అన్ని పార్టీలకు దిక్కు జనసేనేనా? వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ గుడ్ బై..
గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన ఆఫీసు కిటకిటలాడుతోంది. ఎక్కడెక్కడి అసంతృప్త వాదులందరూ పవన్ గడప దొక్కుతున్నారు. తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే గుడ్ బై చెప్పనున్నారు;
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జనసేన దూకుడు పెంచింది. వరుస సమావేశాలు, వరుస చేరికలతో బిజీబిజీ అయింది. వైసీపీ, టీడీపీలో టికెట్లు రావని కొందరు, ఆ రెండు పార్టీలలో ప్రాధాన్యత లేదని మరికొందరు జనసేన కార్యాలయానికి క్యూ కట్టారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ను కలిసి టికెట్లు ఖరారు చేసుకునే పనిలో పడ్డారు. తాజాగా ఇద్దరు సినీరంగ ప్రముఖులు, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, వైఎస్సార్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటారని భావించే ఎస్సీ ఎమ్మెల్యే ఒకరు జనసేనాని పవన్ కల్యాణ్ ను కలిసి కండువాలు కప్పించుకున్నారు.
మరో ఎస్సీ ఎమ్మెల్యే ఔట్..
సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైఎస్ఆర్‌సీపీ పార్టీ (YCP) భారీగా మారుస్తున్న నేపథ్యంలో టికెట్ దక్కనివారు ఇతర పార్టీల్లోకి వెళుతున్నారు. ఆ జాబితాలో సీనియర్ నేత, గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ కూడా చేరిపోయారు. గూడూరు వైసీపీ టికెట్‌ను మేరుగ మురళికి కేటాయించిన తరుణంలో ఆయన కూడా పార్టీ ఫిరాయించనున్నట్టు సమాచారం. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో బుధవారం వరప్రసాద్ భేటీ అయ్యారు. పార్టీలో చేరే అంశంపై చర్చిస్తున్నారు. తిరుపతి నుంచి లోక్ సభకు పోటీ చేయాలని వరప్రసాద్ భావిస్తున్నారు.
సినీనటుడు పృథ్వీరాజ్ చేరిక...
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, సినీనటుడు పృథ్వీరాజ్ (Prudhvi Raj) జనసేనలో చేరారు. మంగగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. వీరికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొత్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నవారు తమకు నచ్చిన పార్టీల్లో చేరుతున్నారు. తాజాగా ప్రముఖ సినీ నృత్య దర్శకుడు షేక్ జానీ మాస్టర్ (Johny Master) పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జానీ మాస్టర్ పోటీ చేస్తారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. పోటీ చేస్తే నెల్లూరు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగవచ్చుననే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే ఆయన అనేక సేవా కార్యక్రమాల్లో పొల్గొంటున్నారు.
జనసేన, టీడీపీ ప్రభుత్వం రావడం ఖాయమన్న పృధ్వీరాజ్..
జనసేనలో చేరే సందర్భంలో సినీనటుడు, ఒకప్పటి వైసీపీ నాయకుడు పృధ్వీరాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వదిలిన బాణం అన్నారు. మార్చిలో ఎన్నికల ప్రచారానికి వస్తానన్నారు. ‘లోకేశ్ వద్ద రెడ్ డైరీ ఉంది.. తన దగ్గర పీఆర్ డైరీ ఉంది.. ఆ డైరీ బయటకు తీస్తా. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు తనను వాడుకుని వదిలేసిన అధికార ycp పార్టీ.. సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది’ అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజల తీర్పు అద్భుతంగా ఉంటుందంటున్నారు పృథ్వీరాజ్. ‘ఏపీలో టీడీపీ, జనసేన కలయిక స్థిరత్వం, అభివృద్ది, ప్రజా సంక్షేమానికి పని చేస్తుంది. టీడీపీ, జనసేనల రెండు జెండాల కలయిక అద్భుతం.. ఇది మార్పుకు శుభసూచికం. 175 సీట్లు గెలుస్తామని చెప్పిన వైఎస్సార్‌సీపీ నాయకులు.. ఇప్పుడు భయపడుతున్నారు. 175కు 175 సీట్లు గెలుస్తామన్నప్పుడు భయం ఎందుకు.. ఈ మార్పులు ఎందుకు.. ఎమ్మెల్యేల సీట్లు మార్చినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరు. 130కుపైగా అసెంబ్లీ స్దానాలు.. 21 ఎంపీ స్థానాలు వస్తాయి. టీడీపీ, జనసేనల మిశ్రమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది’ అంటున్నారు పృథ్వీ. మొత్తానికి మంగళగిరిలోని జనసేన కార్యాలయం కొత్త తరం నాయకులతో కిటకిటలాడుతోంది. ఇది ఎంతకాలం ఉంటుందో చూడాలి.