వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును మళ్ళీ ముంచనున్న శవం డోర్ డెలివరీ కేసు!
90 రోజుల్లో అనుబంధ చార్జిషీట్: ఎస్సీ, ఎస్టీ కోర్టు కీలక ఆదేశం;
By : The Federal
Update: 2025-07-23 08:13 GMT
"డోర్ డెలివరీ హత్య కేసు" మళ్లీ దుమ్మురేపుతోంది. దళితుడైన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను చంపి, మృతదేహాన్ని అతని ఇంటి వద్ద వదిలిన కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ చుట్టూ మరోసారి ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో మిగిలిన పాత్రధారులపై ఆధారాలు లేవన్న ఆరోపణలతో పాటు, ముద్దాయికి లభించిన మద్దతుపై అనేక అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. తాజా పరిణామంగా రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక కోర్టు ఈ హత్యకేసును తిరిగి విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందానికి అనుమతి ఇచ్చింది. కోర్టు 90 రోజుల్లోపు అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో విచారణ తిరిగి వేగం పుంజుకునే అవకాశముంది.
ఈ కేసు తదుపరి విచారణకు రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సింగవరపు ఉమా సునంద ఆదేశాలిచ్చారు. 90 రోజుల్లో అనుబంధ (సప్లిమెంటరీ) చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు.
అనంతబాబు తల్లిదండ్రులు, సోదరుడు
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి పోలీసు అధికారులు సమగ్రంగా దర్యాప్తు చేయకుండా కేవలం ఎమ్మెల్సీ అనంతబాబునే నిందితుడిగా చేర్చారని.. ఇందులో మరింతమంది పాత్ర ఉందనే అనుమానాన్ని సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో విన్నవించారు. సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు.
ఈ మేరకు కూటమి ప్రభుత్వం కేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటుతోపాటు, ప్రాసిక్యూషన్‌కు సహకరించేందుకు ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును నియమించింది. కేసు సమగ్ర దర్యాప్తునకు అనుమతి కోరుతూ ప్రాసిక్యూషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 18న విచారించిన న్యాయస్థానం జూలై 22న తీర్పు ఇచ్చింది.
ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మరోసారి పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు కోర్టును అనుమతి కోరగా, న్యాయమూర్తి 90 రోజుల్లోపు అదనపు చార్జిషీట్‌ను సమర్పించాలని SITను ఆదేశించారు.
డ్రైవర్‌ను హత్య చేసి మృతదేహాన్ని అతని ఇంటికి చేర్చినట్టు ఆరోపణలతో 2022 మే 19న ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌పై కేసు నమోదైంది.
మృతుడి తల్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీకి సమర్పించిన నివేదికలో తన కుమారుడి శరీరంపై 31 గాయాలు, మూడు అంతర్గత గాయాలు ఉన్నాయని తెలిపారు. ఒక్కరే అంతగా హింసించగలరా? అనే అనుమానాన్ని ఆమె వ్యక్తంచేశారు. అలాగే, సెల్ టవర్ డేటా, గూగుల్ రికార్డులు వంటి కీలక సాంకేతిక ఆధారాలు తగిన విధంగా పరిశీలించలేదని ఆమె ఆరోపించారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రాసిక్యూషన్‌కు సహాయం చేయడానికి ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును నియమించింది. ది ఫెడరల్ ప్రతినిధితో మాట్లాడిన సుబ్బారావు, సిట్ న్యాయం చేస్తుందన్న విశ్వాసం వ్యక్తంచేశారు. గత వైసీపీ ప్రభుత్వం అనంత ఉదయ భాస్కర్‌ను రక్షించేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు.
అసలేం జరిగిందీ?
కాకినాడలో 2022 మే 19న వీధి సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. మూడు రోజుల తర్వాత అనుమానాస్పద కేసుగా నమోదు అయింది. అయితే దళిత సంఘాల ఆందోళనతో మర్డర్ కేసు నమోదు చేసి అనంతబాబును అరెస్ట్ చేశారు. తానే ఈ హత్య చేశానని అనంతబాబు పోలీసుల సమక్షంలో అంగీకరించి జైలుకు వెళ్లారు. కింది కోర్టుల్లో బెయిల్ కోసం విఫల యత్నం చేశారు. పోలీసులు సకాలంలో అంటే 15 రోజుల్లోపు చార్జిషీట్ దాఖలు చేయలేదన్న కారణం చూపి సుప్రీంకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ పొందారు. గత రెండేళ్లుగా ఆయన బయటే ఉంటున్నారు.
ఈలోగా ప్రభుత్వం మారింది. టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ కేసును తిరిగి విచారించాలంటూ సుబ్రమణ్యం తల్లిదండ్రులు, న్యాయవాదులు, దళిత సంఘాలు డిమాండ్ చేశాయి.
సుబ్రమణ్యం హత్య జరిగిన సమయంలో ఉన్న పోలీసు అధికారులు కావాలనే కోర్టును తప్పుదోవ పట్టించేలా వ్యవహరించారని, వాళ్లను కూడా విచారించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ హతుని తల్లి నూకాలమ్మ కోరారు. ఈమేరకు కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. హత్య జరిగినప్పుడు.. అంతకుముందు, తరువాత నిందితుడు ఎవరెవరితో ఏం మాట్లాడారు? ఘటనా ప్రదేశంలో ఎవరెవరు ఉన్నారనే అంశాన్ని గూగుల్ టేక్ అవుట్, టవర్ లొకేషన్, సీసీ ఫుటేజీలు, కాల్ డేటా ఆధారంగా గుర్తించి విచారించాల్సి ఉంది.
ఎమ్మెల్సీ గన్‌మెన్‌ను నాడు సమగ్రంగా విచారించలేదనే ఆరోపణలున్నాయి. సుబ్రహ్మణ్యం శరీరంపైన 31, అంతర్గతంగా మరో మూడు బలమైన గాయాలు ఉన్నాయి. ఇవన్నీ చేయడం ఒక్క అనంతబాబు వల్ల సాధ్యమా? మృతదేహాన్ని ఎవరి సహాయం లేకుండా ఒక్కరే కారులో వేశారా? అనే అనుమానాలు ఉన్నట్లు ముప్పాళ్ల సుబ్బారావు పేర్కొన్నారు.
సిట్ అధికారులు సమగ్ర దర్యాప్తు చేసి గత అధికారుల విచారణలోని లోపాలు వెలికితీసి, హత్యలో ఎవరెవరి పాత్ర ఉందో బయటపెట్టాలని కోరారు. ప్రాసిక్యూషన్ తరఫున కె.రాధాకృష్ణరాజు, డి.శ్రీవాణీభాయ్ వాదనలు వినిపించారు. ఎమ్మెల్సీతోపాటు ఇతర పాత్రధారుల ప్రమేయం కూడా త్వరలో బయటపడనుందని ఈ సందర్భంగా ముప్పాళ్ల సుబ్బారావు స్పష్టం చేశారు.
అనంతబాబు (ఎడమ) సుబ్రమణ్యం (ఎడమ)
సుబ్బారావు చెప్పిన దాని ప్రకారం హత్య జరిగిన 2022 మే 19 తర్వాత కేసు నమోదు చేయడంలో జాప్యం జరిగింది. చార్జిషీట్ ను సకాలంలో దాఖలు చేయలేదు.
'ఎఫ్ఐఆర్ నమోదు చేసే సమయంలో ఆయన కులాన్ని కూడా తప్పుగా చూపారు. kapu/kondakapu గా రాశారు. ఇదంతా కేసును తప్పుదోవ పట్టించేందుకే ఇలా రాశారు. కాల్ డేటా రికార్డ్స్ సరిగా లేవు. వీడియో ఫుటేజీని అరకొరగా సమర్పించారు. టెక్నికల్, శాస్త్రీయ విచారణ జరగలేదు. అందువల్ల అదనపు చార్జిషీట్ దాఖలు చేసేలా తదుపరి విచారణ కొనసాగించాలి. ముద్దాయికి నేర చరిత్ర ఉంది. గతంలో అనంతబాబుపై 11 కేసులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి రౌడీషీట్. కానీ వైసీపీ ప్రభుత్వం ఆ కేసుల్ని ఉపసంహరింపజేసింది. సుబ్రమణ్యం హత్య జరిగిన రోజు ఇచ్చిన శవపంచాయితీ రిపోర్టుకి పోలీసులు చెప్పిన దానికి పొంతన లేదు. పోలీసులు కావాలనే కేసును పక్కదోవ పట్టించారు. ముద్దాయికి అనుకూలంగా వ్యవహరించేందుకే చార్జిషీట్ ను 28రోజుల తర్వాత కోర్టుకు సమర్పించారు. ముద్దాయికి ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ గన్ మెన్ ను విచారించలేదు. ఈ కేసులో పోలీసు అధికారులైన రవీంద్రబాబు, మురళీ కృష్ణారెడ్డి లాంటి వాళ్లను తిరిగి విచారించాలి అని సుబ్రమణ్యం తల్లి నూకాలమ్మ కోరారు. ఎస్సీ, ఎస్టీ కోర్టు అందుకు అనుమతి ఇచ్చింది. ప్రత్యేక సిట్ ఏర్పాటు కు ఆదేశాలు ఇచ్చింది. అందువల్ల కేసు తదుపరి విచారణకు వస్తుంది. అందుకు నేను పూర్తిగా సహకరిస్తాను. దోషులైన వారికి శిక్ష పడేలా చూస్తాం. ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం సెక్షన్-4 ప్రకారం ముద్దాయిని కాపాడేందుకు ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది' అన్నారు ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు.
డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు– టైమ్‌లైన్
2022 మే 19 కాకినాడలో దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య. మృతదేహాన్ని అతని ఇంటి వద్ద వదిలివెళ్లిన అనంతబాబు.
2022 మే 22 కేసు అనుమానాస్పద మృతిగా నమోదు. దళిత సంఘాల నిరసనలతో హత్యగా మారింది.
2022 మే 23 ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అరెస్ట్; పోలీసుల ముందు హత్యను అంగీకరించి జైలుకు తరలింపు.
2022 జూన్–జూలై కింది కోర్టుల్లో బెయిల్ అభ్యర్థనలు విఫలమయ్యాయి.
2022 ఆగస్టు పోలీసులు సకాలంలో చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో, సుప్రీంకోర్టులో ముద్దాయికి మధ్యంతర బెయిల్ మంజూరు. అనంతబాబు బెయిల్‌పై బయటకు.
2023–2024 దళిత సంఘాలు, మృతుడి తల్లిదండ్రులు కేసు పునర్విచారణకు డిమాండ్. కేసులో లోపాలపై పలు విన్నపాలు.
2024 డిసెంబర్ వైసీపీ ప్రభుత్వ పరిపాలన ముగింపు. టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రాక.
2025 జూన్–జూలై కూటమి ప్రభుత్వం SIT నియామకం. న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ప్రాసిక్యూషన్ తరపున నియామకం.
2025 జూలై 18 కోర్టులో విచారణ – SIT దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు.
2025 జూలై 22 రాజమహేంద్రవరం ఎస్సీ/ఎస్టీ కోర్టు కీలక తీర్పు: 90 రోజుల్లో అనుబంధ చార్జిషీట్ దాఖలుకు అనుమతి, కొత్త దర్యాప్తుకి గ్రీన్ సిగ్నల్.