పండగ రోజు మద్యం దొరికేట్టు లేదు...

దసరా పండగ రోజు మద్యం దొరికేటట్లు కనిపించడం లేదు. మంచి బ్రాండ్స్ సంగతి దేవుడెరుగు, దుకాణాల్లో ఇప్పటికే మద్యం నిండుకుంది. మద్యం ప్రియులకు నిరాశ ఎదురైంది.

Update: 2024-10-10 06:00 GMT

ఆంధ్రప్రదేశ్ లో దసరా పండుగ నాటికి పాత మద్యం విధానానికి స్వస్తి చెప్పి కొత్త మద్యం విధానం వస్తుందని ప్రభుత్వం చెప్పింది. ప్రైవేట్ వారు మద్యం షాపులు నిర్వహించేలా చేసేందుకు ప్రభుత్వం చేసిన హడావుడి ఒక్కసారిగా చప్పున పడిపోయింది. ఇందుకు కారణం ఏమిటి? పండగ వెళ్లిన తరువాత మరో రెండు రోజులు కొత్త మద్యం షాపుల కోసం ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో మద్యం నిల్వలు లేవు. అన్ని షాపుల్లోనూ నిండుకున్నాయి. పాత మద్యం విధానం రద్దుచేసి కొత్త మద్యం విధానం అమలు చేసేందుకు నిర్ణయించి నోటిఫికేషన్ ఇచ్చినందున షాపులకు స్టాకు సరఫరాను ప్రభుత్వం దాదాపు నిలిపి వేసింది. ప్రస్తుతం మద్యం దుకాణాల్లో బ్రాంది అసలు లేదు. విస్కీ మాత్రమే అక్కడక్కడ కొన్ని షాపుల్లో ఉంది. చీఫ్ లిక్కర్ రూ. 150లు మద్యం ఉంది. అవి కూడా దాదాపు అయి పోవచ్చాయి.

పండగ నుంచి ఎందుకు ప్రారంభించడం లేదు

నూతన మద్యం దుకాణాలను దసరా పండుగైన ఈనెల 12న ప్రారంభించడం వాయిదా పడింది. ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందని ఆరా తీస్తే దరఖాస్తులు అనుకున్న మేర రాలేదు. అనుకున్న మేరే కాదు, కొన్ని షాపులకు అసలు దరఖాస్తులే రాలేదు. సుమారు 500 షాపులకు పైన దరఖాస్తులు రాలేదని సమాచారం. మంగళవారం నాటికి 931 షాపులకు దరఖాస్తులు దాఖలు కాలేదు. ఎందుకు దరఖాస్తులు అందలేదనే విషయంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఆ విషయాన్ని పక్కన పెడితే తగినన్ని దరఖాస్తులు రాకుండా డ్రా తీయడం కుదిరే పనికాదు. పైగా దరఖాస్తులు దాఖలు కాని షాపులకు తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మల్లీ పని పెరుగుతుంది తప్ప తగ్గదు. అందుకే షాపుల ప్రారంభాన్ని వాయిదా వేసి మరో రెండు రోజులు దరఖాస్తులు దాఖలు చేసుకునేందుకు గడువిచ్చారు. కొన్ని నియోజకవర్గాల్లో దరఖాస్తు దారులకు ఇన్ డైరెక్ట్ గా బెదిరింపులు వస్తుండటంతో దరఖాస్తులు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని సమాచారం. అటువంటి నియోజకవర్గాలపై ఎక్సైజ్ శాఖ మంత్రి ఇప్పటికే ఒక కన్ను వేసి ఎవరైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో వారికి నేరుగా మంచి పద్ధతి కాదనే విషయం తెలియజేసినట్లు సమాచారం. ఆయన జిల్లాలోనే ఒక నియోజకవర్గంలో పరిస్థితి చేయి దాటి పోవడంతో ఈ విషయాన్ని సీఎం చెవిన కొల్లు రవీంద్ర వేసినట్లు సమాచారం.

ఈనెల 11 వరకు దరఖాస్తులకు గడువు

మద్యం లైసెన్స్ ల కోసం ఈనెల 11 సాయంత్రం 7గంటల వరకు దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు. ఆన్ లైన్ పద్ధతిపై కానీ, మాన్యువల్ గా కానీ దరఖాస్తులు చేసుకోవచ్చు. మాన్యువల్ గా ఎక్కడెక్కడ షాపుల దరఖాస్తులు దాఖలు చేయాలో నోటిఫికేషన్ లో వివరించారు. అయితే గడువు పెంచుతూ బుధవారం మరో సర్క్యులర్ ను ఎక్సైజ్ శాఖ విడుదల చేసింది. ఇప్పటి వరకు ఇచ్చిన ఆరు జీవోలు, ఒక సర్క్యులర్ ను కోట్ చేస్తూ కొత్త సర్క్యులర్ జారీ అయింది. ఈనెల 12న దరఖాస్తుల పరిశీలన జరుగుతుంది. అదే రోజు డ్రా నిర్వహించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. 14న వచ్చిన అప్లికేషన్ లతో డ్రా జరుగుతుంది. ఈ తరువాత అక్కడే ఎవరికి షాపు దక్కిందనే వివరాలు అధికారులు తెలియజేస్తారు. లైసెన్స్ కూడా అక్కడే అందజేస్తారు. రెండు సంవత్సరాలకు నిర్వహించే మద్యం షాపుల డ్రా కార్యక్రమం ముగిసిన తరువాత 14 నుంచి షాపులు నిర్వహించుకునేందుకు మద్యం షాపుల యజమానులకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది.

నూతన మద్యం విధానంలో ఎటువంటి మద్యం బ్రాండ్స్ అందుబాటులో ఉంటాయో ఇంకా వెల్లడించలేదు. అన్ని రకాల మద్యం బ్రాండ్స్ ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ధరను కూడా బాగా తగ్గించి అందుబాటులో మద్యం ధరలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దరఖాస్తుల సమయంలోనే ఇలా ఉంటే అమ్మకాల సమయంలో ఎలా ఉంటుందోనని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News