వీటీపైనే ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఉపాధ్యాయుల బదిలీల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.;
By : The Federal
Update: 2025-03-17 12:21 GMT
ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ అంశం మీద మంత్రి వర్గ సమావేశంలో చర్చించారు. ఎస్సీ వర్గీకరణ మీద ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్‌రంజన్ మిత్రా ఏక సభ్య కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఈ నివేదికను కూడా ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్లు ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాల మీద చర్చించి ఆమోదం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్ల వరకు, ఉచిత విద్యుత్ ఇవ్వాలనే దాని మీద కీలక నిర్ణయం తీసుకుంది. పవర్ లూమ్స్‌కు సంబంధించిన ఉచిత విద్యుత్ మీద కూడా కీలక నిర్ణయం తీసుకుంది. చేనేత కార్మికుల ఇళ్లకు 200 యూనిట్లు, పవర్ లూమ్స్‌కు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు రూపొందించిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. రాజధాని అమరావతి ప్రాంతంలో భూ కేటాయింపులకు సంబంధించిన నిర్ణయాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. నంబూరులో వీవీఐటీయూకు ప్రైవేటు యూనివర్శిటీ హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో నెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అంశంపైనా ఆమోదం తెలిపింది. వైఎస్‌ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును మార్చాలని నిర్ణయించారు.
ముఖ్యమంత్రి కార్యాలయంలో ముగ్గురు ఫొటో గ్రాఫర్లు, వీడియో గ్రాఫర్ల పోస్టులకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వైఎస్‌ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరుకు బదులుగా వైఎస్‌ఆర్ పేరును తొలగించి, తాడిగడప మున్సిపాలిటీగా మార్పులు చేస్తూ మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. సీఆర్‌డిఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అమరావతిలో చేపట్టే రూ. 22,607 కోట్ల విలువైన 22 పనులకు చేపట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చేపట్టిన రూ. 15091 కోట్ల విలువైన పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ సంస్థ రూ. 2,883 కోట్ల పెట్టుబడులకు, విశాపట్నం నగరంలో లూలూ గ్లోబల్ ఇంటర్నేషనల్ సంస్థ రూ. 1,500 కోట్ల పెట్టుబడులతో అంతర్జాతీయ కన్వెషన్ సెంటర్ ఏర్పాటకు కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కులను ముందుగా 26 జిల్లాలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలకు, ఐదు చోట్ల ఐదు రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.