సీఎంపై దాడి కేసులో రాళ్ల కోసం పోలీసుల వెతుకులాట!

ముఖ్యమంత్రి జగన్ పై రాయితో దాడి జరిగి మూడ్రోజులైనా ఇంతవరకు నిందితుణ్ణి గుర్తించలేకపోయారు. పైగాస్పాట్ లో ఏదైనా రాళ్లు దొరుకుతాయోమోనని వెతుకుతున్నారట

Update: 2024-04-16 03:41 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై దాడి జరిగి మూడు రోజులైనా ఇంతవరకు పోలీసులు ఒక్క సరైన ఆధారాన్నీ రాబట్టలేకపోయారు. వంద మందికి పైగా విచారించినా ఒక్క క్లూ కూడా దొరకలేదు. దీంతో నిందితుని ఆచూకీ తెలిసిన వారికి రెండు లక్షల రూపాయల నజరానా ఇస్తామని ప్రకటించారు. మరోపక్క పోలీసులు.. దాడి జరిగిన ప్రాంతంలో నిందితుల వేట సాగిస్తూనే రాళ్ల కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతి రాణా విచిత్ర వాదనను తెరపైకి తెచ్చారు. పోలీసులూ మనుషులే కదా, అంతమందిలో రాయి వేసిందెవరో తెలుసుకోవడం చాలా కష్టం కాదా? అని ప్రశ్నిస్తున్నారు. తన చేతిలో మందీ మార్బలం, అధికారం, నిఘా వ్యవస్థలు, సీసీ కెమెరాలు, పటిష్ట భద్రతా వ్యవస్థ, చీమచిటుక్కుమన్నా సమాచారం ఇచ్చే సిబ్బంది ఉన్న విషయం మరచి ఈ మాట చెబుతున్నారా? లేక మరేదైనా దాస్తున్నారా? అని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి.

పోలీసు కమిషనర్‌ వాదన ఇదీ...
‘చిమ్మ చీకటిలో సీఎంపై రాయితో దాడి జరిగింది. ఆ సమయంలో సుమారు 5 వేల మంది జనం ఉన్నారు. అంతా చీకటి. అంత మందిలో ఒకర్ని గుర్తించి పట్టుకోవడమంటే మాటలా? అంత తేలిక కాదు గాని నూటికి నూరు శాతం పట్టుకుంటాం’ అంటున్నారు విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా. ‘ముఖ్యమంత్రి రోడ్‌షో సాగిన మార్గంలో భద్రతా వైఫల్యమేమీ లేదు. దాదాపు 1,480 మంది పోలీసులను మోహరించాం. సీఎం పర్యటన సాగిన దారంతా రద్దీగా ఉండే ప్రాంతాలే. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నాం. వీడియోలు చూస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివేకానంద పాఠశాల, రామాలయం మధ్య ఖాళీగా ఉన్న ప్రాంతం నుంచి గుర్తు తెలియని వ్యక్తి రాయి బలంగా విసిరినట్లు గుర్తించాం’ అన్నారు కాంతిరాణా.
మరి ఈ మూడు రోజులు ఏం చేశారంటే...
‘ సీఎంపై పడిన రాయి కోసం క్లూస్‌ టీం వెతికింది. ఘటనా స్థలంలో కొన్ని రాళ్లు దొరికాయి. ఏ రాయితో దాడి చేశారన్నది నిందితుడు దొరికితేనే తెలుస్తుంది’ అంటున్నారు కాంతిరాణా.
నిందితులు ఎవరో తెలియకుండా హత్యాయత్నం సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. మరి ఇలా ఎందుకు చేశారనేదానికి కాంతిరాణా సమాధానం ‘ఐపీసీ 307 సెక్షన్‌ కింద కేసు పెట్టాం. మాజీ మంత్రి వెలంపల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం అన్నారు రాణా ఘటన తీవ్రత ఆధారంగా వ్యవహరించామన్నారు. నందిగామలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాయి విసిరిన ఘటన విషయంలో చిన్న సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ‘అప్పుడు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. సీసీ కెమెరా దృశ్యాలు లేవు. టీడీపీ నేతలకు నోటీసులిచ్చి రమ్మన్నా రాలేదు. చివరకు మా సిబ్బంది వెళ్లి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు’ అన్నారు సీపీ కాంతిరాణా.
నిందితుడి ఆచూకీ చెప్తే రూ.2 లక్షలు
ముఖ్యమంత్రి జగన్‌ పై రాయి విసిరిన వ్యక్తి ఆచూకీ చెబితే రూ.2 లక్షలు ఇస్తామంటూ రాష్ట్ర పోలీసు శాఖ ప్రకటించింది. సమాచారం చెప్పడం, వీడియో దృశ్యాలు పంపడమో, ప్రత్యక్ష సాక్షులు ఎవరైనా వచ్చి సమాచారం ఇవ్వొచ్చని తెలిపింది. రూరల్‌ డీసీపీ కె.శ్రీనివాసరావు (94406 19342), టాస్క్‌ఫోర్స్‌ ఏడీసీపీ శ్రీహరిబాబు (94406 27089)లకు ఫోన్‌ చేసి చెప్పవచ్చు.
ఇప్పటి వరకు ఏమి జరిగిందంటే...
ముఖ్యమంత్రిపై రాయితో దాడి చేసి 72 గంటలు దాటింది. ఇంకా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. విచారణకు 8 బృందాలు ఏర్పాటయ్యాయి. వందమందిని విచారించారు. అయినా ఇప్పటి వరకు ఒక్క ఆధారం దొరకలేదు. ఆ దార్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. రోడ్‌షోకు వచ్చినవారు చిత్రీకరించిన వీడియోలనూ చూశారు. సీఎంపై రాయి పడిన సమయంలో జగన్‌ కాన్వాయ్‌ డాబా కొట్ల రోడ్డులోని వివేకానంద పాఠశాల వద్దకు చేరింది. ఆ పాఠశాల వైపు నుంచే అరచేతిలో పట్టేంత రాయి వచ్చిందని.. తొలుత సీఎంకు, తర్వాత మాజీ మంత్రి వెలంపల్లికి తగిలిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ సమయంలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో రాయి ఎవరు వేశారనేది తెలియడం లేదు. చీమ చిటుక్కుమన్నా చివరకు పడక గదుల్లోకి దూరి చిత్రీకరించే సోషల్‌ మీడియాలో పెట్టే వీడియోలు ఒక్కటంటే ఒక్కటి కూడా బయటకు రాకపోవడం విచిత్రమేనంటున్నారు విపక్షాల నాయకులు.
Tags:    

Similar News