సిఎంఓలో అంబటికి చివాట్లు
అంబటి రాంబాబు సంబరాల రాంబాబుగా ఫేమస్. టీ కొట్టులో కనిపిస్తారు. దోశలు పోస్తారు. రాబోయే ఎన్నికల్లో ఈయనకు టిక్కెట్ ఉంటుందా? ఉండదా?;
By : The Federal
Update: 2024-03-14 12:30 GMT
జి విజయ కుమార్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబుకు చివాట్లు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పనితీరు బాగాలేదని సత్తెనపల్లి అభ్యర్థిగా ఈ సారి టికెట్ ఇవ్వొద్దంటూ ఆ నియోజక వర్గానికి చెందిన పలువురు స్థానిక నేతలు వైఎస్‌సీపీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. నర్సారావుపేట పార్లమెంట్ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా ఇటీవల నియమితులైన పి అనిల్ కుమార్ యాదవ్ వద్దకు పలువురు సత్తెనపల్లి అసెంబ్లీ నియోజక వర్గం నాయకులు ఫిర్యాదు చేశారు. అంబటి రాంబాబును వద్దంటే వద్దన్నారు. గత డిసెంబరులో అదే నియోజక వర్గానికి చెందిన చిట్టా విజయకుమార్ రెడ్డి ఇంట్లో ముఖ్య నాయకులంతా సమావేశమై అంబటి పనితీరును వ్యతిరేస్తూ ఫిర్యాదుల వర్షం కురిపించారు. అప్పట్లో అవి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వద్దకు కూడా వెళ్లాయి.
మాజీ మంత్రి అనీల్‌కుమార్ యాదవ్ ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని పోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబును సిఎం క్యాంపు కార్యాలయానికి పిలిపించి చివాట్లు పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఏకపక్ష నిర్ణయాలతో నియోజక వర్గంలో ఎవరినీ సంప్రదించకుండా ముందుకు వెళ్తుండటం వల్లనే నియోజక వర్గంలోని స్థానిక వైఎస్‌సీపీ నాయకుల నుంచి భారీగా వ్యతిరేకత వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. మంత్రి అయిన దగ్గర నుంచి నాయకులకు అందుబాటులో ఉండటం లేదని, చుట్టపు చూపుగా వచ్చి వెళ్తూ గుంటూరులోనే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
సంబరాల రాంబాబు
ఎక్కడ ఏ ఉత్సవం జరిగినా అక్కడికి వెళ్లడం స్థానికులను వేసే డ్యాన్సుల్లో పాల్గొనడం ఆంబటికి పరిపాటిగా మారింది. ఇప్పటికే రెండు సార్లు తనదైన స్టెప్‌లతో అలరించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో జరిగిన బోగి సంబురాల్లో ఆయన బంజార మహిళలతో కలిసి డ్యాన్స్‌లు వేశారు. కళ్లజోడు కాలేజీ పాప సూడు అనే పాటకు ఆయన వేసిన స్టెప్‌లు అప్పట్లో వైరల్‌గా మారాయి. దీంతో ఆయన మరింత ఫేమస్ అయ్యారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గడగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కొన్ని చోట్ల దోసెలు పోయడం, మరి కొన్ని చోట్ల టీ మాస్టర్ అవతారంలో స్థానికులను అలరించారు. టీ అమ్ముకున్న నరేంద్ర మోడీ ప్రధాని అయ్యారనీ, అంబటి రాంబాబు కూడా ఆ స్థానికి పోవాలనే ఇవన్నీ చేస్తున్నారనీ సెటైర్లు వేసుకుంటూ స్థానికులు మాట్లాడుకోవడం విశేషం.
డ్యాన్సులు వేయడం, టీ మాస్టర్‌గా మారడం, దోసెలు పోయడంపై పెట్టిన శ్రద్ధ నియోజక వర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంలో పెట్టి ఉంటో ఎంత బాగుండేదో అనే విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరికీ ఏ పనులూ చేయడం లేదని ఆ పార్టీ వారే ఫిర్యాదులు చేసే వరకు వచ్చారంటే నియోజక వర్గంలో పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇప్పటి వరకు సత్తెనపల్లి నియోజక వర్గానికి అభ్యర్థి అంబటి రాంబాబేనా లేక మరెవరైనా ఉన్నారా అనే విషయం మాత్రం సిఎం కార్యాలయం స్పష్టం చేయలేదు. రాంబాబు సోదరుడు మురళికి వైఎస్‌ఆర్‌సీపీ పొన్నూరు నియోజక వర్గ బాథ్యతలు అప్పగించినందున రానున్న ఎన్నికల్లో రాంబాబుకు టికెట్ వచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏమైనా ముఖ్యమంత్రి ఆలోచనలు, నిర్ణయాలపై ఆధార పడి ఉంటుందే తప్పా ఎవరేమనుకున్నా ఉపయోగం లేదనే వాదన కూడా ఆ పార్టీ నేతల్లో ఉంది. అంబటి రాంబాబు రాజకీయ జీవితం రాణిస్తుందా లేక పార్టీలో కేవలం నాయకుడిగానే మిగిలి పోతారా అనేది వేచి చూడాల్సిందే.