కిర్గిస్థాన్‌లో ఆంధ్ర విద్యార్థుల పరిస్థితి ఇలా..
కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై వారం రోజులుగా దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఆంధ్ర విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటే..
కిర్గిస్థాన్ దేశంలో కొన్ని రోజులుగా విదేశీ విద్యార్థులపై విచక్షణారహితంగా దాడులు జరుగుతున్నాయి. దీంతో అక్కడున్న భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్ సహా పలు ఇతర దేశాల విద్యార్థులు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. రోజుల పాటు హాస్టల్ గదులకే పరిమితం అయ్యారు. బయలు వెళ్లాలంటే గుండెల్లో గుబులు పుడుతోంది. ఈ నేపథ్యంలోనే కిర్గిస్థాన్‌లో ఉన్న విద్యార్థులకు భద్రత కల్పించాలని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను కోరుతున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 2000 మంది విద్యార్థులు కిర్గిస్థాన్‌లో విద్యాభ్యాసం చేస్తున్నారని, వారికి భధ్రత కల్పించడానికి విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు కోరారు.
హామీ ఇచ్చిన జైశంకర్
కిర్గిస్థాన్‌లో విద్యాభ్యాసం చేస్తున్న ఆంధ్ర విద్యార్థులకు భద్రత కల్పించడంతో జోక్యం చేసుకోవాలని జైశంకర్‌ను జీవీఎన్ నరసింహరావు కోరారు. ‘‘కిర్గిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు, విదేశా విద్యార్థులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ వారి భద్రతపై వారి కుటుంబీకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వారికి ధైర్యం రావాలంటే మీరు వెంటనే చర్యలు తీసుకోవాలి. అక్కడి భారత విద్యార్థుల భద్రతపై కిర్గిస్థాన్ ప్రభుత్వంతో చర్చలు చేయాలి’’అని నరసింహారావు కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జైశంకర్ తప్పుకుండా చర్యలు తీసుకుంటామని, ప్రస్తుతం అదే పనిలో ఉన్నామని, ప్రతి భారతీయుడికి భద్రత కల్పించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు.
అక్కడి విద్యార్థుల పరిస్థితి
ఈ అల్లర్ల మధ్య కిర్గిస్థాన్‌లో ఉన్న విద్యార్థులు వారం రోజులుగా నిద్రాహారాలు లేకుండా హాస్టల్ గదులకే అంకితమై బతుకుతున్నారు. విదేశీ విద్యార్థులున్న విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, కాంప్లెక్స్‌లపైన అక్కడి స్థానికులు విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నారు. దాంతో సాయంత్రం ఆరు గంటలు కాగానే ఆఖరికి ఉంటున్న గదుల్లో లైట్లు కూడా ఆన్ చేసుకోలేని పరిస్థితి నెలకొని ఉంది.
సద్దుమణిగిన హింసాకాండ
కొన్నిరోజులుగా కిర్గిస్థాన్‌లో చెలరేగుతున్న హింసాకాండ జ్వాలలు సద్దుమణిగాయి. అక్కడి పరిస్థితుల ప్రస్తుతం అదుపులోనే ఉన్నాయని అక్కడి భద్రతా బలగాలు కూడా వెల్లడించాయి. విదేశీ విద్యార్థులను స్వదేశాలకు పంపడానికి ఏర్పాటు చేస్తున్నామని, స్వదేశానికి వెళ్లాలని అనుకునే విద్యార్థులు తమ పేర్లను నమోదు చేయించుకోవాలని యూనివర్సిటీలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు విద్యార్థులు మాట్లాడుతూ.. ‘‘కిర్గిస్థాన్ నుంచి నేరుగా ఢిల్లీకి ఫ్లైట్ ఉంది. అందులో ఢిల్లీకి చేరుకుని అక్కడ నుంచి స్వస్థలాలకు డొమెస్టిక్ ఫ్లైట్స్‌లో చేరుకుంటాం’’ అని తెలిపారు.
క్షమాపణలు చెప్పిన కిర్గిస్థాన్ ప్రజలు
విదేశీ విద్యార్థులపై తాము దాడులు చేయడం తప్పని, అందుకు పశ్చాత్తాపం పడుతున్నామంటూ కిర్గిస్థాన్ ప్రజలు క్షమాపణలు చెప్తున్నారు. ‘‘కొంతమంది ఆకతాయిలు చేసిన పని వల్ల మా దేశానికి చెడ్డ పేరు వచ్చింది. వారి తరపున, మా దేశం తరపున మేము క్షమాపణలు కోరుతున్నాం. విదేశాల నుంచి వచ్చి ఇచ్చడ చదువుకుంటున్న మిమ్మల్ని అకారణంగా అత్యంత దారుణంగా హింసించడం చాలా బాధగా ఉంది’’ అని వారు క్షమాపణలు కోరుతున్నారు. ఇందులో కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి చేతులు దులుపుకుంటుంటే మరికొందరు మాత్రం నేరుగా విద్యార్థుల వద్దకు వెళ్లి క్షమాపణలు కోరుతున్నారు. అంతేకాకుండా విదేశా విద్యార్థులకు ఆహారాన్ని అందిస్తూ ఒకమీదట గొడవలు జరకుండా చూసుకుంటామని, అందరం కలిసిమెలిసి ఉందామంటూ స్నేహ హస్తం చాపుతున్నారు.
ఢిల్లీకి ఫ్లైట్ వచ్చేది అప్పుడే
కిర్గిస్థాన్‌లో వారం రోజులుగా భయబ్రాంతులతో గడిపిన తెలుగు విద్యార్థులు స్వదేశానికి వస్తున్నారు. యూనివర్సిటీలు చేసిన ఏర్పాట్ల ప్రకారం వారు ఈవాళ ఢిల్లీకి వెళ్లే విమానం ఎక్కనున్నారు. ఆ విమానం 23 తేదీ ఉదయం 10 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. అయితే ఈ విమానం కోసం టికెట్లను తెలుగు విద్యార్థులు తమ సొంత డబ్బుతోనే బుక్ చేసుకున్నారు. వారి ప్రయాణ ఖర్చులను వారే బరాయిస్తున్నట్లు అక్కడి విద్యార్థి ఒకరు చెప్పారు. ఇంతటి భయాన పరిస్థితుల నుంచి ఇప్పుడు ఇంటికి తిరిగి వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని వారు చెప్పారు.
వివాదం షురూ అయ్యింది అక్కడే
కిర్గిస్థాన్‌లో చెలరేగిన హింసాకాండకు ఒక చిన్న వీడియో బీజం వేసింది. ఆ వీడియోలో కిర్గిస్థాన్ విద్యార్థులు, విదేశీ విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టుకుంటూ కనిపిస్తున్నారు. వారిలో ముఖ్యంగా పాకిస్థాన్, ఈజిప్ట్ విద్యార్థులు ఉన్నారు. మే 13న ఆ వీడియో వైరల్ అయింది. దీనిపై అక్కడి స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ విద్యార్థులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అదే సమయంలో ఆ గొడవకు సంబంధించి అక్కడి పోలీసులు ముగ్గురు కిర్గిస్థాన్ విద్యార్థులను అదుపులోకి తీసుకోవడంతో ఈ వివాదం రోడ్డెక్కింది. పోలీసుల చర్యలను నిరసిస్తూ కొందరు స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ విద్యార్థుల విషయంలో పోలీసులు సున్నితంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు చెలరేగిన ఆందోళనతో కొందరు అల్లరి మూకలు మెడికల్ యూనిర్సిటీలు టార్గెట్‌గా దాడులు చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి కిర్గిస్థాన్‌లో పరిస్థితులు ఉద్రిక్తం అయ్యాయి.