సొమ్ములు రాలే.. అదనపు బలగాలైతే వచ్చాయి

వరదల్లో చిక్కుకున్న విజయవాడ వాసులకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తోంది. ఎక్కడిక్కడ సహాయక చర్యలను వేగవంతం చేస్తూ, మరింత ప్రభావవంతంగా మారుస్తూ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

Update: 2024-09-03 09:07 GMT

వరదల్లో చిక్కుకున్న విజయవాడ వాసులకు ప్రభుత్వం అన్ని విధాలా సాయం అందిస్తోంది. ఎక్కడిక్కడ సహాయక చర్యలను వేగవంతం చేస్తూ, మరింత ప్రభావవంతంగా మారుస్తూ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం కూడా ప్రజలకు అందించే సహాయక చర్యల విషయంలో రాజీ పడకుండా శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే భారీ మొత్తంలో అదనపు బలగాలను కూడా విజయవాడకు తెప్పిస్తోంది. హెలికాప్టర్లు, బోట్లు, ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా విజయవాడకు తరలిస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడటానికి అదనపు సహాయం చేరింది. వచ్చీ రావడంతోనే అన్ని అదనపు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. వారి రాకతో సహాయక చర్యలు మరింత వేగవంతం అవుతాయని, వరదల్లో చిక్కుకున్నప్రజలను అతి త్వరలోనే సురక్షిత ప్రాంతాలకు తరలించడం సులభం అవతుందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ నెల 5, 6 తేదీల్లో బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడనుందని ఐఎండీ ఇచ్చిన హెచ్చరికలపై కూడా ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టింది. అప్పటి పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకుని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.

అదనపు బృందాలు ఇవే

విజయవాడ వరద బాధితులకు సహాయక చర్యలు అందించడానికి మరికొన్ని ఎన్‌డీఆర్ఎఫ్ బందాలు రంగంలోకి దిగాయి. అదనపు సహాయంలో భాగంగా 25 పవర్ బోట్లు, 9 హెలికాప్టర్లు, వంద మంది ఎన్‌డీఆర్ఎఫ్ బందాలు విజయవాడకు చేరుకున్నాయి. బెజవాడకు చేరుకున్న వెంటనే అదనపు బృందాలన్నీ సహాయక చర్యల్లో భాగమయ్యాయి. గన్నవరం విమానాశ్రయానికి నాలుగు హెలికాప్టర్లు, మోటర్ బోట్లు, 120 మంది సిబ్బంది పూణే నుంచి వచ్చారు. వీరంతా కూడా సహాయక చర్యల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. వరద బాధితులకు ఆహారం, మంచినీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఇప్పటికే దాదాపు వందమందితో కూడిన ఎన్‌ఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. సోమవారం వర్ష కాస్తంత ఎడతెరిపి ఇవ్వడంతో సహాయక చర్యల వేగం పుంజుకుంది. సింగ్‌నగర్, రాజరాజేశ్వరి పేట, కృష్ణలంక తదితర ప్రాంతాల నుంచి వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

43,417 మంది సురక్షితం

ఏపీ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల వరదలు ముంచెత్తాయి. ఈ వరదల నుంచి ఇప్పటి వరకు 43,417 మందిని రక్షించినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముంపు ప్రాంతాల్లో 197 వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి సహాయక చర్యలు అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తొలి రోజు నుంచి ఇప్పటి వరకు 48 ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిర్విరామంగా సేవలు అందిస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ సహాయక చర్యలను సీఎం చంద్రబాబు సహా మంత్రులు 24 గంటల పాలు పర్యవేక్షిస్తున్నారు. తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారని అధికారుల వివరించారు. ప్రతి ఒక్క బాధితుడికి సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని, వీలైనంత తర్వగా వరద బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలను ముమ్మరం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇంకా అందని సహాయం

ఒకవైపు యుద్ధప్రాతిపదిక సహాయక చర్యలు అందుతుంటే పలు ప్రాంతాల్లో మాత్రం ఇంకా తమకు ఎటువంటి సహాయం అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమకు తాగడానికి తాగునీరు లేదని, తినడానికి ఆహారం కూడా లేక చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముంపు ప్రాంతాలైన విజయవాడ మిల్క్ ప్రాజెక్ట్, జక్కంపూడి కాలనీ వాసులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే తమకు ఎటువంటి సాయం అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద సహాయక చర్యలు కేవలం మెయిన్ రోడ్ వరకే పరిమితం అయ్యాయని, కాలనీల్లో నివసిస్తున్న వారికి ఎటువంటి సహాయక చర్యలు అందడం లేదని మండిపడుతున్నారు స్థానికులు. కాలనీల్లో వాళ్లకి ఆహారం, తాగునీరు, ఔషధాలు సైతం అందటం లేదని వారు వాపోతున్నారు.

యంత్రాంగం విఫలం

ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సహాయం అందడం లేదని, తమ దుస్థితిని వ్యాపరస్తులు ఆసరగా తీసుకుని రూ.5 బిస్కెట్ ప్యాకెట్‌కు రూ.10, రూ.20 వసూలు చేస్తున్నారని వారు తెలిపారు. నిత్యావసరాల కట్టడిలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, అందుకు తమ దుస్థితే నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అధికారులు వరద సహాయక చర్యలు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం, అలసత్వం కనబరుస్తున్నారని చెప్పారు. ఇప్పటికే అధికారుల అలసత్వం, నిర్లక్ష్యం సీఎం చంద్రబాబు అసహనం, అసంతృప్తి వ్యక్తం చేసినా అధికారుల తీరులో మార్పు లేదని బాధితులు మండిపడుతున్నారు.

Tags:    

Similar News