ఇన్ని పన్నులు చెల్లిస్తున్నా... ఇంకా ఇన్ కం ట్యాక్స్ కట్టాలా...
నేను ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబీకుడిని. జీఎస్టీ పేరుతో ప్రతి దానిపై పన్ను వేస్తున్నారు. ఇంకా ఆదాయం పన్ను నేను ఎందుకు కట్టాలి?;
మనిషి ఉపయోగించే ప్రతి వస్తువు పైనా పన్నులు చెల్లిస్తున్నాడు. అయినా ఆపై ఇన్ కం ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. స్వాతంత్ర్యం రాక పూర్వం, వచ్చిన తరువాత ప్రజలను పీల్చి పిప్పి చేయడంలో ఎవరికి ఎవరు తీసి పోవడం లేదు. తాగే నీరు, పీల్చే గాలి, వాడుకునే వెలుతురుకు కూడా ప్రభుత్వం పన్నులు వేస్తోంది. జీఎస్టీ వచ్చిన తరువాత పన్నులు రెట్టింపు చేసి వసూలు చేస్తున్నారు. అన్ని రకాల పన్నులు చెల్లిస్తున్నా కష్టపడి సంపాదించిన డబ్బుపై కూడా పన్నులు వేయడం ఏమిటనేది పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై చిన్నగా దేశ వ్యాప్యంగా ఉద్యమాలు మొదలవుతున్నాయి.
ఒక మధ్య తరగతి కుటుంబం బతకాలంటే దేశంలో కష్టంగా మారిందనేది పలువురి వాదన. రోజంతా కష్టపడి పనిచేస్తే పూట గడిచేందుకు కంపెనీల వారు ఇస్తున్న జీతంతో నానాక ఇబ్బందులు పడి కుటుంబాన్ని పోషించాల్సి వస్తోంది. ఇంతటి గడ్డు పరిస్థితులు ఉన్న కాలంలో బతకడం ఒక సవాలుగా మారిందనేది మధ్య తరగతి వారి ఆవేదన. సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసే ప్రతి వస్తువు మీద పన్నులు చెల్లిస్తున్నప్పుడు ఇంకా ఆదాయ పన్ను పేరుతో సంపాదించిన డబ్బు నుంచి 30 శాతం ప్రభుత్వం లాక్కోవడం పేదరికంలో ఉన్న వారిని, మధ్య తరగతి వారిని సవాల్ చేస్తోంది. ఒక పిల్లాడిని చదివించాలంటే హైదరాబాద్ లాంటి నగరంలో ఫస్ట్ క్లాస్ కు ఫీజు కింద రూ. 2 లక్షలు చెల్లించాల్సి వస్తోంది.
ఏడాదికి రూ. 15 లక్షలు సంపాదించే సగటు ఉద్యోగి సంపాదించిన డబ్బులో ఇంటి అద్దెకు సంవత్సరానికి రూ. 3.60లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏడాదికి రూ. 1.20 లక్షలు లేనిది ఇంటి తినుబండారాలు రావడం లేదు. వారానికి ఒక రోజు భార్యా భర్తలు, పిల్లలతో కలిసి సరదాగా గడిపేందుకు వెళ్లాలంటే కనీసం రూ. 5వేల నుంచి 10వేలు ఖర్చవుతున్నాయి. పిల్లల పుస్తకాలు, ఉద్యోగానికి అవసరమైన వస్తువులు, ఏడాదికి ఒక సారి బట్టలు వంటివి కొనుగోలు చేసేందుకు కనీసం రెండు లక్షలు ఖర్చవుతున్నాయి. ఏడాది తరువాత తిరిగి చూస్తే ఆదాయపు పన్ను కట్టిన తరువాత చేతిలో పదివేలు కూడా ఉండటం లేదు.
సామాన్య ఉద్యోగికి సొంత ఇల్లు ఒక కల. ఆ కలను సాకారం చేసుకునేందుకు బ్యాంకు లోన్స్ తీసుకుని ఫ్లాట్ కొనుగోలు చేస్తే నెలకు కనీసం రూ. 35వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇక సాధారణ ఉద్యోగి హైదరాబాద్ నగరంలో నివసించడం కూడా సాధ్యం కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. నెలకు రూ. 30వేలు సంపాదించే వారు 10 నుంచి 12వేలు ఇంటి అద్దెకు చెల్లిస్తే మరో పదివేలు వెచ్చాలకు పోను మిగిలిన డబ్బులతో పిల్లల చదువులు, కనీస అవసరాలు తీరే పరిస్థితులు లేవు. ప్రైవేట్ ఉద్యోగులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు కూడా నానా ఇబ్బందులు పడుతూ జీవించాల్సిన పరిస్థితులు దేశంలో ఏర్పడ్డాయి.
ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను విధిస్తున్నప్పుడు జీఎస్టీ రద్దు చేయాలి. లేదంటే ఆదాయపు పన్ను రద్దు చేయాలనే నినాదంతో ఉద్యమాలు బయలు దేరుతున్నాయి. ఈ ఉద్యమాలు ఈ రోజు కాకుంటే రానున్న రోజుల్లో ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
నేను 30 రోజులు పని చేశాను. జీతం ఇచ్చారు. ఆదాయపు పన్ను అన్నారు, ఇచ్చాను. ప్రొఫెషనల్ ట్యాక్స్ అన్నారు, ఇచ్చాను. మొబైల్ కొనుగోలు పై పన్ను అన్నారు, ఇచ్చాను. మొబైల్ రీఛార్జ్ చేసినందుకు సేవా పన్ను ఇచ్చా. డేటా పన్ను ఇచ్చా. ఇంటర్ నెట్ డేటా వద్దు.. నాకు టాక్ టైం రీచార్జ్ చాలన్నా.. డేటా లేకుండా రీచార్జ్ లేదన్నారు. తప్పని పరిస్థితుల్లో రీచార్జ్ చేయించా. విద్యుత్తు పన్ను ఇచ్చా. ఇంటి పన్ను, టీవీ బిల్లు పై పన్ను, పిల్లల ఫీజుల పై పన్ను, కారు కొన్నందుకు పన్ను అన్నారు, ఇచ్చాను. పెట్రోలు పై పన్ను, ‘సేవ’ పన్ను, రోడ్డుపై పన్ను, ‘టోల్ పై’ పన్ను అని వసూలు చేస్తున్నారు. ఇవన్నీ కడుతున్నానని ఓ సామాన్యుడు ఆవేదన వెల్ల గక్కాడు.
లైసెన్స్ మేడ్ ‘ట్యాక్స్’ వచ్చింది. కిక్కురుమనకుండా అన్నీ ఇచ్చాను. తప్పు చేస్తే పన్ను చెల్లించా, రెస్టారెంట్‌లో తిన్నా, పన్ను చెల్లించా. పార్కింగ్ పన్ను చెల్లించా, నీళ్లు తీసుకున్నా, పన్ను చెల్లించా! ఇంట్లో కసువు బయట వేసేందుకు పన్ను చెల్లించా! టాయ్ లెట్ నుంచి వేస్ట్ sewage అన్నారు.. దానికి పన్ను చెల్లించా. తినేందుకని కార్డు మీద సామానులు కొనుక్కున్నా, పన్ను చెల్లించా! రేషన్ కొనుగోలు చేశా, పన్ను చెల్లించా! బట్టలు కొనుగోలు చేశా, పన్ను చెల్లించా! పుస్తకాలు తీసుకున్నా.. పన్ను ఇచ్చా.. మరుగు దొడ్డికి వెళ్లా.. పన్ను చెల్లించా. మందులు తీసుకున్నా, పన్ను చెల్లించా. గ్యాస్ కొనుగోలు చేసి పన్ను చెల్లించా. వందల కొద్దీ వస్తువులు తీసుకుని పన్ను కట్టి, ఫీజులు, బిల్లులు, వడ్డీలు కట్టి, ఎక్కడో ఫైన్లు, లంచాల పేరుతో డబ్బులు చెల్లించి, పొరపాటున ఏ డ్రామా నో ఆడి, ఇంతా అంతా ‘ఆదా’ చేసి మరీ పన్ను కట్టా. కానీ నా జీతం నుంచి ఎన్నిసార్లు పన్ను చెల్లించాలి? ఈ ప్రభుత్వం సరైన సమాధానం చెబుతుందా?
నేను జీవితాంతం పని చేసి, పన్నులు కడుతున్నా నాకు సామాజిక భద్రత లేదు. ఉచిత వైద్య సౌకర్యం లేదు, అధ్వాన్నమైన రోడ్లు, వీధి దీపాలు వెలగవు, గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, పండ్లు, కూరగాయలు, ఇలా అన్నీ విషపూరిత మైనవి. ఆసుపత్రుల చికిత్సలు అందనంత ఖరీదైనవి. ముదుసలిని అయ్యే వరకు పన్ను కట్టి.. పన్ను మీద పన్నులు కట్టి చేసిన సర్వీసు లో ఆదా చేసుకుని పింఛను తీసుకుంటే దాని మీద కూడా పన్ను అన్నారు.. అది కూడా కట్టా.. నా శవాన్ని తగల బెట్టేందుకూ పన్ను తీసుకున్నారు. ప్రతి సంవత్సరం పెరిగే ద్రవ్యోల్బణం కూడా నన్ను దెబ్బ తీస్తుంది, అకస్మాత్తుగా వచ్చే ఖర్చులు, ప్రమాదవశాత్తు ఊహించని విపత్తులు, వాటిల్లో ప్రతి చోటా.. మీకు పన్నులు.. నాకు అప్పులు..
కానీ.. ఈ డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి? అవినీతిలోకి, ఎన్నికల్లోకి, ఉచితాలకి, ధనవంతుల సబ్సిడీల్లోకి, మాల్యా లాంటి వారు దోచుకొని పారి పోవటానికి, ధనికులు ప్రకటించే మోసపూరిత ‘దివాలాలు’ పూడ్చటానికి, స్విస్ బ్యాంకుల్లోకి, నాయకుల బంగళాలు, కార్లు, జీతాలు, సౌకర్యాలకి, ఎమ్మెల్యేలను కొనడానికి.. మాకు కథలు చెప్పి జండూ బామ్ రాయడానికి ఖర్చు పెట్టారు. ఇప్పుటికైనా చెప్పండి దోపిడీ ఎవరు ఎలా చేస్తున్నారో? మనమంతా కూడా ఈ దేశస్తులమే.. అయినా సరే, ఎంతకాలం అయినా ఇలాగే జీవితాన్ని కొనసాగిస్తాము. కదా.. ఇది ఒక సామాన్యుడిగా నా ఆవేదన.
ప్రపంచ వ్యాప్తంగా GST వసూలు చేస్తున్న 175 దేశాలలో 28 శాతం GST స్లాబ్ ఉన్న ఏకైక దేశం మన దేశమే. ఇంత భయంకరంగా పన్ను వసూలు చేస్తున్నప్పటికీ దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత అప్పు దేనికి చేసినట్లు? హెల్త్ ఇన్సూరెన్స్ మీద 18 శాతం, లైఫ్ ఇన్సూరెన్స్ మీద 18 శాతం, మెడిసిన్ మీద 12 శాతం, మెడికల్ సర్వీస్ మీద, బహిష్టు సమయంలో మహిళలు ఉపయోగించే సానిటరీ ప్యాడ్స్ మీద, బట్టల మీద, చెప్పుల మీద 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. పాప్కార్న్ మీద 18 శాతం, పాత కారుల అమ్మకం మీద, ఉద్యోగ రుసుము మీద 18 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. పాల మీద, పెరుగు మీద, పన్నీర్ మీద 5శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు, గారు కొనుగోలు మీద 3 శాతం, ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రిక్ మీద 28 శాతం, మోటార్ వెహికిల్స్, కార్స్ అండ్ బైక్స్ మీద 28 శాతం, స్టీల్ మీద 18శాతం, ఐరన్ మీద 18 శాతం, సిమెంట్ మీద 28 శాతం, ఫ్లోరింగ్ టైల్స్ మీద 5శాతం, వాల్ టైల్స్ మీద 28 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు.
ఇలా రాసుకుంటూ పోతే మొత్తం ఎన్నడూ లేనంతగా ప్రతి వస్తువు మీద పన్నులు వసూలు చేస్తున్నారు. అయినప్పటికీ మనదేశంలో పేదరికం, ఆహారపు కొరత, అప్పుల బాధ పట్టి పిడిస్తున్నాయి. ఎవరిది లోపం? పాలకులదా.. ప్రజలదా,, స్వాతంత్ర్యం రాక ముందు మన దేశ సంపదను బ్రిటీష్ వాళ్ళు కొల్లగొట్టారు అని చరిత్రలో రాసారు. ఇప్పుడు మనకు స్వాతంత్ర్యం వొచ్చింది, రాజ్యాంగం అమలులో వుంది. మన దేశాన్ని కొల్ల గొడుతున్నది ఎవరు? అనేది దేశ ప్రజలంతా ఆలోచించాల్సిన పెద్ద ప్రశ్న. ఇన్ని పన్నులు చెల్లిస్తున్నా.. ఇంకా నేను ఇన్ కం ట్యాక్స్ ఎందుకు కట్టాలనేది సామాన్యుడి ప్రశ్న. దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.