పోసాని కృష్ణమురళి పోలీసులు విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలను వెలుగులోకి వచ్చాయి. స్వయంగా తనకు తాను అనుకుని, కావాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల మీద అలా మాట్లాడలేదని,ç Üజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కుమారుడు సజ్జల భార్గవ్‌రెడ్డిలు సూచించిన స్క్రిప్ట్ ప్రకారమే చంద్రబాబు, పవన్ కల్యాణ్, వారి కుటుంబ సభ్యులు, కమ్మ సామాజిక వర్గం మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్టాడటం కానీ, సోషల్ మీడియాలో బూతులు తిట్టడం కానీ చేశానని వాంగ్మూలం ఇచ్చారు. వారిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే విద్వేషాలు రెచ్చగొట్లేలా మాట్లాడానని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తన నేరాన్ని అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో వారిద్దరి అరెస్టు తప్పదనే ప్రచారం కూటమి శ్రేణుల్లో సాగుతోంది.
ఇదిలా ఉంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, అతన కుమారుడు సజ్జల భార్గవ్‌రెడ్డిల మీద దృష్టి సారించారు. వీరిద్దరిని కటకటాల వెనక్కి నెట్టాలనే ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసును తెరపైకి తెచ్చింది. ఈ దాడి వెనుక సజ్జల ప్రమేయం ఉందని ఆయనపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా జారీ చేశారు. ఇదే సమయంలో ఇతర దేశాలకు పారిపోకుండా ఉండేందుకు లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇది అప్పట్లో సంచలం రేపింది. తర్వాత అటవీ భూములు ఆక్రమించారనే ఆరోపణలను తెరపైకి తెచ్చింది. భూముల మీద సర్వే కూడా నిర్వహించారు. తాజాగా పోసాని కృష్ణమురళి వాంగ్మూలం తెరపైకి తెచ్చారు. పోసాని పేర్కొన్న ప్రకారం సజ్జలను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవ్‌రెడ్డిని కూడా అరెస్టు చేసేందుకు ఇది వరకే రంగం సిద్ధం చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్, వైఎస్ వివేకా కుమార్తె సునీత, వైఎస్ షర్మిల మీద అనుచిత పోస్టులు పెట్టారనే కారణంతో అరెస్టై జైలు పాలైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త వర్ర రవీందర్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం మేరకు భార్గవ్‌రెడ్డి మీద కేసులు నమోదు చేశారు. తాజాగా పోసాని ఇచ్చిన వాంగ్మూలంలో సజ్జల భార్గవ్‌రెడ్డి పేరు వెల్లడి కావడంతో ఇతని మీద పోలీసులు కేసు నమోదు చేసేందుకు రంగం చేశారు.
ఈ నేపథ్యంలో తండ్రీ, కొడుకులైన సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్‌రెడ్డితో పాటు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. పోసాని కేసులో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు తమను కూడా అరెస్టు చేస్తారనే ఆందోళన ఉందని, దీంతో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మేము అమాయకులం, మమ్మల్ని అనవసరంగా ఈ కేసులో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసుల విచారణలో పోసాని చెప్పిన వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలు తప్ప ఈ నేరంలో మా పాత్ర ఉందనేందుకు ఆధారాలేమీ లేవు. కేవలం రాజకీయ కక్షతోనే తమను తప్పుడు కేసులోకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. గుంటూరు జిల్లా, కడప జిల్లాలో తమకు శాశ్వత నివాసాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో తపించుకునే ప్రయత్నం చేయం. విచారణకు సహకరిస్తాం. అవసరమైన సందర్భాల్లో పోలీసుల విచారణకు హాజరవుతాం. అందువల్ల ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటీషన్‌లో కోర్టును కోరారు.