Kapilatirtham| కపిలతీర్థంలో సంగీతాన్ని తలపిస్తున్న జలపాతం సవ్వడి

శేషాచల అటవీప్రాంతం అధ్బుతాలకు నిలయం. కపిలతీర్థంగా మారిన ఆళ్వారుతీర్థంలో జలపాతం సవ్వడి సంగీతాన్ని తలపిస్తోంది.

Byline :  SSV Bhaskar Rao
Update: 2024-11-23 05:35 GMT

తిరుపతి అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి. ఆ కొండకు వెళ్లడానికి ముందే తిరుపతి నగరానికి ఉత్తరంగా విస్తరించి ఉండేది శేషాచలం అభయారణ్యమే. ఈ అటవీ ప్రాంతంలో ఎన్నో తీర్థాలు ఉన్నాయి. ఆ తీర్థాలు చూడాలంటే దట్టమైన శేషాచలం అటవీప్రాంతంలోకి వెళ్లాల్సిందే. అందులో

తిరుపతికి సమీపంలోని కపిలతీర్థం కొత్త అందాలు సంతరించుకుంది. ఓ పక్క కపిలేశ్వరుడి ఆలయం. మరోపక్క రాయలవారి కాలంలో నిర్మించిన మండపం. ఆ శిలలపై చెక్కిన శిల్పాలకు సాయంత్రం వేళ కాంతులీనే విద్యుద్దీపాల వెలుగు. కొండలపై నుంచి పుష్కరిణిలోకి జాలువారుతున్న జలపాతం సవ్వడి సంగీతం వినిపిస్తున్నట్లే ఉంది. వర్షాలు కురుస్తున్న వేళ ఈ ప్రదేశం కాన్వాస్ పై చిత్రీకరించిన సుందర దృశ్యకావ్యాన్నితలపిస్తోంది.

శేషాచలం పర్వతశ్రేణువులకు దిగువన జనసంచారం ఎక్కవగా ఉన్నచోటే కపిలతీర్థం ఆహ్లాదాన్ని పంచుతోంది. తిరుపతి ఆర్టీసీ బస్టాండు నుంచి ఐదు కిలోమీటర్లు, రైల్వేస్టేషన్ నుంచి సుమారు ఆరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ ప్రదేశాల నుంచి టీటీడీ ఉచిత బస్సుతో పాటు అద్దెకు ఆటోలు, ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉన్నాయి.
తిరుమలకు వెళ్లే మార్గంలో రోడ్డుపైకే శేషాచలం కొండల్లో 20 అడుగల ఎత్తు నుంచి జలజలపారే జలపాతం కనువిందు చేస్తోంది. ఆకాశాన్ని తాకేఎత్తులో కనిపించే కొండలు కూడా మైమరిపిస్తాయి. యాత్రకులే కాదు. స్థానికులు కూడా తమకు తెలియకుండానే అడుగులు కపిలతీర్థం వైపు మళ్లిస్తాయి. పగలు ఒకరకంగా, సాయంత్రం తరువాత కనిపించే దృశ్యం ఆహ్లాదాన్ని పంచుతోంది.

అలిపిరికి వెళ్లే మార్గంలో రోడ్డు మధ్యనే భారీ నంది విగ్రహం కపిలేశ్వరుడికి రక్షణగా కూర్చున్నట్లే ఉంటుంది. ఇక్కడి నుంచి కుడి వైపు పది అడుగులు వేస్తే, కొన్ని దశాబ్దాల కిందట నిర్మించిన ఆర్చి కపిలతీర్థంలోకి స్వాగతిస్తుంది. ఇంకాస్త లోపలికి వెళ్లగానే కుడివైపు ఆంజనేయస్వామి ఆలయం. మరో పదడుగులు వేస్తే కపిలతీర్థం ఆలయ ప్రాంగణంలోని పుష్కరిణి మైమరిస్తుంది. ఎదురుగా శేషాచలం కొండలను చీల్చుకుని దూకే జలపాతం పుష్కరిణిలో పడేసమయంలో చెవులు హోరెత్తిస్తుంది. వర్షాకాలంలో ఈ జలపాతం హోరు వినాలంటే గుండెదిటవు చేసుకోవాల్సిందే. శబ్దం అంతలా ఉంటుంది.
ఈ పుష్కరిణికి కుడివైపు కొలువైన కపిలేశ్వరుడు, అమ్మవారి ఆలయం, వెలుపలికి రాగానే నాగదేవతా విగ్రహాలు, శివుడి ఉపాలయం, నవగ్రహాలు కొలువైన ఆలయం ఉంటుంది. ఎడమ పక్క సుమారు 40 అడుగుల వరకు శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో నిర్మించిన మండపం మధ్య ఉన్న పుష్కరిణిలో శేషాచలం కొండల పైనుంచి దుమికే జలపాతం ప్రత్యేక ఆకర్షణ. ఒక పక్క పర్వతసానువులు, మరోపక్క ప్రధాన ఆలయం, ఇంకో పక్క మండపం కోటకు రక్షణలా ఉన్నట్లే కనిపిస్తుంది.
కార్తీకమాసం కావడం వల్ల ఈ పుష్కరిణిలోకి కొండలపై నుంచి దుముకుతున్న జలపాతం కనువిందు చేస్తోంది. యాత్రికులు ఇక్కడ పుణ్యస్నానాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. యువత సెల్ఫీలతో ఇక్కడి ప్రకృతి అందాలను తమ సెల్ ఫోన్లలో బందీ చేస్తున్నారు.

కపిలతీర్థం సోయగం సాయంత్రం వేళ మరింత కాంతివంతంగా కనిపిస్తుంది. మూడు పక్కల రంగురంగుల విద్యుద్దీపాల వెలుగులో ఈ పుష్కరిణి, జలపాతం, ఆలయ పరిసరాలు కొత్త అందాలు సంతరించుకున్నట్లే కనిపిస్తున్నాయి.
కపిలతీర్థంగా మారిన ఆళ్వారుతీర్థం
ఆలయఈ స్థల పురాణాన్ని పరిశీలిస్తే, కృతయుగంలో కపిలమహర్షి చేసిన తపస్సు వల్ల పరమేశ్వరుడు పాతాళం నుంచి భూమిని చీల్చుకుని వెలిశాడనేది కథనం.
కపిలతీర్థం ఆలయాల ప్రాంగణంలోకి వెళ్లగానే ఆంజనేయస్వామి గుడి దాటగానే కుడిపక్కే నమ నమ్మాళ్వార్ అనే ఆళ్లారు (భక్తుడు) గుడి కనిపిస్తుంది. పెద్ద ద్వారాలు దాటి లోపలికి వెళితే, వెంకటేశ్వరుడు దర్శనం ఇస్తారు. దీని వెనుక కనిపించని మరో గుడి ఉంటుంది. అది చాలా మందికి తెలియదు. వందల ఏళ్ల నాటి ఆళ్లారుగుడి పాడుబడిపోయింది. ఆ గుడి కనిపించకుండా ముందుభాగానే ప్రహరీతో కవర్ చేసి, కొత్త ఆలయం నిర్మించారు. ఇదిలాఉంటే
కపిలతీర్థంగా పిలుస్తున్న ఈ ప్రదేశం 12వ శతాబ్దం నుంచీ 18వ శతాబ్దం వరకూ దీన్ని ఆళ్వారు తీర్థంగానే వ్యవహరించే వారు. మొదటి రాజేంద్రచోళుడి కాలంలో 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చారిత్రాక ఆధారాలు ఉన్నట్లు చెబుతారు. చోళుల కాలంలో అభివృద్ధి చేసిన ఈ ఆలయాన్ని అచ్యుతదేవరాయల హయాంలో వైష్ణవులు దీన్ని ఆళ్వారుతీర్థంగా మార్చినట్లు కథనం. పదహారో శతాబ్దంలో విజయనగరం నుంచి వచ్చిన సెవ్వుసాని అనే దేవదాసి ఈ ఆలయానికి ఎంతో సేవ చేసిందట. ఆలయంలోని వినాయకుణ్ణి ఆవిడే ప్రతిష్ఠించిందట. కపిలతీర్థంలో కపిలేశ్వర స్వామితోపాటు కాశీవిశ్వేశ్వరుడు, సహస్రలింగేశ్వరుడు, లక్ష్మీనారాయణుడు, శ్రీకృష్ణుడు, అగస్త్యేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఉప ఆలయాలు కూడా ఉన్నాయి.

చాలామంది కపిలేశ్వరుడి దర్శనానికి మాత్రమే ఆలయం పుష్కరిణికి కుడిపక్కన ఆలయంలోకి వెళతారు. ఎడమపక్కన చిన్నపాటి గుహ నుంచి మండపంపైకి ఉన్న దారిలో వెళితే, నృసింహస్వామి ఆలయం దర్శనం ఇస్తుంది. ఇదంతా ఓ ప్రత్యేకత.పుష్కరిణి విస్తరించిన ఎడమవైపు మండపం కింద రహస్య ప్రదేశం ఉందని చెబుతారు. ఆ ప్రదేశం అంతా పుష్కరిటి నీటితో నిండడం వల్ల లోపలికి వెళ్లేందుకు వీలు ఉండదు. దీనివల్ల అక్కడ ఏమి ఉందనేది కూడా రాజరహస్యంగానే మిగిలిందనేది చరిత్రకారుల మాట.
Tags:    

Similar News