దేశంలో దర్యాప్తు సంస్థలన్నీ ఆదానీ చేతుల్లోనే
భారత దేశంలో అవినీతి జరిగింది. అమెరికాలో బయట పడింది.
వ్యవస్థలను అదానీ తన గుప్పెట్లో పెట్టుకున్నారు. అమెరికా ద్వారా అదాని ఇచ్చిన ముడుపుల వ్యవహారం ప్రపంచానికి తెలిసింది. ఇది సిగ్గు చేటు. అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు పోయింది. అవినీతి గురించి ప్రపంచం చర్చించుకుంటోంది. అదాని దేశం పరువును తీస్తే.. మాజీ సీఎం జగన్ రాష్ట్రం పరువు తీశారు. అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. అదాని,జగన్‌ల మధ్య జరిగిన అవినీతి డీల్స్‌కు సంబంధించి ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ బంగళా వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు. సెకీతో జరిగిన ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఒప్పందంలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేయాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను తాకట్టు పెట్టారని, 25 ఏళ్ళకు డీల్ కుదుర్చుకున్నారంటే..వచ్చే తరాన్ని కూడా తాకట్టు పెట్టినట్టే అని విమర్శించారు. గుజరాత్‌లో రూ. 1. 99లకు సెకీ ఒప్పందం కుదుర్చుకొని విద్యుత్ సరఫరా చేస్తోంటే, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 2.49లకు ఒప్పందం చేసుకోవడం ఏంటని ఆమె ప్రశ్నించారు.
ఇప్పటికే సర్థుబాటు చార్జీల పేరుతో రూ. 17వేల కోట్ల భారం పడుతోందని, ఇంత జరిగినా కేంద్ర, రాష్ట్రాలు ఒక విచారణ కమిషన్‌కు వేయలేదన్నారు. అమెరికాలో చర్యలకు అక్కడి కోర్టులు సిద్ధమయ్యాయి. అరెస్టులు చేసుందుకు సిద్ధమవుతున్నారు. కానీ ఏపీ ప్రభుత్వం కనీస చర్యలు కూడా చేపట్ట లేదన్నారు. అదాని, మోడీలకు సీఎం చంద్రబాబు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అదాని పేరు కూడా సీఎం ఉచ్చరించ లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి దర్యాప్తు చేయలేదనే విషయం తెలుస్తోందన్నారు. గతంలో ఈ డీల్‌పై టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేయడంతో పాటు ఉద్యమాలు కూడా చేసిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డీల్‌లో అవినీతి జరిగిందని తెలిసినా, ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. దీనిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రను అదాని ప్రదేశ్ చేశారు. మొత్తం పోర్టులను అమ్మేశారు. జగన్, అదానికి దోచి పెట్టారు. ఇదంతా తెలిసినా కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో సమాధానం చెప్పాలన్నారు. జగన్, అదానితో ముడుపులు మాట్లాడుకున్నారు అనడానికి ఆధారాలున్నాయి. లంచాల కోసమే ఆ ఒప్పందంపై సంతకాలు పెట్టారు. లంచాలు తీసుకోకపోతే జగన్ తన బిడ్డలపై ప్రమాణం చేసి, తానే స్వయంగా విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరాలని డిమాండ్ చేశారు. అదాని ఉన్నందు వల్లే ఈ డీల్‌పై ఎవరు నోరు విప్పడం లేదన్నారు.