చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకుడి ఆలయ ట్రస్టు బోర్డు లేకుండానే వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. కాణిపాకంలో వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 16వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అధికారుల పర్యవేక్షణలో వినాయకచవితి సందర్భంగా ప్రారంభమైన ఉత్సవాలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టువస్త్రాలు సమర్పించారు.
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు మేయర్ ఆముద ఏఎస్పీ రామకృష్ణ రాజు, ఉన్నతాధికారులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముందు మంత్రి రామనారాయణరెడ్డికి ఆలయ ఈఓ పెంచలకిషోర్ సారధ్యంలో అర్చకులు పూర్ణకుంభస్వాగతం పలికారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన తరువాత ఆలయం వెలుపల రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ర్టంలో వ్యవసాయం, విద్య, పారిశ్రామిక రంగాలు మరింతగా వికసించాలని కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని ప్రార్థించానని చెప్పారు.
"కాణిపాకం ఆలయ ట్రస్టు బోర్డు త్వరలో నియమిస్తాం" అని మంత్రి రామనారాయణరెడ్డి చెప్పారు. దీనికోసం సీఎం ఎన్. చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారని ఆయన వెల్లడించారు.
కాణిపాకం దేవస్థానంలో నూతన అన్నదాన ప్రసాద భవనాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. పూతలపట్టు ఎమ్మెల్యే కిలికిరి మురళీమోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్రమోహన్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఆ తరువాత ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వంటశాలను పరిశీలించారు. అన్నవితరణ కార్యక్రమంలో ప్రసాదాల రుచిచూశారు.
ఉత్సవాలు ఇలా..
కాణిపాకంలో ఉదయం, రాత్రి వేళల్లో పల్లకీ సేవలు నిర్వహిస్తారు. ఆలయ మండపాలకు సమీపంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రదర్శించడానికి ఏర్పాట్లు చేశారు.
ఆగస్టు 28న ధ్వజారోహణం, రాత్రి హంసవాహన సేవతో స్వామివారి వాహనసేవలు ప్రారంభం అవుతాయి.
ఆగస్టు 29న రాత్రి స్వర్ణనెమలి వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు.
ఆగస్టు 30న రాత్రి మూషిక వాహన సేవ
ఆగస్టు 31న చిన్న శేషవాహనం, రాత్రి పెద్దశేషవాహనం
సెప్టెంబర్ 1న చిలుకవాహనం, రాత్రి వృషభవాహనం,
సెప్టెంబర్ 2న రాత్రి గజవాహన సేవ,
సెప్టెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం రథోత్సవం
సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి తిరుకల్యాణం, అశ్వవాహన సేవ
సెప్టెంబర్ 5వ తేీ సాయంత్రం ధ్వజావరోహణం, ఏకాంతసేవతో బ్రహ్మెత్సవాలు ముగుస్తాయి.
ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా..
సెప్టెంబర్ 6న రాత్రి అధికారనంది వాహనసేవ
సెప్టెంబర్ 7న రావణబ్రహ్మ వాహనసేవ నిర్వహించాలి. కానీ ఆ రోజు చంద్రగ్రహణం కారణంగా ఉదయం ఆ సేవ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
సెప్టెంబర్ 8న యాళివాహన సే,
సెప్టెంబర్ 9న రాత్రి సూర్యప్రభ వాహనసేవ
సెప్టెంబర్ 10వ తేదీ చంద్రప్రభ వాహనసేవ
సెప్టెంబర్ 11వ తేదీ రాత్రి కల్పవృక్షసేవ,
సెప్టెంబర్ 12వ తేదీ రాత్రి విమానోత్సవం, సెప్టెంబర్ 13న రాత్రి పుష్పపల్లకీసేవ, సెప్టెంబర్ 14వ తేదీ రాత్రి కామధేనువాహనసేవ, సెప్టెంబర్ 16వ తేదీ రాత్రి తెప్పోత్సవంతో ప్రత్యేక ఉత్సవాలు ముగుస్తాయి.
ఎలా వెళ్లాలి..
చిత్తూరు జిల్లా ఆధ్యాత్మిక ఆలయాలకు నిలయం. అందులో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన ఆలయాల్లో తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం. ఆ తరువాత శైవక్షేత్రాల్లో శ్రీకాళహస్తి, కాణిపాకం వరసిద్ధుడి వినాయకుడి ఆలయాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఆలయాలకు దేశ, విదేశాల నుంచి కూడా యాత్రికులు లక్షలాది మంది వస్తుంటారు.
చిత్తూరు నుంచి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్టాండు నుంచి అర్ధగంటకు ఓ ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో
బస్సు చార్జీ: తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లడానికి ఒకరికి రూ.110 చార్జీ.
"స్త్రీశక్తి పథకంలో మహిళలకు ఉచిత రవాణా సదుపాయం అందుబాటులో ఉంది" అని తిరుపతి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జగదీష్ చెప్పారు.
పాలక మండలి లేకుండానే..
శ్రీకాళహస్తి, ఆ తరువాత ప్రస్తుతం వినాయకచవితి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన కాణిపాకం ఆలయానికి కూడా పాలక మండలి ఏర్పాటు కాలేదు.
టీడీపీ కూటమి మూడు పార్టీల బాగస్వామ్యంతో ఏర్పడిన తరువాత నామినేటెడ్ పోస్టులకు తీవ్ర పోటీ ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో జనసేన, బీజేపీ నుంచి కూడా ఒత్తిడి ఉండడం, టీడీపీలో పదవుల కోసం పోటీ పడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్లే కాణిపాకం ఆలయ ట్రస్టు బోర్డు ఏర్పాటు కాలేదనే మాటలు వినిపిస్తున్నాయి.
కాణిపాకం పరిధిలో 14 గ్రామాలు ఉన్నాయి. ఒకో గ్రామం నుంచి ఒకో రోజు వరసిద్ధుడి బ్రహ్మోత్సవాలకు ఉభయదారులుగా వ్యవహరిస్తుంటారు. దశాబ్దాల కాలంగా ఈ ఆచారం ఇక్కడ సంప్రదాయంగా కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వంలో కూడా కాణిపాకం ప్రాంతానికి చెందని వ్యక్తికి చైర్మన్ పదవి ఇవ్వడంపై ఉభయదారులుగా ఉన్న 14 పల్లెల ప్రతినిధులు ఆక్షేపణ తెలిపారు. ఈ పరిస్థితుల్లో తాజాగా కూడా చైర్మన్ పదవికి ఎంపిక చేయడంలో ప్రతిష్టంభన ఏర్పడినట్లు సమాచారం.