దశరథరామిరెడ్డి విజ్ఞప్తి చేసారు.


 


Tags:    

Similar News