శ్రీవారికి తమిళనాడు భక్తుల అపూర్వ స్వర్ణ కానుక

కానుకగా అందిన రూ.2.40 కోట్ల విలువైన శంఖు,చక్రం సమర్పణ.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-07-29 07:38 GMT
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారికి అందిన బంగారు శంఖు, చక్రం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి అలంకారభూషితుడు. ఆలయంలోని శ్రీవారి మూలవిగ్రహం, ఉత్సవమూర్లకు ఉన్న ఆభరణాలకు కొదవ లేదు. ఆ భాండాగారంలోకి మరో అరుదైన కానుకలు చేరాయి.

తమిళనాడుకు చెందిన భక్తులు మంగళవారం ఉదయం సుమారు. 2.40 కోట్ల విలువైన శంఖు, చక్రాలు కానుకగా సమర్పించారు. ఈ ఆభరణాలు బరువు 2.5 కిలోల బరువు ఉందని టీటీడీ అధికారులు తెలిపారు.

తిరుమల శ్రీవారికి 12వ శతాబ్దం నుంచే భారీగా కానుకలు అందాయి. దీనికి సంబంధించిన ఆభరణాలు, రికార్డులు నిర్వహణకు టీటీడీ ప్రత్యేక యంత్రాంగం ద్వారా పగడ్బందీ ఏర్పాట్ల మధ్య పర్యవేక్షిస్తోంది.
విజయనగర సామ్రాజ్యాధిపతిగా శ్రీకృష్ణదేవరాయల వారి కాలం నుంచి శ్రీవారికి ఆభరణాల వెల్లువ ప్రారంభమైందనే విషయం చారిత్రక సత్యం. ఆ కోవలోనే తిరుమల శ్రీవారి భాండాగారంలో దాదాపు 11 టన్నుల వరకు స్వర్ణాభరణాలు ఉన్నట్లు సమాచారం. దీనికోసం టీటీడీ 19 రకాల రికార్డులు నిర్వహిస్తోంది.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆలయంలో భక్తుల విగ్రహాలు తిరుమలలో మాత్రమే కనిపిస్తాయి. శ్రీకృష్ణదేవరాయలువారి కాలంలో తిరుమలకు స్వర్ణయుగం లాంటిదని అభివర్ణిస్తారు. ఆలయ నిర్మాణం, నిర్వహణ, కానుకల సమర్పణలో శ్రీకృష్ణదేవరాయలవారి వంశీకులు చరిత్ర ( Descendants of Sri Krishnadevaraya ) లో చిరస్థాయిగా ఉన్నాయి. ఈ ఆలయంలో మహద్వారం దాటగానే ఇద్దరు భార్యలు చిన్నమదేవి, తిరుమలదేవి తోపాటు శ్రీకృష్ణదేవరాయలవారి విగ్రహాలు కనిపిస్తాయి. వెలకట్టలేని ఆభరణాలు శ్రీవారికి సమర్పించిన ఘటన రాయలవారిదే.
తమిళనాడు ప్రాంత రాజవంశీయుల కానుకలు కూడా శ్రీవారికి సమర్పించారు. విశేష ఉత్సవాలు, రోజువారీ అలంకరణలకు ఆ ఆభరణాలు వాడుతుంటారు. ఇదిలావుంటే..
తమిళనాడు రాష్ట్రం చెన్నైకు చెందిన సుదర్శన్ ఎంటర్ ప్రైజెస్ సంస్థ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి మంగళవారం సుమారు రూ.2.40 కోట్లు విలువైన దాదాపు రెండున్నర కేజీల బంగారు శంఖు, చక్రాలను విరాళంగా అందించింది. తిరుమల ఆలయ రంగనాయకుల మండపంలో తమిళనాడు దాతలు తీసుకుని వచ్చిన శంఖు, చక్రాన్ని టీటీడీ అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్య చౌదరికి అందించారు. వారికి శ్రీవారి దర్శనం కల్పించిన తరువాత వేదాశీర్చచనం స్వామివారి ప్రసాదాలు అందించారు.

Similar News