లడ్డూ వివాదంపై ఇరు పక్షాల డిమాండ్లు ఒకటే..

తిరుపతి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ వివాదంపై ఇటు టీడీపీ, అటు వైసీపీ చేస్తున్న డిమాండ్లు ఒకేలా ఉన్నాయి.

Update: 2024-09-24 11:36 GMT

తిరుపతి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ వివాదంపై ఇటు టీడీపీ, అటు వైసీపీ చేస్తున్న డిమాండ్లు ఒకేలా ఉన్నాయి. పూర్తి స్థాయి విచారణ జరపాలని, బాధ్యులకు కఠిన శిక్ష విధించాలని వైసీపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టేది లేదని, బాధ్యులు ఎంతటి వారైనా కఠిన శిక్ష పడేలా చేస్తామంటూ టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇరు పక్షాలు చేస్తున్న డిమాండ్ ఒకటే అయినప్పటికీ వాటి వెనక ఆంతర్యం మాత్రం ఎదుటివారిపై దుమ్మెత్తి పోయడమే ప్రధానంగా ఉంది. దీని మొత్తాన్నికి వైసీపీ ప్రభుత్వమే కారణమని కూటమి నేతలు అంటుంటే.. అసలు కల్తీ నెయ్యి అన్నది బయటపడింది కూటమి సర్కార్ పాలనలో కాబట్టి దీనికి చంద్రబాబే కారణమని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ వివాదంపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. అదే విధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నీ కూడా దర్యాప్తు సంస్థలు ఇచ్చే నివేదికల ఆధారంగా జరుగుతాయని ఆనం తెలిపారు.

అపవిత్రానికి తావివ్వం: ఆనం

‘‘తిరుమలలో ఎటువంటి అపవిత్ర కార్యక్రమం జరగకుండా చూసుకుంటాం. ప్రస్తుతం నాణ్యమైన నెయ్యితోనే లడ్డూ, అన్నప్రసాదాలను తయారు చేస్తుంది టీటీడీ. శ్రీవారి బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగాలనే శ్రీవారిని ప్రార్థించా. అక్టోబర్ 4న రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు టీటీడీ అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది’’ అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగానే వెంకటగిరి పోలేరమ్మ జాతర, కన్యకా పరమేశ్వరి పండుగులను రాష్ట్ర పండగల జాబితాలో చేర్చినట్లు వెల్లడించారు. అతి త్వరలోనే పాలక మండలిని ఏర్పాటు చేయనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు. లడ్డూ వివాదంలో సిట్, విజిలెన్స్ బృందాలు ఇచ్చే నివేదికల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

దమ్ములేకే హంగామా చేస్తున్నారు: అంబటి

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందా అన్న ప్రశ్నకు చంద్రబాబు నుంచి కానీ అధికార పక్షాల నుంచి కానీ ఇప్పటి వరకు స్పష్టం సమాధానం రాలేదని అంబటి రాంబాబు గుర్తు చేశారు. ఏకాడికి వారి ఆరోపణలు, వ్యాఖ్యలే తప్ప సాక్ష్యాలు, ఆధారాలు లేవని, ఉంటే వాటిని ఎందుకు చూపడం లేదని ఆయన ప్రశ్నించారు. కానీ పచ్చమీడియా మాత్రం అపచారం జరిగిందని, జంతు అవశేషాలు కలిపిన నెయ్యితోనే ప్రసాదం తయారు చేశారని రాసేస్తోందని ఆయన విమర్శించారు. నిజంగా ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ జరిగి తీరాలని, అప్పుడే అ వివాదం నిగ్గు తేలుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పచ్చ మీడియా చెప్తున్నట్లు నిజంగానే కల్తీ నెయ్యి వినియోగం జరిగి ఉంటే ఇప్పటి వరకు మాటలే తప్ప సాక్ష్యాలు ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు.

‘‘టీటీడీ లడ్డూలో కల్తీ జరగలేదని పవన్ కల్యాణ్ నిరూపించలేదు. మత ఘర్షణలు రెచ్చగొట్టడానికే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. చేసిన ఆరోపణలను నిరూపించే దమ్ము లేకే వీళ్లు ఇంత హంగామా చేస్తున్నారు. హిందూ సాంప్రదాయాల గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. తండ్రి చనిపోయిన సమయంలో కూడా చంద్రబాబు తలనీలాలు ఇవ్వలేదు. అటువంటి వ్యక్తికి సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత లేదు’’ అని మండిపడ్డారు. అంతేకాకుండా చంద్రబాబు హయాంలో ఎన్నో హిందూ దేవాలయాలను పడగొట్టించారని, హిందూ దేవుళ్లను అవమానించిన ఎందరో వ్యక్తులు టీడీపీ వాళ్లేనని చెప్పారు. ఆఖరికి విజయవాడ అమ్మవారి ఆలయంలో క్షుద్రపూజలు జరిగింది కూడా చంద్రబాబు హయాంలోనే అని అన్నారు అంబటి.

Tags:    

Similar News