నమ్మకానికి మారు పేరు గుణదల మేరీమాత

నేటితో ముగియనున్న మేరీ మాత ఉత్సవాలు;

Update: 2025-02-11 11:01 GMT

దక్షిణ భారతదేశంలోని క్రైస్తవ క్షేత్రాల్లో రెండో అతి పెద్ద క్షేత్రం గుణదల మేరీమాత చర్చి. ఫ్రాన్సులోని లూర్థు నగరం సహజమైన గుహలో ఉన్న మేరీమాత చర్చ్‌ను పోలినట్టుగా విజయవాడ లోని గుణదలలో కూడా సహజమైన గుహలో మేరీ మాత విగ్రహం ఉన్నందున ఈ క్షేత్రం ప్రసిద్ధమైంది. క్రిస్మస్, జనవరి ఫస్ట్, గుడ్‌ ఫ్రైడే, ఈస్టర్‌ రోజున పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. సాధారణ రోజుల్లో శుక్ర, శని, ఆదివారాల్లో రద్దీ ఉంటుంది. ఇక ప్రతి ఏటా ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా దాదాపు 13 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతారు.

1924వ సంవత్సరంలో నాటి బ్రిటీష్ ప్రభుత్వం గుణదలలో ‘సెయింట్ జోసెఫ్ ఇన్ స్టిట్యూట్’ అనే అనాధ శరణాలయం ఏర్పాటు చేసింది. ఇటలీకి చెందిన ఫాదర్ పి ఆర్లాటి దానికి రెక్టార్ గా నియమితుడయ్యాడు. ఆయన అదే సంవత్సరం గుణదల కొండపై ఉన్న గుహలో మేరీమాత విగ్రహాన్ని నెలకొల్పాడు. అప్పటి నుంచి మేరీ మాత పూజలు అందుకుంటోంది. 1946లో అప్పటి చర్చి ఫాదర్ బియాంకి, ఇతరులను కలిసి నూతన మేరీ మాత, బలిపీఠాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. అత్యవసరంగా ఫాదర్ బియ్యాంకి ఇటలీ వెళ్ళాడు. మిగిలిన వారు చర్చి నిర్మాణాన్ని కొనసాగించారు. అకస్మాత్తుగా వచ్చిన వరదలలో అప్పటివరకు సిద్ధమైన నిర్మాణాలన్నీ కొట్టుకుపోయాయి. తిరిగి నిర్మాణ పనులు ప్రారంభించారు.

ఫాదర్ బియాంకి ఇటలీ నుంచి తిరిగి వచ్చేనాటికి (1947) చర్చి నిర్మాణం పూర్తయింది. అప్పటి నుంచి క్రైస్తవ పర్వదినాల్లో ప్రజలు మేరీమాతను దర్శించుకుని దీవెనలు పొందుతున్నారు. భక్తుల తాకిడి పెరగడంతో గుణదల మేరీ మాత ఉత్సవాలు ఒకేరోజు కాకుండా మూడు రోజులు పాటు జరుపుకుంటారు. ఈ ఉత్సవాలకు లక్షలాదిగా భక్తులు హాజరవుతారు. కొండవద్ద సహజసిద్ధంగా ఏర్పడ్డ గుహ నుండి కొండపై నిర్మించిన శిలువకు ఇప్పుడు మెట్ల మార్గం ఉంది. నవంబరు, డిసెంబరు మాసాలలో జరిగే ప్రత్యేక ప్రార్థనలకు రాష్ట్ర నలు మూలల నుంచి క్రైస్తవ భక్తులు వేలాదిగా వస్తారు.

గుణదల లూర్ధుమాత తిరునాళ్ల మహోత్సవాలు ఉదయ కాల ప్రార్థన, సమిష్టి బలిపూజతో ఈనెల 9న ఘనంగా ప్రారంభమయ్యాయి. గుణదల పీఠాధిపతి బీషప్ తెలగతోటి జోసఫ్ రాజారావు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి అనంతరం దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన రోమన్ క్యాథలిక్ వివిధ పీఠాధిపతులు గుణదల మేరీ మాత వైభవం పై ప్రసంగించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న భక్తులను ఆశీర్వదించారు. భారీగా హాజరైన భక్తులు గుణదల మేరీ మాత కొండ పైకి చేరుకొని పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల కోసం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవాడ నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు దివ్య బలి పూజా కార్యక్రమంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. లక్షలాది మంది పాల్గొనే ఈ తిరునాళ్ల మహోత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక పూజలు నిర్వహించుకునేలా ఆలయ కమిటీ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తోంది.

Tags:    

Similar News