బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన ఏపీ క్యాబినెట్
సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.
By : The Federal
Update: 2024-11-11 05:15 GMT
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలి రోజునే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం ఉదయం క్యాబినెట్ సమావేశం జరిగింది. మంత్రులందరూ దీనికి హాజరయ్యారు. 2024–25 ఏడాది బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. అంతకు ముందు మంత్రి పయ్యావులకు ఆర్థికశాఖ అధికారులు పియూష్ కుమార్, జానకీ, నివాస్ బడ్జెట్ పత్రాలను అందచేశారు. అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దాదానె ఐదు నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మీదే కూటమి ప్రభుత్వం పాలన సాగించింది. సంక్షేమం, అభివృద్ధి రెండు రంగాలకూ బడ్జెట్టులో సమ ప్రాధాన్యత ఉండేలా ప్రభుత్వం కసరత్తు చేసింది. సూపర్ సిక్స్ హామీలకు నిధుల కేటాయింపులు చేశారు. పెన్షన్లు, దీపం–2.0, అన్నా క్యాంటీన్ల పథకాలకు నిధుల కేటాయింపులు చేశారు. ఇరిగేషన్, రోడ్ల మరమ్మత్తులు, నిర్మాణాలకు నిధుల కేటాయింపులు చేశారు. పోలవరం, రాజధాని పనుల పునఃప్రారంభానికి నిధుల సమ్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ రూపకల్పన చేపట్టారు.
పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన మౌళిక సదుపాయాలకు నిధుల కల్పన చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్వహణకు కూడా నిధుల కేటాయింపులు చేపట్టారు. నరేగా కింద చేపట్టాల్సిన పనులపైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వం తెచ్చిన వివిధ పాలసీలకు అనుగుణంగా అవసరమైన మేరకు నిధుల సర్దుబాటుపైన కూడా కసరత్తు చేశారు. పెండింగులో ఉన్న ఫీజులు, ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ నిధుల చెల్లింపులకు సంబంధించిన నిధుల కేటాంపులు కూడా చేశారు.