ఈ నెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం చేయనున్నారు. ఫిబ్రవరి నెలాఖరులో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.;

Update: 2025-02-07 11:43 GMT

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలకు మహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 24 నుంచి ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం శాసన సభ, శాసన మండలి రెండు సభలను ఉద్దేశించి గవర్నర్‌ ఎస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగం చేయనున్నారు. ఫిబ్రవరి 28వ తేదీన అంటే ఫిబ్రవరి ఆఖరు శనివారం 2025–26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. దాదాపు మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. సెలవులతో కలుపుకొని మొత్తం 20 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలను నిర్వహించాలనే ఆలోచనలు చేస్తున్నారు. అయితే దీనిపైన స్పష్టత రావలసి ఉంది. ఎన్ని రోజులు జరపాలనే దానిపై తొలి రోజు జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. శాఖల వారీగా అడిగిన ప్రశ్నలకు పూర్తి స్థాయిలో సబ్జెక్టు మీద అవగాహన చేసుకొని సమావేశాలకు హాజరు కావాలని ఇప్పటికే మంత్రులకు ఆదేశాలు అందినట్లు సమాచారం.

ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవగాహన కల్పించేందుకు ఓరియంటేషన్‌ తరగతులు నిర్వహించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఉభయ సభల్లోని సభ్యులకు రెండు రోజుల పాటు వర్క్‌షాపు జరపాలని ఆలోచనలు చేస్తున్నారు. కొత్తగా అటు సభలోకి, ఇటు కౌన్సిల్‌ల్లోకి అడుగు పెట్టిన సభ్యులకు సభా నియమాలు, నిబంధనలు, సభలో సభ్యుల పని తీరు, వ్యవహార శైలి ఎలా ఉండాలి, సభా మర్యాదలను ఎలా గౌరవించాలనే అంశాలపైన కూడా ఓరియంటేషన్‌ ఇవ్వనున్నారు. అయితే ఈ ఓరియంటేషన్‌ తరగతులకు లోక్‌ సభ స్పీకర్‌ ఓం బిర్లాను ఆహ్వానించనున్నట్లు తెలిసింది. అయితే ఆయన ఫిజికల్‌గా హాజరై.. ఓరియంటేషన్‌ క్లాసులను ప్రారంభిస్తారా? లేదా వర్చువల్‌ విధానంలో హాజరై.. అవగాహన తరగతులను ప్రారంభిస్తారా? అనేదానిపై స్పష్టత రావలసి ఉంది. అయితే భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాత్రం తప్పకుండా హాజరు కానున్నట్లు తెలిసింది.
Tags:    

Similar News