‘మీరు దువా చేయండి’.. మక్కా నుంచి సందేశం

మక్కాలో ఉమ్రా యాత్రకు వెళ్ళిన మేము దువా (ప్రార్థన) చేశాం. మీరూ జాఫర్ గెలవాలని ప్రార్థనలు చేయండని మక్కా నుంచి కొందరు తెలుగు ముస్లింలు సందేశం పంపారు.

Update: 2024-05-03 10:41 GMT

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: "అల్లా హ్.. మీ బిడ్డలను దీవించు. వారిని నీవే కాపాడు. విజయాన్ని ప్రసాదించు తండ్రి" అని ముస్లిం మైనార్టీల దువా (ప్రార్థన) మక్కా వరకు చేరింది. ముస్లిం ప్రవక్త సందేశం ఇచ్చిన ప్రదేశం సౌదీ అరేబియాలోని మక్కా. పాప ప్రాయశ్చిత్తం, మానవాళి సౌభాగ్యం, రక్షణ, విజయానికి ధైర్యం ప్రసాదించాలని మక్కాలో వుమ్రా చేయడానికి వెళ్లిన అనంతపురం జిల్లాకు చెందిన ముస్లింలు ఆ సందేశాన్ని ఇక్కడికి పంపించారు. ఈ సందేశం ముస్లిం వర్గాల్లో చర్చకు దారితీసింది.

ఇటీవల కాలంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎన్ఆర్‌సి, సీఏఏ, త్రిబుల్ తలాక్, ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లను అమలు చేయబోము అనేది చెబుతున్న మాట. ఈ అంశంపై ముస్లింలలో తీవ్ర సంఘర్షణ జరుగుతోంది. మసీదుర్లో కూడా ప్రార్ధనల అనంతరం "బయాన్" ( సందేశం) ఇస్తున్నారు. "తమ అస్తిత్వానికి దెబ్బ తగలకుండా ఆదరించే ఏ పార్టీకైనా ఓటు వేసుకోండి" ముస్లిం మైనార్టీలకు ఇస్తున్న సూచన అది. ఫలానా పార్టీకి ఓటు వేయమని ఎక్కడా చెప్పిన దాఖలాలు కూడా లేవు. అయితే అంతర్లీనంగా ముస్లిం మైనారిటీల మెదడులో ఏర్పడిన భయం మాత్రం వీడడం లేదు. ఇదిలా ఉంటే... ఈ ఏడాది కూడా..




 

మక్కాయాత్ర..

జీవితకాలంలో ఒకసారైనా మక్కా యాత్ర చేయాలని ప్రతి ముస్లిం ఆశిస్తారు. సంపన్నులు మాత్రమే వెళ్లగలిగిన హజ్ యాత్రకు.. ప్రభుత్వ సహకారం కూడా అందిస్తోంది. హజ్ యాత్ర సాధారణంగా బక్రీద్ సమయంలో వెళతారు. 40 రోజులపాటు అక్కడే ఉండి దైవదూతల సన్నిధిలో నమాజ్ చేస్తారు. ఉమ్రా అనేది 15 రోజులు తీర్థయాత్రగా చెబుతారు. ఇందులో మక్కాలో ఏడు రోజులు, మదీనా ప్రాంతంలో ఏడు రోజులు గడిపే యాత్రికులు దైవ సన్నిధిలో ప్రార్ధనలతో కాలం వెళ్లదీస్తారు. ఇందులో ప్రధానంగా.. ప్రార్థించే వారి పెదవులు.. మానవాళికి సందేశమిచ్చిన ప్రవక్త జన్మించిన స్థలంగా భావించే ఆ ఇంటిలో..

తన జీవితకాలంలో చేసిన తప్పులను క్షమించాలని వేడుకుంటారు. తెలిసో తెలియకో జరిగిన తప్పులను సన్నిధిలో నివేదించుకొని పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారు. ఇకపై ఎలాంటి పాపకార్యాలు చేయకుండా మానవాళి సేవకు జీవితాన్ని పరిమితం చేస్తాం" అని నివేదించుకుంటారు. ఈ యాత్ర ద్వారా పునీతులైన హాజీ యాత్రికులు తిరిగి స్వప్రాంతాలకు చేరుకుంటారు. అలా ప్రార్థనలు చేయడం ద్వారా తమ జీవితాన్ని పునీతం చేసుకోవాలని అనంతపురం జిల్లాకు చెందిన కొందరు ఉమ్రా యాత్రకు వెళ్లారు.




 

మక్కాలో ప్రార్థనలు...

అనంతపురం జిల్లా అర్బన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ భారతదేశంలోని ఇండియా కూటమిలో భాగస్వామి అయిన సిపిఐ అభ్యర్థి షేక్. జాఫర్ పోటీలో ఉన్నారు. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ ఆ జిల్లా నుంచి వెళ్లిన ముస్లింలు మక్కాలో పోస్టర్లు ప్రదర్శిస్తూ, ప్రార్థనలు చేశారు. దీనిని కొందరు సమర్థిస్తుంటే.. ఇంకొందరు ఇలా చేయడం ఏమిటి అనేది చర్చకు దారి తీసింది. దీనిపై అధ్యాపకుడు షేక్ రహంతుల్లా సందేశం వైరల్ అయింది.

"నా ముస్లిం జాతి సోదరులారా.. నా హైందవ, క్రైస్తవ, ఎస్సి, ఎస్టీ దళిత బడుగు బలహీన వర్గాల.. నా దివ్య ఆత్మ స్వరూపుల్లారా.. అనంతపురం జిల్లా అర్బన్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న సిపిఐ అభ్యర్థి జాఫర్ అన్నని గెలిపించాలని పేపర్లు చేత పట్టుకుని దువా చేస్తున్నారు చూడండి. నా ముస్లిం జాతి సోదరులు అనంతపురం జిల్లాలో 70 వేల మంది ఉన్నారు" అని గుర్తు చేస్తూ, షేక్ రహమతుల్లా.. ముస్లిం అభ్యర్థికి మద్దతుగా మాట్లాడారు. ఈ అంశంపై ఆయన ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడుతూ.. "అల్లా ఆదేశం లేనిదే ఈ పని చేయలేం. మక్కాలో వారు పోస్టర్లు ప్రదర్శించి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయాలి అనేది ఆ ప్రవక్త ఆదేశం మేరకే జరిగి ఉంటుంది" అని ప్రైవేటు హిందీ అధ్యాపకుడు ఎస్. రహమతుల్లా వ్యాఖ్యానించారు.


మక్కా సన్నిధిలో..

అనంతపురం జిల్లాకు చెందిన అనేక కుటుంబాలు ఉండ్రా చేయడానికి మక్కా మదీనాకు వెళ్లాయి. అందులో ఓ ఇద్దరు వ్యక్తులు. పవిత్రమైన ప్రవక్త దివ్య సందేశం ఇచ్చిన మక్కా వద్ద అనంతపురం అర్బన్ నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షేక్ జాఫర్ పోస్టర్లను చూపిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వారితోపాటు వారి కుటుంబ సభ్యుల్లోని ఓ మహిళ కూడా ఉన్నారు. వారు అక్కడి నుంచి అందించిన సందేశం..

" కాంగ్రెస్ మద్దతుతో సిపిఐ తరపున పోటీ చేస్తున్న జాఫర్ గెలవాలని మేము ఇక్కడ దువా చేశాం. అనంతపురంలో ఉండే ముస్లింలు కూడా జాఫర్ గెలవాలని దువా చేయండి. ముస్లిం వ్యక్తి గెలిస్తే మనకు మేలు జరుగుతుంది" అనే అభిప్రాయంతో కూడిన సందేశం అక్కడి నుంచి వినిపించారు. కొందరితో మాట్లాడిన తర్వాత తెలిసిన విషయం ఏమిటి అంటే. హజ్, ఉమ్రా యాత్రలు చేసే ముస్లింలు తమ కోసం, మానవాళి కోసం ప్రార్థన చేస్తారు. ఒక వ్యక్తి కోసం మీరు ప్రార్థన చేయండి అని అక్కడి నుంచి సందేశం పంపించిన ఉమ్రా యాత్రికులు తమ నిస్వార్ధతను చాటుకున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తం అయింది. దీనిపై గతంలో ఉమ్రా యాత్ర చేసి వచ్చిన సింగనమల మహమ్మద్ షఫీ.. ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడారు.

" నేను గల్ఫ్ దేశాల్లో ఉపాధికి వెళ్లాను. చాలా ఏళ్లు అక్కడ ఉన్నాను. భగవంతుడు నా మనసులో కలిగించిన ప్రేరణతో.. సౌదీ అరేబియాలోని మక్కాలో ఉమ్రా యాత్రకు వెళ్లి వచ్చా. నేను చేసిన పనులు ప్రవక్తకు నివేదించుకున్నా. నేను నాకోసం, మానవాళి కోసం ప్రార్థించా. ఇప్పుడు కొందరు మనసులో కల్మషం లేకుండా మక్కాలో పోస్టర్ ప్రదర్శించి చేసిన దువా అనేది.. ఆ దైవ నిర్ణయం గానే భావించాలి" అని వ్యాఖ్యానించారు. ‘‘మనిషి తన జీవితంలో ఏ పని చేసినా అది దైవానుసారమే జరుగుతుందనే విషయాన్ని నేను బలంగా నమ్ముతున్నాను’’ అని మహమ్మద్ షఫీ స్పష్టం చేశారు.

మక్కా యాత్ర ముచ్చట..

"మహా ప్రవక్త మహమ్మద్" సల్లల్లాహు అలైహి వసల్లం (స.అ.స) (దీని అర్థం అల్లా ఆయనపై శాంతి, దీవెనలు కురిపించు గాక) 1400 ఏళ్ల కిందట మక్కాలో జన్మించి, మదీనాలో తనువు చాలించారు. కారణజన్ముడైన మహా ప్రవక్త పుట్టినప్పటి నుంచి ఆయన జీవితంలో అన్నీ అద్భుతాలే. ఇస్లాం మతానికే కాకుండా సమస్త మానవాళికి సత్ప్రవర్తనను చూపారు. జీవితంలో అసత్యమాడని ఆయన, పరమ దయా హృదయుడు. మానవతను ఆయుధంగా ధరించిన ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధాలు కూడా చేయాల్సి వచ్చింది. ఇస్లాం కోసం సమస్తం వెచ్చించారు. సాదా సీదాగా జీవించారు. అటువంటి మహనీయుడు జీవించి ఎన్నో ఘనకార్యాలు చేసిన ప్రాంతాలు మక్కా, మదీనా నగరాలు. అందువల్ల వీటికి ఎంతో చారిత్రక ఘనత లభించింది. హజ్, ఉమ్రాల కోసం ఈ నగరాలకు వచ్చిన వారికి చుట్టుపక్కల ప్రాంతాలను చూసే అవకాశం కలుగుతుంది" అని ఓ సీనియర్ జర్నలిస్టు ఎస్.కే. ఫయాజ్ బాషా తన అనుభవాలను పంచుకున్నారు.

Tags:    

Similar News