ఏపీ డిఎస్సీపై హైకోర్టు మరో సంచలన తీర్పు
ఏపీ హైకోర్టు డీెెఎస్సీపై మరో సంచలన తీర్పు వెలువరించింది. కనీస సమయం లేకుండా పరీక్షలు ఎలా పెడతారని ప్రశ్నించింది.
Byline : The Federal
Update: 2024-03-05 07:48 GMT
టెట్‌కు, నియామకాల పరీక్షకు తక్కువ సమయం ఇచ్చిన ప్రభుత్వం
రెండు పరీక్షలకు తగిన సమయం ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు
వివాదాలతో మొదలైన డిఎస్‌సి నియామకాల ప్రక్రియ
జి. విజయ కుమార్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డిఎస్సీ నోటిఫికేషన్‌పై వివాదాలు చుట్టు ముట్టాయి. నాలుగున్నర ఏళ్లు కళ్లు మూసుకొని కూర్చున వైసిపి ప్రభుత్వం ఎన్నికల సమయం దగ్గర పడగానే హడావుడిగా నిరుద్యోగుల కోసం డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. దాదాపు 6,100 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. నోటిఫికేషన్‌లో ప్రభుత్వం చేసిన తప్పిదాలు, వీటిపై హైకోర్టులో దాఖలవుతున్న పిటిషన్లు, వాటిపైన ఉన్నత న్యాయ స్థానం స్పందిస్తున్న తీరు చూస్తుంటే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ సజావుగా సాగే అవకాశం కనిపించడం లేదు. బిఇడి అభ్యర్థులు ఎస్‌జిటి పోస్టులకు అర్హులు కాదంటూ ప్రభుత్వానికి మొట్టికాయ వేసిన ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయ స్థానం తాజాగా టెట్, టిఆర్‌టి పరీక్షలపైన మరో సారి సీరియస్ అయింది.
టెట్, టిఆర్‌టి పరీక్షల నడుమ తగినంత సమయం లేక పోవడంపై ఐదు మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పెద్దిరాజుతో పాటు మరో నలుగురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన డిఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసి పరీక్షల నిర్వహణకు తాజాగా మరో నోటిఫికేషన్ జారీ చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. టెట్ పరీక్షలు ముగిసిన తర్వాత టిఆర్‌టి పరీక్షలు రాసేందుకు గాను ప్రభుత్వం తగిన సమయం ఇవ్వ లేదని, దీంతో పరీక్షలు రాసే అభ్యర్థులు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆ పిటిషన్‌లో కోర్టుకు విన్నవించారు. అభ్యర్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు తగినంత సమయం ఇచ్చే విధంగా ప్రస్తుతం ఇచ్చిన పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. నిరుద్యోగుల పక్షం ఉన్న ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. బుధవారం దీనిపై వాదనలు కూడా ముగిసాయి. ఇరువైపుల వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ తీర్పును రిజర్వు చేశారు. తాజాగా సోమవారం తీర్పును వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు ఉపాధ్యాయుల నియామకానికి నిర్వహించే టిఆర్‌టి పరీక్షకు మధ్య తగినంత సమయం ఉండే విధంగా రీ షెడ్యూల్ చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సోమవారం ఆదేశాలు జారీ చేసింది. టెట్, టిఆర్‌టి పరీక్షలకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ను మార్చాలని స్పష్టం చేసింది. రెండు పరీక్షల నడుమ కనీసం నాలుగు వారాల సమయం ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. రాత పరీక్ష అనంతరం విడుదల చేసే కీ పైన అభ్యర్థుల అభ్యంతరాల స్వీకరణకు కూడా తగినంత సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఇది వరకే టెట్ పరీక్షలు మొదలయ్యాయి. గత మాసంలోనే ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 23 నుంచే హాల్ టికెట్‌లను విడుదల చేశారు. ఆరు రోజులుగా పరీక్షలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్ పరీక్షలు కొనసాగనున్నాయి. టెట్ పరీక్షల ఫలితాలను మార్చి 14న విడుద చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రభుత్వం నిర్వాకం వల్ల నిరుద్యోగులు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు. నోటిఫికేషన్లు ఇచ్చే ముందే తగిన జాగ్రత్తలు చేపట్టాల్సిన ప్రభుత్వం ఆ చర్యలు చేపట్టలేదు. నిబంధనలకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ను విడుదల చేయడంతో నిరుద్యోగులు కోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత పరీక్షలు రాసేందుకు కనీస సమయం కూడా ఇవ్వక పోవడాన్ని నిరుద్యోగులు తప్పు పడుతున్నారు. టెట్ పరీక్షకు, ఉపాధ్యాయుల నియామక పరీక్షకు మధ్య సమయం కనీసం నాలుగు వారాలు ఉండాలనే నిబంధన ఉన్నా ప్రభుత్వం దానిని పట్టించుకోక పోవడం వివాదాస్పదంగా మారింది. డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి వివాదాల చుట్టూ తిరుగుతూనే ఉంద తప్ప నిరుద్యోగులకు భరోసా ఇచ్చే వైపు సాగడం లేదు. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పటి వరకు పరీక్షలు రాసిన అభ్యర్థులకు మరో సారి పరీక్షలు నిర్వహిస్తారా? లేక రాసిన వారికి కాకుండా మిగిలిన వారికి పరీక్షలు పెడుతారా? ఏ విషయం ప్రభుత్వం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లోనే లోపాలున్నాయని కోర్టు ఎత్తి చూపడం, అవేమి పట్టనట్టు ప్రభుత్వం అడుగులు వేయడం చూస్తుంటే నిరుద్యోగుల జీవితాలను సుడిగుండంలోకి లాగుతున్నట్లు ఉందని విద్యావంతులు అభిప్రాయపడుతున్నారు.