భూమన కరుణాకర్ రెడ్డిని జగన్ ఇప్పుడేం చేస్తారు? ఉంచుతారా, ముంచుతారా?
జగన్ 'నమ్మకాన్ని' దెబ్బతీసిన భూమన – ఆ అవినీతి అనకొండ ఈమేనా?;
By : The Federal
Update: 2025-08-27 04:46 GMT
ప్రతిపక్ష వైసీపీలో ఓ అలజడి.. సొంత పార్టీ నేతలే పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగస్టు 26న పేల్చిన బాంబు వైసీపీ నేతల్లో కలకలం రేపింది. పార్టీ శ్రేణుల్లో సంచలనం సృష్టించింది. జగన్ పాలనలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై భూమన కరుణకర్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు.
భూమన ఆ ఐఎఎస్ అధికారి పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, వైఎస్సార్‌సీపీ పాలనలో మున్సిపల్ పరిపాలన శాఖను పర్యవేక్షించిన అధికారి యర్రా శ్రీలక్ష్మీ అని అందరికీ తెలిసిపోయింది. ఆమె వైఎస్ రాజశేఖరరెడ్డికి, ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలు.. సీనియర్ ఐఏఎస్ అధికారి. జగన్ ప్రభుత్వ హయాంలో సీఎంఓలో అనధికారికంగా కీలకంగా వ్యవహరించిన వ్యక్తి.
అటువంటి శ్రీలక్ష్మి టీడీఆర్ బాండ్ల జారీ వ్యవహారంలో కీలక పాత్ర పోషించిందని, “అవినీతికి అనకొండని, తాటకీ, పిశాచి, ఆధునిక రజియా సుల్తానా” అని ఆయన ఆరోపించారు.
ఆ అధికారికి రాష్ట్ర మంత్రులంటే గౌరవం లేదని, “డబ్బు సంపాదించడం తప్ప ఆమెకు ఎలాంటి నైతిక విలువలూ లేవు” అని భూమన ఆరోపించాడు. తన ఆధీనంలోని సిబ్బందిపట్ల “అధికార దుర్వినియోగం చేసినట్లుగా” విమర్శించాడు.
తిరుపతిలో రోడ్ల పనులు జరుగుతున్న సమయంలో వందల కోట్ల రూపాయలను తస్కరించేందుకు ఆమె కుట్ర పన్నిందని భూమన ఆరోపించాడు. ఈమె వ్యవహారాన్ని తాను ఆనాడే బయటపెడతానంటే గత ప్రభుత్వం (వైఎస్ జగన్)లోని పెద్దలు అంగీకరించలేదని భూమన చెప్పారు.
ఇప్పుడీ వ్యవహారం రాష్ట్రంలో మంటలు రేపుతోంది. భూమన కరుణాకర్ రెడ్డి ఎవర్ని టార్గెట్ చేసినట్టు అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇన్నేళ్ల తర్వాత ఓ మహిళా అధికారినీ, ప్రత్యేకించి జగన్ కి సంబంధించిన కేసుల్లో ఇరుక్కుని జైలు పాలై అన్ని విధాలా నష్టపోయిన యర్రా శ్రీలక్ష్మీని వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన భూమన ఎందుకు టార్గెట్ చేసినట్టు? జగన్ ను ఇరుకున పెట్టాలనా? లేక టీడీఆర్ వ్యవహారంలో తనకేమీ సంబంధం లేదని చెప్పాలనా? అని రాజకీయ విశ్లేషకుడు మహేందర్ రెడ్డి ప్రశ్నించారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తెలంగాణ క్యాడర్ నుంచి ఏపీకి మార్పించి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాకు తీసుకెళ్లిన శ్రీలక్ష్మిపై తన అనుంగు అనుచరుడు భూమన చేసిన ఆరోపణలపై ఆయన (జగన్) ఎలా స్పందిస్తారో చూడాలి.
సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈమె పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. జగన్ అక్రమాస్తుల కేసులో, ఓబులాపురం మైనింగ్ కేసులోనూ కూడా శ్రీలక్ష్మి నిందితురాలుగా అభియోగాలు ఎదుర్కొన్నారు. కొన్ని నెలల పాటు జైలులో కూడా ఉన్నారు.
గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓఎంసీ (ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్)కి భూములు ఇచ్చే క్రమంలో-జారీ చేసిన జీవోలో- ఆమె చేర్చిన "క్యాపిటివ్ మైన్స్" అనే పదాన్ని అడ్డంపెట్టుకుని వేల కోట్ల రూపాయల ఖనిజం చైనాకి తరలిపోయినట్టు కేసు నమోదు అయింది. ఈ కేసులో ఆమె జైలు పాలైంది. ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకుంది. చివరకు హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బయటపడింది. అయితే ఇప్పుడా తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసి ఆమెపై తిరిగి విచారణ జరపాల్సిందేనని ఆదేశించింది.
రాష్ట్ర విభజన తరువాత శ్రీలక్ష్మిని తెలంగాణకు కేటాయించారు. 2019 ఎన్నికలలో ఏపీలో వైసీపీ విజయం సాధించి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె ఏపీకి వచ్చేశారు. ఆమెను ఏపీకి తీసుకురావడం కోసం అప్పటి ముఖ్యమంత్రి జగన్ స్వయంగా కేసీఆర్ ను కోరారు. ఆమె ఏపీకి వచ్చిన తరువాత జగన్ ఆమెకు కీలకమైన మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖలను అప్పగించారు. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా ఖాతరు చేయలేదు.
ఆ తరువాత 2024 ఎన్నికలలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా రిజర్వ్ లో ఉంచారు. చంద్రబాబు ఆమె నుంచి పుష్పగుచ్చాన్ని తీసుకునేందుకు కూడా ఇష్టపడలేదు.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే టీడీపీ ఇంత కాలం శ్రీక్ష్మిపై చేసిన విమర్శలన్నిటినీ ఇప్పుడు తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి చేయడం. టీడీఆర్ బాండ్స్ కుంభకోణంపై చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) వేయాలని ఆలోచిస్తున్న దశలో భూమన ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మి మాస్టర్ మైండ్ అంటున్నారు. వాస్తవానికి భూమన కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
జగన్ ఈ విషయంలో ఎలా స్పందిస్తారన్న ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో జగన్ భూమనను సమర్ధిస్తారా లేక శ్రీలక్ష్మిని డిఫెండ్ చేస్తారా అన్న ఉత్కంఠ వ్యక్తం అవుతోంది. లేదా అసలేం జరగనట్లు భూమన వీడియోను పూర్తిగా విస్మరించి మౌనం దాలుస్తారా? చూడాల్సి ఉంది.
తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లు వేస్తున్న సమయంలో, టీడీఆర్ బాండ్ల ద్వారా భారీగా దోచుకోవాలని ఆమె ప్రణాళిక వేశారని, అయితే తాము దానిని అడ్డుకున్నామని భూమన చెబుతున్నారు. అందుకే శ్రీలక్ష్మి నెల్లూరు జిల్లా టీడీపీ నేతలకు తప్పుడు సమాచారం అందించి తాను (భూమన) 2 వేల కోట్లు దోచుకున్నట్లు అసత్య ప్రచారం చేయించారన్నారు.
వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు పార్టీ అంతర్గత రాజకీయాలకే కాకుండా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిగత నమ్మకానికి కూడా గట్టి సవాల్ విసిరినట్టే.
శ్రీలక్ష్మి – ఐఎఎస్ టాపర్ నుంచి వివాదాల దాకా...
యర్రా శ్రీలక్ష్మి.. పశ్చిమ గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన నేపథ్యం. 1960లో జన్మించారు. 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ టాపర్. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించింది. ఆమె ఐఏఎస్ టాపర్. పరిపాలనలో అగ్రశ్రేణి అధికారిణి. తన సహచరుడైన ఐపీఎస్ గోపీకృష్ణను కులాంతర వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు.
కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కేసులో ఆరో నిందితురాలిగా ఉన్న ఆమె 2011లో అరెస్ట్ అయ్యింది. 2013 ఏప్రిల్ 2 చంచల్‌గూడ జైలు నుంచి విడుదల అయ్యారు.
రాష్ట్ర విభజన తర్వాత 2014లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లేందుకు ప్రయత్నించింది. కేంద్ర ప్రభుత్వం నిరాకరించడంతో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ను ఆశ్రయించి విజయం సాధించింది. క్యాట్ అదేశాలతో కేంద్రప్రభుత్వం ఆమెను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేసింది.
శ్రీలక్ష్మి ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించగా 2024 జూన్ 19న ప్రభుత్వంలో జీఏడీకి(సాధారణ పరిపాలన శాఖ) అటాచ్ చేసింది. మళ్లీ పోస్టింగ్ ఇవ్వలేదు.
అటువంటి శ్రీలక్ష్మిపై వైసీపీ వాళ్లే ఆరోపణలు చేయడం సంచలనం రేపుతోంది.