మైనర్లకు స్కూటీలు- పిల్లలకు హోంమంత్రి వంగలపూడి అనిత క్లాస్
ఆ క్షణంలో ఆమె తన మంత్రి పదవిని పక్కన పెట్టి, ఒక తల్లిలా, ఒక ఉపాధ్యాయినిలా హితవు పలికారు
By : The Federal
Update: 2025-09-30 10:54 GMT
వృత్తిరీత్యా ఆమె టీచర్. పిల్లలకు పాఠాలు చెప్పి సన్మార్గంలో నడిపించడం ఆమెకు అలవాటు. ఇప్పుడామె మంత్రి. అయినా ఆమె తన అలవాటును మార్చుకోలేక పోయారు. పిల్లలు తమ పరిధికి మించి వ్యవహరిస్తుంటే చూడలేకపోయారు. తరగతి గదిలో పిల్లలకు పాఠాలు చెప్పినా, రాష్ట్ర హోం మంత్రిగా ప్రజల నడవడిని తీర్చిదిద్దినా ఆమె స్టైలే వేరు. హోంమంత్రిగా ఉన్నప్పటికీ, పిల్లలపై చూపే శ్రద్ధ మాత్రం అలాగే కొనసాగుతోందని మరోసారి నిరూపించారు.
అసలింతకీ ఏమి జరిగిందంటే...
తన పర్యటనలో భాగంగా హోంమంత్రి వంగలపూడి అనిత ఈవేళ విజయనగరం జిల్లా వెళ్లారు. అనిత కాన్వాయ్ చింతలవలస 5వ బెటాలియన్ సమీపానికి చేరుకున్నప్పుడు అడ్డదిడ్డంగా అతివేగంగా దూసుకెళ్తున్న ఓ స్కూటీ ఆమె కంటపడింది. స్కూటీపై కూర్చొన్న ఇద్దరూ చిన్నపిల్లలే. వయసు పరంగా వాహనం నడిపే అర్హత వారికి లేదని క్షణాల్లోనే గ్రహించారు. కాన్వాయ్‌ను నిలిపి ఆ పిల్లలు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపించారు. వారిని పిలిపించారు. వాళ్ల వివరాలు కనుక్కున్నారు. ఏ క్లాసు చదువుతున్నారో తెలుసుకున్నారు.
“ఈ వయసులో వాహనం నడపడం ప్రమాదకరం.. చట్టరీత్యా కూడా నేరమే” అని సుతిమెత్తగా వారిని మందలించారు. భయపెట్టకుండా, ఉపదేశం ఇస్తూ పెద్దమ్మలా, టీచర్‌లా వారితో మాట్లాడారు. వారి వివరాలు తీసుకుని తల్లిదండ్రులకు అప్పగించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
ఆ క్షణంలో మంత్రి పదవి పక్కన పెట్టి, ఒక తల్లిలా, ఒక ఉపాధ్యాయిలా ఆమె ప్రవర్తించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదు. తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. పిల్లల భద్రతే మొదటి ప్రాధాన్యం” అని స్పష్టం చేశారు. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు- ఎంతైనా టీచర్ కదా, ఆ మాత్రం క్లాస్ అవసరమే అని వ్యాఖ్యానించడం ముదావహం.