దేవినేని అవినాష్‌ను అడ్డుకున్న పోలీసులు.. అనుమతి లేదంటూ..

హైదరాబాద్ విమానాశ్రయంలో వైసీపీ నేత దేవినేని అవినాష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న క్రమంలోనే పోలీసులు ఆపేశారు.

Update: 2024-08-16 09:20 GMT

హైదరాబాద్ విమానాశ్రయంలో వైసీపీ నేత దేవినేని అవినాష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న క్రమంలోనే పోలీసులు ఆపేశారు. ఆయనపై కేసు ఉన్న నేపథ్యంలోనే విమానాశ్రయ పోలీసులు.. మంగళగిరి పోలీసులకు అవినాష్ ప్రయాణానికి సంబంధించిన సమాచారం అందించారు. అయితే అవినాష్‌పై కేసు ఉన్న నేపథ్యంలోనే అతడిని వెంటనే అడ్డుకోవాలని, ప్రయాణించడానికి అనుమతి ఇవ్వొద్దని మంగళగిరి పోలీసులు తెలిపారు. దీంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్‌పోర్ట్ పోలీసులు అడ్డుకుని వెనక్కు పంపారు. దాంతో చేసేదేమీ లేక అవినాష్ వెనుతిరిగారు.

అవినాష్‌పై ఉన్న కేసేంటంటే..

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వ పాలనలో మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కేంద్రాలయంపై జరిగిన దాడిపై విచారణ శరవేగంగా సాగుతోంది. 19 అక్టోబర్ 2021న తమ కార్యాలయంపై జరిగాన దాడి అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రాబల్యంతోనే జరిగిందని టీడీపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో వైసీపీకి చెందిన పలు కీలక నేతల పేర్లను కూడా పోలీసులు చేర్చారు. వైసీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామ కృష్ణారెడ్డి, వైసీపీ యువ నాయకుడు దేవినేని అవినాష్‌ల ఆధ్వర్యంలో వారి అనుచరులే దాడికి పాల్పడినట్లు అప్పట్లో టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. అదే కేసు ఎఫ్ఐఆర్‌లో దేవినేని అవినాష్ పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే అవినాష్‌ను ప్రయాణించకుండా అనుమతించకూడదని మంగళగిరి పోలీసులు.. శంషాబాద్ విమానాశ్రయ పోలీసులను కోరారు.

ఇప్పటికే ఈ కేసు విచారణకు సంబంధించి పలువురు వైసీపీ నేతలకు లుకౌట్ నోటీసులను కూడా పోలీసులు జారీ చేశారు. ఇప్పటికే పలువురు కీలక నేతలను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకోవడానికి కూడా పోలీసులు ప్రయత్నించారు. ఈ కేసు విచారణ కోర్టులో ఉన్న నేపథ్యంలో పోలీసులు ఏమాత్రం ఛాన్స్ తీసుకోదల్చుకోలేదని పోలీసులు అంటున్నారు.

Tags:    

Similar News