చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి వివిధ వర్గాల ప్రజలకు 176 వాగ్దానాలు చేసింది. మొత్తం ప్రజలందరికీ సంబంధించిన వాగ్దానాలు అందులో రెండు ఉన్నాయి. విద్యుత్ బిల్లుల భారాల తగ్గింపు ఒకటి కాగా, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడం రెండవది. పై హామీలను అమలు చేయడంలో చంద్రబాబు సర్కారు ఘోరంగా విఫల మైంది. పైగా విద్యుత్ చార్జీలను తగ్గించకపోగా, 2023-2024 ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో 9,412 కోట్ల రూపాయల భారాలను రాష్ట్ర ప్రజలపై వేసింది. ఇందులో ముందుగానే యూనిట్ కి 40 పైసలు చొప్పున ఎలాంటి అనుమతులు లేకుండా ట్రూ అప్ చార్జీలతో పాటు 2023-2024 రన్నింగ్ ఇయర్ లోనే అదనంగా వసూలు చేశారు. అలా వసూలు చేసిన 2869 కోట్ల రూపాయిలు పోనూ మిగిలిన 6543 కోట్ల రూపాయిలను ట్రూ అప్ చార్జీలుగా ఇప్పుడు వసూలు చేస్తున్నారు.
టిడిపి ప్రభుత్వ బందిపోటు దోపిడి ఇక్కడితో ఆగలేదు. స్మార్ట్ మీటర్ల పేరుతో మరో దోపిడీ తెరమీదకు తెచ్చి ప్రజలపై వేల కోట్ల రూపాయలు భారాలను వేస్తున్నది. స్మార్ట్ మీటర్లు కేవలం ఆర్థిక భారానికి సంబంధించినది మాత్రమే కాదు. అది మన గృహ విద్యుత్ వినియోగాన్ని సుదూర ప్రాంతం నుండి కంట్రోల్ చేయగలిగే ఒక పరికరం. ఇది అన్ని రకాలుగా ప్రజలకు నష్టదాయకం. అందుకే ఈ స్మార్ట్ మీటర్ల భూతాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ప్రజలందరికీ ఉంది.
టీడీపీ అధికారానికి రాకముందు ట్రూ అఫ్ చార్జీలను వ్యతిరేకిం చడమే కాకుండా రైతుల పొలాల్లోని విద్యుత్ మీటర్ల స్థానంలో స్మార్ట్ మీటర్ల బిగింపును టీడీపీ, జనసేన పార్టీలు వామపక్ష పార్టీలను మించి తీవ్రంగా వ్యతిరేకించాయి. నేటి విద్యాశాఖా మంత్రి లోకేష్ ఆనాడు స్మార్ట్ మీటర్లను పగుల కొట్టాలని, తెలుగుదేశం మీకు అండగా వుంటుందని పిలుపునిచ్చాడు. కానీ టీడీపీ కూటమి అధికారానికి వచ్చాక ఈ విషయంలో వైసీపీ అడుగుజాడల్లోనే నడుస్తున్నది. అంతకు మించిన విద్యుత్ భారాలను వేస్తున్నది. తాము పగుల కొట్టాలన్న విద్యుత్ స్మార్ట్ మీటర్లను ఇప్పుడు పొలాలతో పాటు షాపులకు, ఇళ్లకు బిగించేందుకు వారే సిద్దమై, ఓట్లేసిన ప్రజలను పచ్చి మోసం, ధగా చేస్తున్నారు. నగ్నంగా రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ఈ నయవంచనను వ్యతిరేకించాలి.
ట్రూ అప్ చార్జీల చార్జీల గూర్చి...
ట్రూ ఆఫ్ అంటే అంచనాకు వచ్చిన గత కాలపు అదనపు చార్జీలను రెగ్యులేటరి కమీషనర్ విచారణ జరపకూండానే యధాతధంగా వసూళ్లు చేసుకోవడానికి డిస్కంలకు అవకాశం ఇచ్చే విధానం. వినియోగ దారులు లోగడ వినియోగించుకున్న విద్యుత్ కు చెల్లించిన బిల్లుకు, నాడు విద్యుత్ ఉత్పత్తికి అయిన ఖర్చుకు తేడా లెక్కలు చూసి, ఉత్పత్తి ఖర్చు ఎక్కువగా ఉన్నాయంటూ ప్రభుత్వ సబ్సిడీగా ఉండే ఆ మొత్తాన్ని ఇప్పుడు జనం నుండి వసూలు చేస్తున్నారు. 2022-23 మధ్య కాలంలో అదనంగా అయిన ఇంధన, విద్యుత్ ఖర్చులపై విచారణ జరిపి 25-10-24న 15 నెలలో వసూళ్లు చేసుకోవడానికి డిస్కం లకు అధికారం ఇస్తూ రెగ్యులేటరి కమీషన్ తీర్పు ఇచ్చింది. 2023-24 అయిన అదనపు ఖర్చు పై కమీషన్ విచారణ జరిపి 29-11-24న తీర్పు చెప్పింది. ఈభారం 24నెలల కాలంలో డిస్కం లు వసూళ్లు చేసుకోనే అవకాశం ఇచ్చారు.
2024-2025 ఆర్ధిక సంవత్సరంలో ఈస్ట్ డిస్కమ్ 1226 కోట్ల రూపాయిల చార్జీలు తగ్గించాలని రెగ్యులేటరీ కమీషన్ కి తెలియజేయగా మిగిలిన సౌత్ మరియు సెంట్రల్ డిస్కమ్ లు 842 కోట్ల రూపాయిలు ట్రూ అప్ చార్జీలు వసూలుకు ప్రతిపాదించాయి. ఈ మూడు సంస్థలు 2023-24లో వసూలు చేసినట్లు ఇప్పటికే 2024-25 ఆర్థిక సంవత్స రంలో యూనిట్ కి 40 పైసలు చొప్పున 2787.19 కోట్ల రూపాయిలు అదనంగా వసూలు చేసాయి. నిజానికి మూడు డిస్కమ్ లకు కొంచెం అటు ఇటుగా ఒకే రీతిన రావలసిన లాభ, నష్టాలు ఒక దానికి భారీ మిగులు, మరో రెండింటికి భారీ లోటు ఎలా వచ్చాయి? ట్రూ అప్ చార్జీల పట్ల ప్రజల నుండి రియాక్షన్ వస్తుంటే రివర్స్ లో ట్రూ డౌన్ చార్జీలు ఉన్నాయని నమ్మించడానికి వేసే ఎరలు ఈ అంకెల గారడీలు. స్మార్ట్ మీటర్ల బిగింపు సమయంలో ప్రజల నుండి వ్యతిరేకత రాకుండా ప్రభుత్వం వేసిన గాలం ఇది. ఇది ఒక నిరంతర ప్రక్రియ.
ప్రతి ఏడాది ఈ వ్యత్యాసాలను లెక్కిస్తూ ఆ భారాలను మనపై వేస్తూనే ఉంటారు. ఇలా ఇప్పటికి నాలుగు మోత బరువులు విద్యుత్ వినియోగదారులు మోస్తున్నారు. వీటి మొత్తం ఒక్కో యూనిట్ కి కలిపి రూ. 1.50 పైసలు వరకు ఉన్నది. అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్లుగా వాస్తవ వినియోగపు బిల్లుతో సమానంగా ఈ ట్రూఅప్, ఇందన సర్దుబాటు చార్జీలు ఉంటున్నాయి. విద్యుత్ ఉత్పత్తి లేదా బొగ్గు కొనుగోలు వ్యత్యాసాలతో పాటు విద్యుత్ వాహక ఖర్చులను కూడా ట్రూ అప్ చార్జీల కేటగిరిలో వేస్తున్నారు.
ఒకప్పుడు ఈ వ్యత్యాసాలను ప్రభుత్వం సబ్సిడీగా భరించేది. అమెరికా, ప్రపంచం బ్యాంకు అప్పుల కోసం, నేడు కేంద్రంలోని బిజెపి పాలకుల మెప్పు కోసం సబ్సిడీలను తొలగించి వాటి భారాలను ప్రజలపై వేస్తున్నారు. నాటి ప్రపంచం బ్యాంకు విధానాలే నేడు మోదీ ప్రభుత్వ విద్యుత్ సంస్కరణ లుగా రాష్ట్రాలపై రుద్దుతున్నారు. అంతే కాకుండా విద్యుత్ ఉత్పత్తి ఖర్చులను విపరీతంగా పెంచేసి, విదేశీ బొగ్గును, సోలార్ విద్యుత్ ను అధిక ధరలకు కొంటూ అదాని వంటి కార్పొరేట్లకు లాభాలు అందిస్తున్నారు. సెకీ ద్వారా అదానీ విద్యుత్ ఒక యూనిట్ రూ.2.49 పైసలకు జరిగిన కొనుగోలు ఒప్పందంలో 1700 కోట్ల రూపాయిలు ముడుపులు జగన్ కి అందాయని అమెరికా కోర్టుల ద్వారా వెల్లడి చేశారు. ఆనాడు సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని వామపక్ష పార్టీలు ఆందోళనలు చేసాయి. టీడీపీ పార్టీ మరింత ముందుకు వెళ్లి కోర్టులో కేసు కూడా వేశారు. అదే గుజరాత్ కంపెనీ గుజరాత్ ప్రభుత్వానికి యూనిటికి రూ.1.99 పైసలకు విద్యుత్ అమ్మిందని చెప్పారు.
సోలార్ విద్యుత్ ఉత్పత్తి పెరిగి నందున ఇంకా తక్కువకు వస్తుందని అన్నారు. సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలన్నారు. కానీ అధికారానికి వచ్చాక సెకీ ఒప్పందం రద్దు మాట అంటుంచి ఒక యూనిట్ కి రూ.4.60 పైసలకు అంటే డబుల్ రేటుకు చంద్రబాబు ఆక్సిస్ కంపెనీతో విద్యుత్ ఒప్పందం చేసుకున్నాడు. 2.49 రూపాయిల దగ్గర 1700 కోట్ల ముడుపులు జగన్ కి అందితే, 4.60 రూపాయిల వద్ద చంద్రబాబుకు కనీసం 6000 కోట్ల ముడుపులు ముట్టి ఉండాలి. ముడుపులకు కక్కుర్తి పడి ఇలా ఒప్పందలు చేస్తూ ఆ భారాలను మనపై వేస్తున్నారు. విద్యుత్ వినియోగ దారులపై పడే భారాలు ఇవి మాత్రమే కావు. రాష్ట్రంలో రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్ ఖర్చు సాలీనా 5000 కోట్ల రూపాయిలను కూడా ట్రూ అప్ చార్జీలలో కలిపి ప్రజల నుండి వసూలు చేస్తున్నది. అంతే కాదు 0.6 పైసలుగా గా ఉన్న విద్యుత్ టాక్స్ ను రూ. 1.00 కి పెంచారు.
స్మార్ట్ మీటర్ల సంగతి చూస్తే...
విద్యుత్ మీటర్లలో దశాబ్దాల కాలంలో అనేక మార్పులు జరిగాయి. గతంలో కూడా మీటర్లు మార్చారు. ఆనాడు లేని వ్యతిరేకత ఈనాడు వస్తున్నదంటే అందుకు సరైన కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు సాంప్రదాయక ఎనర్జీ లేక ఎలక్ట్రా మెకానికల్ డైవజ్ మీటర్లు ఉండేవి. వాటి స్థానంలో పది, పదిహేనేళ్ల క్రితం ఎలక్ట్రానిక్ డిజిటల్ మీటర్లను బిగించారు. విద్యుత్ బిల్లులలో డిస్మల్ పాయింట్ తో సహా లెక్కించే మీటర్లు అవి. వాడుకున్న కరెంటును పూర్తిగా లెక్కించి ఖచ్చితమైన బిల్లులు వచ్చే విధంగా అవి తయారు చేయబడ్డాయి. అలాంటి ఆధునిక మీటర్ల స్థానంలో ఇప్పుడు స్మార్ట్ మీటర్ల అవసరం ఏముంది? ఇప్పుడు ఉన్నవి కూడా ఎలక్ట్రానిక్ మీటర్లే కదా! అయినా ఎందుకు మారుస్తున్నారు? వీటి వల్ల ఎవరికి ఉపయోగం? ఎవరికి లాభం? ఎవరికి నష్టం? పరిశీలించాలి.
యూనిట్ల లెక్కింపులో ఖచ్చితత్వంతో ఉండే ఎలక్ట్రానిక్ డిజిటల్ మీటర్లను అదే ఖచ్చితత్వం కోసమే అయితే ఎందుకు మార్చాలి? అంటే స్మార్ట్ మీటర్లలో ఖచ్చితత్వం కాకుండా ఇంకేదో దాగి ఉంది. అదేమిటి? ఇప్పటికి ఉన్న ఎలక్ట్రానిక్ మీటర్లను సిబ్బంది నెలకు ఒకసారి వచ్చి రీడింగ్ తీసుకోవాలి. అదాని స్మార్ట్ మీటర్లు అయితే రీడింగ్ సిబ్బందితో పని ఉండదు అంటున్నారు. అందుకోసం 13వేల కోట్ల రూపాయిల భారాన్ని ప్రజలపై వేయడం న్యాయమా? ఒక్కో మీటర్ కి 9 వేల నుండి 18 వేల రూపాయిల భారలు ప్రజలపై వేయడం తగునా?
కాల పరిమితి లేకుండా సేవలు అందిస్తున్న ఎలక్ట్రానిక్ డిజిటల్ మీటర్లను కాదని, 8 ఏండ్లకు మార్చాల్సిన స్మార్ట్ మీటర్లను వాటి నిర్వహణకు కూడా పూర్తిగా అదానిపై ఆధారపడి ఉండే అవసరం ఏమొచ్చింది? అంటే ఇది ప్రైవేటీకరణలో భాగమే కదా.
మన ఇంటిలో మీటర్లను అదాని ఆఫీసు నుండి కంట్రోల్ చేసే హక్కును ఇవ్వడానికా చంద్రబాబుకు ప్రజలు అధికారాన్ని ఇచ్చింది.విద్యుత్ వియోగం అధికంగా జరుతున్న వేళలను గుర్తించి పీక్ స్టేజ్ లలో అదనపు రేటు వసూలు చేయడానికి స్మార్ట్ మీటర్లు ఒక సాధనం కాదా!
ఇప్పటి వరకు విద్యుత్ వినియోగం నెల వాడకం తర్వాత మరో 18 రోజులు బిల్లు కట్టేందుకు గడువు ఉంటుంది. అప్పటికి కట్టకపోతే పెనాల్టీతో కట్టుకునే రైట్ ఉంది. ఈ స్మార్ట్ మీటర్లలో అలాంటి అవకాశం ఉండదు. వాటిలో సిమ్ కార్డ్ వంటి చిప్ ద్వారా ఇకపై ముందే డబ్బులు చెల్లించి రీఛార్జ్ చేయించుకోవాలి. ఎప్పుడు డబ్బులు అయిపోతే ఆ క్షణం కరెంటు ఆగిపోతుంది. అదాని ప్రైవేటు సంస్థ వీటిని నియంత్రిస్తుంది. ప్రజల జుట్టును అదాని చేతిలో పెట్టాడం కాదా ఇది?
విద్యుత్ సబ్ స్టేషన్లు మనవి. నగరాల నుండి గ్రామాల వరకువిద్యుత్ లైన్లు, స్థంభాలు మనవి. లక్షలాదిగా ఉన్న ట్రాన్స్ ఫార్మ్లు మనవి. వీటిపై ఇప్పుడు ఆదానికి ఉచితంగా హక్కు ఇవ్వడం చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చేసే మోసం కాదా?
స్మార్ట్ మీటర్ల ఖర్చు, వాటి నిర్వహణ ఖర్చు 93 వాయిదాలలో యూనిట్ ఒకటికి మరో రూ.1.30 పైసలు చొప్పున వినియోగదార్ల నుండి డిస్కమ్ లు వసూలు చేస్తాయి. అప్పటికి స్మార్ట్ మీటర్ల కాల పరిమితి కూడా ముగుస్తుంది. మరలా కొత్త స్మార్ట్ మీటర్లు బిగిస్తారు. జనం నెత్తిన ఈ స్మార్ట్ మీటర్లు బాస్మసుర హస్తం లాంటివి. ఇలా వాస్తవ వినియోగదారు చార్జీలతోపాటు నాలుగు రకాల ట్రూ అప్ చార్జీలు, పీక్ చార్జీలు, స్మార్ట్ మీటర్ల ఖరీదు, స్మార్ట్ మీటర్ల మైంటెనెన్స్ ఖర్చు అన్ని వినియోగదారులే భరించాలి. ఇదే కదా ప్రభుత్వ ఉద్దేశ్యం.
స్మార్ట్ మీటర్ల ఖరీదుతో పాటు వాటి మెయింటెనెన్స్ చేయడానికి అయ్యే ఖర్చు ప్రజలు ఎందుకు భరించాలి? స్మార్ట్ మీటర్ల ద్వారా మన ఇళ్లల్లోకి చొరబడటానికి అదాని వంటి కార్పొరేట్లకు అధికారం ఎలా ఇస్తారు? ఈ స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ చార్జీల బాదుడు వలన వంద రూపాయిల కరెంటు బిల్లుకు మరో రెండు వందలు అదనపు భారం మనపై వేయబోతున్నారు.
1991 నుండి అమలులోకి వచ్చిన నూతన ఆర్ధిక, పారిశ్రామిక విధానాలలో భాగంగా నాటి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర విద్యుత్ సంస్థను ప్రైవేటు పరం చేయడానికి చేసిన ప్రయత్నాలు సాగక విద్యుత్ బోర్డును ముక్కలు చేసాడు. విద్యుత్ ఉత్పత్తిని ఏపీ జెన్కో క్రింద విద్యుత్ పంపిణీని మూడు డిస్కౌమ్ ల క్రింద విడతీసారు. విద్యుత్ టారీఫ్ లతో ప్రభుత్వానికి సంబంధం లేదన్నట్లు అవి ఆయా సంస్థల బాధ్యత అన్నట్లు మార్చివేశారు. డిస్కమ్ లు కోరే రేట్లను పరిశీలించి నిర్ణయించేందుకు ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పేరుతో మరో సంస్థను పెట్టారు. ఈ సంస్థ న్యాయ మైనది అన్నట్లు డిస్కమ్ ల ప్రతిపాదనలు, ప్రజల అభ్యంతరాలను పరిశీలించి విద్యుత్ టారీఫ్ లు నిర్ణస్తుంది అంటారు. నిజానికి ఇదొక ప్రహాసనం. ఏనాడూ ఈ కమిటీ ప్రజల అభ్యంతరాలను లెక్కలోకి తీసుకొలేదు. నిజానికి ఈ రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు ప్రజలను వంచించిండానికే అన్నది యదార్ధం. ఇది పాలకుల కనుసన్నలలోన నడుస్తుందనేది జగమెరిగిన సత్యం.
ప్రజలకు సంక్షేమం అందించడం ప్రభుత్వ బాధ్యత కాదని, కార్పొరేట్ల సంక్షేమమే పాలకుల బాధ్యత అని ప్రపంచ బ్యాంకు చెప్పిన మాటలు చంద్రబాబుకి చాలా ఇష్టం. అవే విధానాలను వయా మోదీ సంస్కరణలుగా చంద్రబాబు నేడు అమలు చేస్తున్నాడు. అందుకే స్మార్ట్ మీటర్లు వద్దని నినదిద్దాం. బిగించిన స్మార్ట్ మీటర్లను తొలగించాలని ఆందోళనలు చేద్దాం. అన్ని రకాల ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని ఉద్యమిద్దాం. ఇప్పటి వరకు వసూలు చేసిన అన్ని రకాల ట్రూ అప్ చార్జీలను ప్రజలకు వెనక్కి తిరిగి ఇవ్వాలనీ, సెకీ తో సహా యూనిట్ కి 2 రూపాయిలకు మించి ఉన్న అన్ని ఒప్పందాలను రద్దు చేయాలనీ, విద్యుత్ సంస్కరణల పేరుతో చేసిన చట్ట సవరణాలను వాపస్ తీసుకోవాలనీ, ప్రభుత్వ రంగంలోని జెన్ కో ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచాలని, ప్రైవేట్ విద్యుత్ సంస్థలకు వేలాది ఎకరాలు కట్ట బెట్టెందుకు సాగిస్తున్న భూసేకరణలను ఆపివేయాలని అన్ని వర్గాల ప్రజల ఆందోళనకు సిద్ధం కావాలి. పెరుగుతున్న విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా బషీర్ బాగ్ విద్యుత్ ఉద్యమానికి సిద్ధం అవుదాం.
-పి.ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు,
(సి.పి.ఐ (ఎం.ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధులు)