'ప్రభుత్వం మారినా అంగన్వాడీల కష్టాలు తీరలేదు'

రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడినా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కావడంలో తీవ్రమైన నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉందా..!

Update: 2024-09-03 13:21 GMT

"ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ"

రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడినా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కావడంలో తీవ్రమైన నిర్లక్ష్యం కొనసాగుతూనే ఉందని... ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. సుబ్బరావమ్మ ఆరోపించారు. ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అంగన్వాడీలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్నారని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెట్టిన షరతులన్నింటిని యధాతధంగా అమలు చేస్తూ అంగన్వాడీల సమస్యలు పెరగడానికి కారకులయ్యారని ఆమె ఆరోపించారు. అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించడం, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తలూపడం చూస్తుంటే అంగన్వాడీల కష్టాలు పెరుగుతాయన్న ఆందోళన వెంటాడుతున్నదని ఆమె అన్నారు.

జగన్మోహన్ రెడ్డి పాలనా కాలంలో 42 రోజులు పాటు అలుపెరగని సమ్మె చేపట్టిన అంగన్వాడీలకు వేతనాలు పెంచే విషయంలో నూతన ప్రభుత్వ వైఖరి ఇప్పటివరకు వెల్లడించకపోవడం ఏ రకంగా సమంజసమని ఆమె ప్రశ్నించారు. తాము ఉద్యమంలో ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు పలుమార్లు తమకు మద్దతు ప్రకటించారని, తమ కోర్కెలు న్యాయమైనవని చెప్పారని, అధికారంలోకి వచ్చి నెలలు కావస్తున్నా కనీసం మాట మాత్రంగా నైనా తమతో చర్చించడానికి పూనుకోలేదని సుబ్బరావమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఐసిడిఎస్ విభాగానికి నిధుల కోత కోసిందని, ఈ కారణంగా మరింత సంక్షోభం ఏర్పడుతుందని అన్నారు.

పెరిగిన ధరల కారణంగా తీవ్రమైన ఇబ్బందులను అంగన్వాడీలు ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు. సెప్టెంబర్ నెలలో రాష్ట్ర స్థాయి సదస్సు విజయవాడలో నిర్వహిస్తున్నామని, ఆ సదస్సులో భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను రూపొందించి నిర్ణయాలు ప్రకటిస్తామని ఆమె వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు కేఎన్ఎన్ ప్రసాదరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. వాణిశ్రీ అధ్యక్షురాలు పద్మలీల, నాగరాజమ్మ, ధనమ్మ, రాజేశ్వ,రి స్వరూపరాణి, మంజుల, ప్రభావతి, శ్యామల, ఇంద్రాణి, మునికుమారి, రేవతి, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News