‘షరతులు అడ్డంకి కాకూడదు’.. వరదలపై మంత్రుల వరుస సమీక్షలు..

ఆంధ్రప్రదేశ్‌లో వరదల కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ధైర్యంగా ఉండాలని, వారిని రక్షించడానికి ప్రభుత్వం తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది.

Update: 2024-09-02 09:45 GMT

ఆంధ్రప్రదేశ్‌లో వరదల కారణంగా ఏర్పడిన విపత్కర పరిస్థితులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ధైర్యంగా ఉండాలని, వారిని రక్షించడానికి ప్రభుత్వం తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అన్ని విధాలుగా సహాయక చర్యలు అందిస్తున్నామని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా విజయవాడలోని పరిస్థితులను సీఎం చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇతర మంత్రులు సైతం వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. వారు తీసుకుంటున్న చర్యల గురించి ఆరా తీస్తున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు కూడా విజయవాడలోని సింగ్ నగర్‌లో పర్యటించి అక్కడి వరద బాధితులకు ధైర్యం చెప్పారు. మరోవైపు మంత్రి నారా లోకేష్, పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ సైతం ఎప్పటికప్పుడు అధికారులతో టచ్‌లో ఉంటూ వరద పరిస్థితులపై ఆరా తీస్తున్నారు.

భయమొద్దు.. ప్రజలకు అచ్చెన్నాయుడు భరోసా

సింగ్ నగర్‌లో పర్యటించిన వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలకు ధైర్యం చెప్పారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వారికి ప్రభుత్వం అన్ని వేళల, అన్ని విదాల అండగా నిలుస్తుందని చెప్పారు. ఈ మేరకు అధికారులకు పలు ఆదేశాలు చేశారు. పునరావాస కేంద్రాల్లో ఉంటున్న వారికి ఎటువంటి సమస్య లేకుండా జాగ్రత్త పడాలని సూచించారు. వరదల్లో చిక్కుకున్న వారికి యుద్దప్రాతిపదిక సహాయం అందించాలని చెప్పారు. అదే విధంగా రైతులు కూడా ఎవరూ భయడపాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వరద ఉధృతి తగ్గిన వెంటనే జరిగిన పంట నష్టాన్ని లెక్కించాలని, దాంతో పాటుగా పశువులను కోల్పోయిన రైతులను కూడా గుర్తించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పశువులను కోల్పోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటానని ఆయన వివరించారు.

కంట్రోల్ సెంటర్‌లో నారా లోకేష్

విజయవాడ వరద ప్రాంతాల్లో చేపడుతున్న సహాయక చర్యలను మంత్రి నారా లోకేష్.. కమాండ్ కంట్రోల్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. వరద అంచనా, బోట్ ఆపరేషన్, ఆహారం, తాగునీరు పంపిణీ, విద్యుత్ సరఫరాపై అధికారులతో ఆయన కూడా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 109 బోట్ల ద్వారా వరద బాధితులకు ఆహారం, తాగునీటిని అందిస్తున్నట్లు ఆయనకు అధికారులు వివరించారు. సింగ్‌నగర్, రామలింగేశ్వర నగర్ తదిరత ప్రాంతాల నుంచి దాదాపు 15 వేల మందిని సురక్షిత ప్రాంతాలను తరలించినట్లు నారా లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. అదే విధంగా విజయవాడలోని 49 ప్రాంతాల్లో 1,39, 815 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిందని, దానిని వెంటనే పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలని లోకేష్ ఆదేశించారు. ఈ మేరకు సహాయక చర్యలను వివిధ ప్రభుత్వ విభాగాధిపతులకు అప్పగించారు లోకేష్. ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను తనకు తెలియపరచాలని చెప్పారు.

ప్రాణనష్టం జరగకుండా చూస్తాం: నాదెండ్ల

విజయవాడలో తాండవిస్తున్న వరద పరిస్థితులపై మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వరద ఉధృతిని నివారించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. కృష్ణా కరకట్ట పలు చోట్ల బలహీనపడిందని, ఆయా ప్రాంతాల్లో మరమ్మతులు చేపడుతున్నామని ఆయన వివరించారు. గుంటూరు జిల్లా పరిధిలోని కరకట్టను పరిశీలించిన సందర్భంగా ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా నది వరద దృష్ట్యా తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని, ప్రాణ నష్టాన్ని జరగకుండా అన్ని చర్యలు చేపడతామని చెప్పారు. కరకట్ట బలహీనంగా 12 ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఆ ప్రాంతాల్లో కరకట్టను మరమ్మతు పనులను సత్వరం చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

నిబంధనలు అడ్డం కాకూడదు: పయ్యావుల

‘‘వరద ఊహించిన దాని కంటే అధికంగానే వచ్చింది. ఐదేళ్లలో కాలువల్లో పూడికలు తీయకపోవడం, నదిలో కలిసే మార్లన్నీ మూసుకుపోయినా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఇప్పుడు ఈ పరిస్థితులకు దారి తీసింది. వరద ఉధృతి తగ్గించాలన్న లక్ష్యంతో చర్యలు చేపడుతున్నాం. బాధితులకు సంబంధించిన ఆహార, తాగునీటి సరఫరా, సహాయక, పునరావాస చర్యల్లో రాజీకి తావులేకుండా చర్యలు తీసుకుంటున్నాం. షరతులు, నిబంధనలు అడ్డురాకుండా చూసుకోవాలి. ఏ షరతులైనా, నిబంధనలైనా ప్రజలకు మంచి పాలన అందించాడినే ఉపయోగపడాలి తప్పా వారిని ఇబ్బందుల్లో తోయడానికి కాదు. ఎస్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్‌తో సమన్వయం చేస్తున్నాం. ప్రభుత్వం తమ బాధ్యతను మించి పనిచేసే లక్ష్యంతో ముందుకెళ్తోంది’’ అని ఆయన వివరించారు.

Tags:    

Similar News