TTD|కోనేటి కొండల్లో 'ఆనంద'శోభ..
యాత్రికులకు మధురానుభూతి అవసరం. తిరుమల, నడకమార్గంలో మరింత అందంగా తీర్చిదిద్దుతా. ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి మనసులో మాట ఇది.
Byline : SSV Bhaskar Rao
Update: 2024-11-19 06:25 GMT
తెలంగాణలోని యాదాద్రి (యాదగిరిగుట్ట) నృసింహస్వామి ఆలయ పునర్ నిర్మాణంలో ఆర్కిటెక్ గా ఆయనది కీలకపాత్ర. వైష్ణవాలయాలకు ఈయన చీఫ్ ఆర్కిటెక్ గా నగిషీలు దిద్దారు. ఆ తరహాలో తిరుమల ఆలయ పరిసరాలు, కొండపై సినిమా సెట్టింగ్ తరహాలోనే ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దుతానని సినిమా ఆర్ట్ డైరెక్టర్, టీడీపీ బోర్డు సభ్యుడు ఆనందసాయి మనసులో మాట ఇది.
తెలుగు చిత్రపరిశ్రమలో ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయికి పేరుంది. 50 సినిమాలకు పైగానే ఆయన ఆర్ట్ డైరెక్టర్ గా పని చేశారు. తొలిప్రేమ చలనచిత్రంతో జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు దగ్గరైన ఆయన ఆత్మీయ మిత్రుడయ్యారు. ఇదే ఆయనను టీటీడీ పాలకమండలి సభ్యుడిగా చేసింది.
"తిరుమలలో సేవ చేసే భాగ్యం లభించడం నాకు దక్కిన వరం" అని అంటున్న ఆనందసాయి, యాత్రికుల సేవలోనే తన పదవికి న్యాయం చేస్తానని అంటున్నారు.
"నా పదవి శ్రీవారి సేవా టికెట్లకు సిఫారసు చేయడం కాదు" అని పదవి బాధ్యతలు స్వీకరించిన రోజే ఆనంద్ సాయి తన అభిప్రాయాలను వెల్లడించారు.
"నాకు లభించిన ఈ పదవి ద్వారా యాత్రికులకు అవసరమైన సేవల కోసమే వినియోగిస్తా" అని ఆనంద సాయి స్పష్టం చేశారు.
తిరుమల చరిత్ర క్లుప్తంగా..
తిరుమల కలియుగ వైకుంఠం. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు శ్రీవేంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడనేది చరిత్ర. తిరుమల ఆలయాన్ని, ఆనంద నిలయాన్ని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీవేంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాభ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు (తంజావురు) పాండ్యరాజులు (మదురై), 13-14 శతాభ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. తిరుమలలో సతీసమేత శ్రీకృష్ణదేవరాయలవారి విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. దేశంలో ఏ ఆలయంలో కూడా భక్తుల విగ్రహాలు ఇలా లేవు.
విషయానికి వస్తే..
తిరుమలకు అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో యాత్రికులు నిత్యం వేలాదిమంది నడిచి వెళుతుంటారు. తిరుమల కొండకు చేరిన తర్వాత స్వామివారి దర్శనానికి క్యూలో గంటలకొద్దీ వేచి ఉండే పరిస్థితి. కారణం రద్దీ పెరగడమే. కిలోమీటర్ల కొద్దీ క్యూలో యాత్రికులు బారులుదీరి ఉంటారు. వారికి టీటీడీ అల్పాహారంతో పాటు అన్న ప్రసాదాలు కూడా అందిస్తుంది.
ఆహ్లాదం అవసరం
తిరుమలలో యాత్రికులకు కనీస వసతులే కాదు. గంటలకొద్దీ క్యూలో నిరీక్షించే యాత్రికులు విసుగు చెందకూడదనేది టీటీడీ బోర్డు సభ్యుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనందసాయి మదిలోని మాట.
యాత్రికులకు ఆహ్లాదంతో కూడిన ఆధ్యాత్మికభావన మరింత పెంపొందించాలని ఆయన అంటున్నారు. తిరుమల ఆలయ పరిసరాలు, క్యూలు విస్తరించిన ప్రాంతాల్లో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుదానికి నా వంతు ప్రయత్నం చేస్తా అని ఆనందసాయి చెబుతున్నారు. దీనికోసం..
ఇవీ ప్రధాన ప్రదేశాలు..
తిరుమల కొండపైకి పాదం మోపగానే కనిపించేవి కొన్ని ప్రధాన ప్రదేశాలు. అంటే పార్కులు. వాటిలో జీఎన్సీ (Garudadri Nagar Cottage -GNC) టోల్ గేట్ దాటగానే గీతోపదేశం చేసే పార్కు, శంకుమిట్ట వద్ద ఉన్న నామాలపార్కు, ఆలయం వెనుక భాగంలో తోట, శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమల కొండ ఎక్కగానే NBC మంగళంబావి కాటేజీ, నారాయణగిరి ఉద్యానవనం (NGCH), శ్రీవారి ఆలయంలోనికి ప్రవేశించడానికి ముందు ఉన్న ATC సర్కిల్, గోగర్భం డ్యాం వెళ్లే మార్గంలో కుడి పక్కన మరో పెద్ద పార్కు ఉంది. ఈ పరిసరాల నుంచే తిరుమల శ్రీవారి ఆలయంలోకి దర్శనానికి వెళ్లేందుకు యాత్రికులు క్యూలో గంటల కొద్ది నిరీక్షిస్తుంటారు.
"ఈ ప్రాంతాలలో యాత్రికులు అసహనానికి గురికాకూడదు. వారిని అలరించే విధంగా ఆకర్షణీయంగా ఉద్యానవనాలను తీర్చిదిద్దాలి. అందుకు అవసరమైన సెట్టింగ్ రూపకల్పన చేస్తా" అని ఆనందసాయి ప్రకటించారు. ప్రస్తుతం ఈ ప్రదేశాలన్నీ టీటీడీ ఉద్యానవన శాఖ విభాగం పర్యవేక్షిస్తోంది. కాంట్రాక్టు కార్మికులు కూడా దేశీ, విదేశీ పూల మొక్కలను పెంచడంతోపాటు, పచ్చదనం కోసం ప్రత్యేకంగా శ్రమిస్తూ ఉంటారు. దీనితోపాటు
నడక మార్గంలో..
తిరుమలకు అలిపిరి మార్గంలో కూడా యాత్రికులు పెద్ద సంఖ్యలో నడిచి వెళుతూ ఉంటారు. ఇదంతా దట్టమైన అడవి అయినా, మార్గమధ్యలో చిరు వ్యాపారుల దుకాణాలు ఉండటం వల్ల యాత్రికులకు కాస్త ఊరట. రక్షణ కూడా. నడకమార్గంలో ఇరుపక్కల చాలా చోట్ల ఖాళీ ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలలో కూడా యాత్రికులకు మానసిక ఉల్లాసం, ఆధ్యాత్మికత ప్రబోదించే విధంగా సెట్టింగ్ తరహా ప్లాన్ తయారుచేసి ఇస్తానని ఆనందస్థాయి చెబుతున్నారు.
నడక నేర్పిన అనుభవం
తిరుపతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రకటించడానికి రెండు రోజుల ముందు ఆయన వెంట ఆనందసాయి అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్లారు. నడకమార్గంలో చాలా చోట్ల అలసి, సొలసిన వారిద్దరు సేద తీరారు. అదే సమయంలో ఆనందసాయి మదిలో ఓ ఆలోచన మెదిలినట్లు ఉంది. ప్రకృతి రమణీయత మధ్య యాత్రికులు గోవిందనామ స్మరణలతో వెళుతూ ఉండడం గమనించిన ఆనందసాయి ఈ మార్గంలో కూడా ఆహ్లాదకరమైన వాతావరణం మరింత పెంపొందించే ఆలోచనలు మెదడులో కదిలినట్లు ఉన్నాయి.
ఆ తర్వాత ఆయనకు టీటీడీ బోర్డు లో సభ్యత్వం దక్కడంతో తన ఆలోచనలకు కార్యరూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన ఆలోచనలను ఆచరణలోకి తీసుకురావడానికి వీలుగా
"టీటీడీ అధికారులు తిరుమల కొండకు సంబంధించిన బ్లూ ప్రింట్ ఇస్తే, మరింత ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేస్తా" అని ఆయన చెబుతున్నారు.
ఎవరీ ఆనందసాయి
దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో కళాదర్శకుడు ఆనంద సాయి. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమ, యమదొంగ, సైనికుడు, గుడుంబా శంకర్, బాలు లాంటి చిత్రాలకు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు. ఈయన తెలంగాణలోని యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణంలో రూపకర్తగా కీలక పాత్ర పోషించారు. యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయం నిర్మాణంలో వైష్ణవ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబించే శిల్పాలను తయారు చేయడంతో పాటు ఆలయ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించారు.
తెలంగాణ మాజీ సీఎం కే.చంద్రశేఖరరావు స్వయంగా ఆనందసాయికి ఆ బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని ముచ్చింతల్ శ్రీరామనగరంలో ఉన్న తమ ఆశ్రమ రూపకల్పన కోసం కూడా చినజీయర్ స్వామి స్వయంగా ఆనందసాయిని సంప్రదించారు. అంటే ఆయన కళ తపస్సును మెచ్చినట్లే భావించక తప్పదు. స్వామీజీ పిలుపుమేరకు రెండున్నర ఏళ్ల పాటు దేశంలోని ప్రముఖ ఆలయాలను ఆనందసాయి సందర్శించారు. ఆ తర్వాతే యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణానికి మాజీ సీఎం కేసీఆర్ నుంచి కూడా పిలుపు అందుకున్నారు.
ఒడిశా నుంచి..
ఒడిస్సా రాష్ట్రంలోని పర్లాకిమిడికి చెందిన ఆనంద సాయి తండ్రి బి. చలం కూడా చిత్ర పరిశ్రమలో కళాదర్శకుడే. 1950లో చలం మద్రాసు వచ్చారు. ఈయన కొడుకు ఆనందసాయి ఒడిశాలోని జన్మించారు. చెన్నైలో ఇంటీరియర్ డిజైన్ చదివిన ఆనంద సాయి సినిమా రంగంలోకి రాకముందు ఈవెంట్ మేనేజ్మెంట్లో కొంతకాలం పని చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 50 కి పైగా సినిమాలకు ఆయన ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన తొలిప్రేమ సినిమా చిత్రీకరణ కోసం సముద్ర తీరంలో తాజ్ మహల్ సెట్టింగ్ వేయడం ద్వారా ఆనంద సాయి తన ప్రత్యేకతను చాటుకున్నారు. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ తో ఏర్పడిన సాన్నిహిత్యం స్నేహంగా మారి ఇప్పటికీ కొనసాగుతోంది. అదే ఆయనను టీటీడీ బోర్డు మెంబర్ గా జనసేన పార్టీ నుంచి నియమించడానికి అవకాశం కల్పిచింది.
తిరుమల శ్రీవారి సన్నిధిలో తనకు సేవ చేసే భాగ్యం లభించడం పూర్వజన్మ సుకృతం అని ఆనందసాయి ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రకటించారు. తెలంగాణలోని ఆలయాలకు చీఫ్ ఆర్కిటిక్ గా పని చేసిన తన అనుభవాన్ని తిరుమల క్షేత్రంలో కూడా పంచుకుంటానని ఆనందసాయి చెబుతున్నారు. దీనికి టీటీడీ పాలక మండలి చైర్మన్ ఎలా స్పందిస్తారు? అధికారుల సహకారం ఎలా ఉంటుందనేది వేచిచూడాలి.