తాడికొండలో సుచరితకు ఎదురీత
ఆంద్రప్రదేశ్‌లోని తాడికొండ నియోజకవర్గం అమరావతిలో ఉంది. ఈ నియోజకర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సుచరితకు అంత ఈజీ కాదని స్థానికులు చెబుతున్నారు.
By : The Federal
Update: 2024-03-21 13:50 GMT
జి. విజయ కుమార్
గుంటూరు జిల్లా తాడికొండ అసెంబ్లీ నియోజక వర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరణ ఎలా ఉండబోతోందనేది ఆసక్తి కరంగా మారింది. రాజధాని అమరావతి ప్రాతం కావడం, గతంలో ఇక్కడ వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీలోకి వెళ్లడం, ఆమె స్థానంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను తాడికొండ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కర్తగా నియమించడం జరిగాయి. తర్వాత ఆయనను పక్కన పెట్టి మాజీ హోమ్ మంత్రి మేకతోటి సుచరితకు ఈ స్థానం ఖరారు చేస్తూ ప్రత్తిపాడు నియోజక వర్గం నుంచి తాడికొండకు రాజకీయ బదిలీ చేయడం, ఇదే సమయంలో అప్పటి వరకు సమన్వయ కర్తగా ఉన్న డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను తొలగించడం జరిగాయి. తనకు సంబంధం లేకుండా సమన్వయ కర్తగా నిమించారు. తొలగించారని మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యలు చేశారు. తాడికొండ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
రాజకీయ బదిలీపై సుచరిత
జిల్లా ఒకటే కావచ్చు కానీ తాడికొండకు సుచరిత కొత్త. ఇక్కడ అంతగా పరిచయాలు లేవు. నేతలతో కానీ, కార్యకర్తలతో కానీ సత్సంబంధాలు లేవు. పైగా గత ఎన్నికల్లో వెఎస్‌ఆర్ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఉండవల్లి శ్రీదేవి ఆ పార్టీ నేతలపై ఆరోపణలు చేయడం, తర్వాత టీడీపీలోకి వెళ్లడంతో స్థానికంగా ఉండే నేతలు కూడా రెండు వర్గాలుగా చీలి పోయారు. దీంతో అందరినీ ఒకే తాటిపైకి తీసుకొని రావడం సుచరితకు సవాల్‌గా మారిందని స్థానిక నేతలు చెబుతున్నారు.
మేకతోటి సుచరిత కాంగ్రెస్‌తో రాజకీయ ఎంట్రీ
మేకతోటి సుచరిత కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. 2009లో ప్రతిపాడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. తర్వాత వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. 2012లో జరిగిన బై ఎలక్షన్‌లో గెలుపొందారు. 2014లో ఓడిపోయిన సుచరిత 2019 ఎన్నికల్లో తిరిగి విజయం సాధించారు. 2024 ఎన్నికల నిమిత్తం తాడికొండకు రాజకీయ బదిలీ చేశారు. తాడికొండ ఎస్సీ రిజర్వుడు అసెంబ్లీ నియోజక వర్గం. ఇక్కడ 29శాతం ఎస్సీ ఓటర్లు ఉంటారు. మరో 6 శాతం ఎస్టీ ఓటర్లు ఉంటారు.
ఒక్క సారి జగన్‌ను కల్పించండి ప్లీజ్
తాడికొండ సీటు అప్పటి వరకు తనకే ఖాయమని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ అనుకుటుంన్న సమయంలో సీఎం జగన్ బాంబు పేల్చారు. సుచరితకు ఖరారు చేశారు. దీంతో వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తనను అడగకుండానే తాడికొండ ఇన్‌చార్జిగా నియమించారు, ఇప్పుడు పక్కన పెట్టారు. ఒక్క సారి సీఎం జగన్‌ను కలిసే అవకాశం కల్పించాలని ఆ పార్టీ పెద్దలను కోరారు. సర్వేలు బాగుండటంతో తనను తాడికొండ సమన్వయకర్తగా నియమించారని, ఇప్పుడు పక్కన పెట్టారని విమర్శించారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంపై అడిగే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవన్నారు. తనకు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని, కానీ ఒక్క సారి జగన్‌ను చూడాలని ఉందని అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
టీడీపీ నుంచి తెనాలి శ్రావణ్‌కుమార్
ఈ సారి కూడా తెనాలి శ్రావణ్‌కుమార్‌కే చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు. 2009లో ఓడిపోయిన శ్రావణ్‌కుమార్ 2014లో గెలుపొందారు. తర్వాత 2019లో ఉండవల్లి శ్రీదేవి చేతిలో ఓడి పోయారు. ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉంది. అన్ని వర్గాల్లోను అనుచర గణం ఉంది. పైగా మాల సామాజిక వర్గానికి చెందిన శ్రావణ్ కుమార్‌కు మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఉండవల్లి శ్రీదేవి టీడీపీలోకి రావడంతో బలం పుంజుకున్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరో వైపు సుచరిత మాల సామాజిక వర్గానికి చెందిన నేత. అయితే ఆమెకు మాదిగ సామాజిక వర్గం దూరంగా ఉంటోందని, శ్రావణ్‌కుమార్‌కు రెండు వర్గాల ఆదరణ పెరుగుతోందని స్థానిక నేతలు చెబుతున్నారు.