కిలో ఉల్లికి రూపాయి కూడా ఇవ్వరా? రోడ్డెక్కిన రైతులు

ధర తగ్గి ఉల్లి రైతు కంట కన్నీరు.. ట్రేడర్ల సిండికేటు..;

Update: 2025-08-29 10:43 GMT
ఆంధ్రప్రదేశ్ లో ఉల్లి రైతు కంట కన్నీరు వొలుకుతోంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో విస్తారంగా సాగు చేసిన ఉల్లి పంట ఇప్పుడు రైతుల గుండెల్లో మంట రేపుతోంది. ధరలు దారుణంగా పడిపోవడానికి తోడు వ్యాపారులు సిండికేట్ కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. నిన్న మొన్నటి వరకు క్వింటాల్ ఉల్లి 4 నుంచి 5 వేల రూపాయల వరకు పలికితే ఇప్పుడది అమాంతం రూ.100 పడిపోయింది. పోనీ ఆ ధరకైనా అమ్ముకుందామా అంటే సిండికేట్ అయిన వ్యాపారులు ముందుకు రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. కర్నూలు మార్కెట్లోనైతే రైతులు రోడ్డెక్కి ఆందోళనలు కూడా చేశారు.

ఈ పరిస్థితిపై ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ, వామపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉల్లి పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ తీవ్రంగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు.
ఎందుకీ పరిస్థితి వచ్చింది..
ఆంధ్రప్రదేశ్ లో సుమారు 38.32 వేల హెక్టార్లలో ఉల్లి సాగవుతుంది. అంటే దాదాపు లక్ష ఎకరాలు . 5.13 లక్షల టన్నులు (టన్ను అంటే 10 క్వింటాళ్లు) దిగుబడి వస్తుందని అంచనా. నిజానికి 2023లో 9.56 లక్షల టన్నుల వచ్చింది. ఇప్పుడది పడిపోయింది. 5.13 లక్ష టన్నుల దిగుబడి అంటే హెక్టార్ కి 13.4 టన్నులు. అంటే హెక్టార్ కి 134 క్వింటాళ్లు.

ఇక రాష్ట్రంలో సగటు వినియోగం 16.3 కిలోలు (FAOSTAT). ఆంధ్రప్రదేశ్ జనాభా (5.3 కోట్ల మంది) ఆధారంగా లెక్క వేసుకుంటే రాష్ట్రానికి ఏడాదికి దాదాపు 8, 9 లక్షల టన్నుల ఉల్లి అవసరం అవుతుంది.
అవసరం: 80–90 లక్షల క్వింటాళ్లు
ఉత్పత్తి: 51 లక్షల క్వింటాళ్లు
లోటు: సుమారు 30–40 లక్షల క్వింటాళ్లు
ఉత్పత్తి అంతకన్నా తక్కువగానే ఉన్నా రైతులకు మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదు.
ఈసారి ధర ఎందుకు తగ్గింది?
గత ఏడాది కర్నూలు మార్కెట్‌లో క్వింటాలుకు ₹2,500–₹3,000 మధ్య ఉంది. అదే గిరాకీ ఉన్న సమయంలోనైతే క్వింటాల్ ఉల్లి రూ.5,000 వరకు పలికిన సందర్భమూ లేకపోలేదు.
కానీ ఈ ఏడాది సీజన్ మొదట్లోనే ధరలు లేకుండా పోయాయి. బయటి మార్కెట్ లో కిలో ఉల్లి రూ.25,30 విక్రయిస్తున్నా రైతుకు మాత్రం రూ.1 ఇవ్వడానికీ వ్యాపారులు ఇష్టపడడం లేదు. ఎకరా ఉల్లి సాగుకి రూ.1.20 లక్ష ఖర్చు పెడుతుంటే చేతికి వచ్చేది అందులో నాలుగో వంతు కూడా లేకపోవడం గమనార్హం.

APలో ఉల్లి డిమాండ్-సప్లై గ్యాప్ ఉన్నప్పటికీ, సీజన్‌లో పక్క రాష్ట్రాలలో (ఉదా: మహారాష్ట్ర) వచ్చిన అధిక దిగుబడి వచ్చిన ఫలితంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. మార్కెట్ యార్డ్‌లో ఒకేసారి భారీగా సరకు రావడంతో దళారుల ప్రభావం పెరిగింది. ఫలితంగా వ్యాపారులు ఇక్కడ కొనే కన్నా పక్కరాష్ట్రాల సరకు తెచ్చి ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు పంపిస్తున్నారు.
రైతుల ఆవేదన ఇలా...
వారం రోజులుగా మార్కెట్‌లో పంటను తెచ్చిపెట్టామని, వ్యాపారులు, దళారులు నామమాత్రపు రేటు చెబుతున్నారని, కొనేవారు లేక రోజుల తరబడి మార్కెట్‌లోనే పడిగాపులు కాస్తున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులకు వైసీపీ మద్దతుగా నిలిచింది.
రైతులు చెబుతున్న లెక్కల ప్రకారం...
ఎకరాకు సగటు పెట్టుబడి: ₹1.20 లక్షలు (విత్తనం, ఎరువులు, కూలి, రవాణా).
ఎకరాకు సగటు దిగుబడి: 100 క్వింటాళ్లు.
గతంలో నాణ్యమైన పంట క్వింటా ధర ₹3,000–₹5,000,
తక్కువ నాణ్యత క్వింటా కూడా కనీసం ₹1,800–₹2,000 పలికేది.
కానీ ఈ సీజన్‌లో వ్యాపారులు క్వింటాకు ₹100 కూడా ఇవ్వడం లేదు.
ఇలా, రైతు లక్షకు పైబడి పెట్టుబడి పెట్టినా ఫలితం లేకుండా పోతోంది. దీంతో వారం రోజులుగా రైతులు మార్కెట్ యార్డుల వద్ద ఆందోళన చేస్తున్నారు.
“పంటను తెచ్చిపెట్టాం, కానీ వ్యాపారులు నామమాత్రపు రేటే చెబుతున్నారు. రోజులు గడుస్తున్నా అమ్మకాలు లేవు. అప్పులు చేసి సాగు చేశాం. ఇక ఆత్మహత్యే దారి అనిపిస్తోంది” అని నంద్యాలకు చెందిన రైతు రామచంద్రయ్య వాపోయాడు.
మార్కెట్‌లో ట్రేడర్లు, దళారులు సిండికేట్ గా ఏర్పడి సిండికేట్‌గా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. బయట మార్కెట్‌లో ఉల్లిపాయ కిలో ధర ₹30 పలుకుతుండగా, రైతుల వద్ద నుంచి మాత్రం క్వింటాకు ₹100కే కొనుగోలు చేస్తున్నారు.
కర్నూలు మార్కెట్ యార్డ్‌ను సందర్శించిన వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ – “ఉల్లి పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ ఘోరంగా విఫలమైంది. గతంలో వైఎస్ జగన్ సీఎం‌గా ఉన్నప్పుడు గిట్టుబాటు ధరకు పంట కొనుగోలు జరిగేది. కానీ ఇప్పుడు రైతుల గోడు వినేవారు లేరు” అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉల్లి రైతుల కష్టం కేవలం ఆర్థిక సమస్య కాదు, అది ఒక సామాజిక–రాజకీయ సంక్షోభం. పెట్టుబడి–దిగుబడి మధ్య వ్యత్యాసం భయంకరంగా పెరగడంతో రైతులు లక్షల్లో నష్టపోతున్నారు. ఈ పరిస్థితిలో ప్రభుత్వం తక్షణమే కనీస మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయకపోతే, రైతుల ఆత్మహత్యల ఊపిరి గాలిలోనే వినిపిస్తోందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ అన్నారు.
ప్రభుత్వ స్పందన

ఉల్లి రైతుల సమస్యపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. క్వింటాకు ₹1,200 ఇచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రొక్యూర్‌మెంట్ ప్రారంభించమని ఆదేశించారు. రైతు బజార్లకు పంపిణీ చేయమని సూచించారు.
Tags:    

Similar News