వాసుదేవరెడ్డి అరెస్ట్.. ఏపీ ఎక్సైస్ స్కామ్‌ల కీలక పాత్ర..?

ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ కొన్ని రోజులుగా తెగ హల్‌చల్ చేస్తోంది. ఢిల్లీ, జార్ఖండ్ రాష్ట్రాల తలదన్నేలా వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందంటూ పలువురు అధికార పక్ష నేతలు కీలక ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

Update: 2024-08-18 11:45 GMT

ఆంధ్రప్రదేశ్ మద్యం పాలసీ కొన్ని రోజులుగా తెగ హల్‌చల్ చేస్తోంది. ఢిల్లీ, జార్ఖండ్ రాష్ట్రాల తలదన్నేలా వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందంటూ పలువురు అధికార పక్ష నేతలు కీలక ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ మద్యం కుంభకోణంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని సీఐడి అదుపులోకి తీసుకుంది. మద్యం కుంభకోణంపై ఆయన కీలక పాత్ర పోషించారని టీడీపీ చేస్తున్న ఆరోపణలు ఈరోజు ఆయన అరెస్ట్‌తో మరింత దృఢపడ్డాయి. ప్రస్తుతం ఆయనను సీఐడీ అధికారులు అజ్ఞాత ప్రాంతంలో విచారిస్తున్నట్లు సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. వాసుదేవరెడ్డిని మాజీ సీఎం వైఎస్ జగన్ స్పెషల్‌గా డిప్యూటేషన్‌పై తీసుకొచ్చారన్న వాదన కూడా జోరుగానే సాగుతోంది.

వాటిపై వాసుదే అజమాయిషీ

వాసుదేవరెడ్డిని ఏపీకి తీసుకొచ్చిన తర్వాత ఆయనకు రాష్ట్రంలోని మద్యం సేల్స్ బాధ్యతలను జగన్ అప్పగించారని కూడా టీడీపీ అనేకసార్లు ఆరోపించింది. జగన్ ఆదేశాలతో డిస్టిలరీలు, డిపోలు, మద్యం షాపులపై వాసు దేవరెడ్డి తన హవా సాగించారని, జే బ్రాండ్లు తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారన్న అభియోగాలు కూడా వాసుపై ఉన్నాయి. మద్యం పేరుతో వైసీపీ చేసిన దోపిడీకి కర్త, కర్మ, క్రియ అన్నీ తానై వాసుదేవరెడ్డి పనిచేశారని, రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో రెండు నెలలుగా ఆయన పరారీలో ఉన్నారని టీడీపీ విమర్శించింది. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు వాసుదేవరెడ్డిని అదుపులోకి తీసుకోవడం కీలకంగా మారింది.

Tags:    

Similar News