నటి శ్రీరెడ్డిని వణికించిన పూసపాటి రేగ పోలీసులు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా అసభ్యకర పోస్టులు పెట్టిన నటి శ్రీరెడ్డిపై విచారణ మొదలైంది.;
By : The Federal
Update: 2025-04-20 08:20 GMT
నటి శ్రీరెడ్డికి పోలీసు సెగ తగిలింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా అసభ్యకర పోస్టులు పెట్టిన శ్రీరెడ్డి విచారణ షరూ అయింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగలో ఆమెపై పెట్టిన ఓ కేసుకు సంబంధించి పోలీసులు శ్రీరెడ్డిని విచారణకు పిలిపించారు.
వైసీపీ హయాంలో ఆమె చంద్రబాబును, పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెద్దఎత్తున పెట్టారు. కొన్ని సందర్భాలలో పవన్ కల్యాణ్ తో పాటు లోకేష్ ను కలిపి పోస్టులు పెట్టారు. దీనిపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన ఆమె పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఎంతో వినయంగా, బిక్కుబిక్కుమంటూ తన సహజశైలికి భిన్నంగా ఆమె సమాధానాలు ఇచ్చారు. దాదాపు 45 నిమిషాల పాటు ఆమె విచారణ సాగింది.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌పై వివాదాస్పద వీడియోల కేసులో ఆమెకు ఇప్పటికే నోటీసులు జారీ అయ్యాయి. హైకోర్టు ముందస్తు బెయిల్‌ను కొట్టివేసింది, కానీ విశాఖ కేసులో షరతులతో బెయిల్ మంజూరైంది. శ్రీరెడ్డి సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టారంటూ కూటమి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో 2024 నవంబరు 13న నెల్లిమర్ల, అనకాపల్లిలో ఆమెపై కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి విచారణకు రావాలని ఇటీవల ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. దాంతో ఏప్రిల్ 19 ఆమె విజయనగరం జిల్లా పూసపాటిరేగ సర్కిల్ స్టేషన్, అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు ఆయా పోలీసుస్టేషన్లలో ఆమెను పోలీసులు విచారించారు. అవసరమైతే మళ్లీ విచారణకు రావాల్సి ఉంటుందని శ్రీరెడ్డికి తెలిపారు.
నటి శ్రీరెడ్డి గతంలో ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనితపై కూడా సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వ్యక్తిగత దూషణలకు దారి తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా ఆమెపై వివిధ పోలీస్ స్టేషన్లలో 6 కేసులు నమోదయ్యాయి.
వివిధ పోలీస్ స్టేషన్లలో మొత్తం ఆరు కేసులు నమోదయ్యాయి.
కేసుల వివరాలు..
విశాఖపట్నం: ఈ కేసులో హైకోర్టు శ్రీరెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఆమె వారానికి ఒకసారి దర్యాప్తు అధికారిని కలవాలని ఆదేశించింది .
చిత్తూరు: ఇక్కడి కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారణార్హత లేదని కొట్టివేసింది.
కర్నూలు, గుడివాడ (కృష్ణా జిల్లా), నెల్లిమర్ల (విజయనగరం జిల్లా): ఈ కేసుల్లో పోలీసులు శ్రీరెడ్డికి నోటీసులు జారీ చేసి, ఆమె వివరణను కోరారు .
అనకాపల్లి: ఇక్కడి కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీరెడ్డి అత్యంత అభ్యంతరకరమైన భాష వాడారని కోర్టుకు తెలియజేశారు. విచారణ వాయిదా వేసింది.
శ్రీరెడ్డి తన గత వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనితలతో పాటు వారి కుటుంబ సభ్యులను క్షమించమని కోరుతూ ఓ లేఖ రాశారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయనని హామీ ఇచ్చారు .
ఈ ఘటనల నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 100 కేసులు నమోదు చేసి, 39 మందిని అరెస్టు చేశారు.
తనపై నమోదైన కేసుల నేపథ్యంలో, శ్రీరెడ్డి ఇటీవల ఓ వీడియో ద్వారా క్షమాపణలు తెలిపారు. ఈ వీడియోలో ఆమె, "పవన్ కళ్యాణ్ గారు, నన్ను క్షమించండి. ఇకపై మీ కుటుంబ సభ్యుల గురించి సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడను" అని అన్నారు .
ఈ క్షమాపణలతో పాటు, ఆమె గతంలో చేసిన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. "నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, నా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, నా సోషల్ మీడియాలో మీ గురించి, మీ కుటుంబసభ్యుల గురించి ఎలాంటి తప్పుడు పోస్టులు రావని చెప్తున్నా"అని ఆమె తెలిపారు.
శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆమెపై నమోదైన కేసులు, ఆమె క్షమాపణలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
ఇక విచారణ సందర్భంగా శ్రీరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. వైఎస్ జగన్ కోసమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించి అసభ్యకర పోస్టులు పెట్టినట్లు అంగీకరించినట్లు సమాచారం. ఇక సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్టులు అనీ తన వ్యక్తిగతమని.. వైఎస్ జగన్ మీద అభిమానంతోనే పోస్టులు పెట్టినట్లు శ్రీరెడ్డి అంగీకరించినట్లు తెలిసింది. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవని చెప్పినట్లు సమాచారం.