ఏపీ క్రికెట్‌ అసోసియేషన్‌ ఇకపై ఆపార్టీదే!

ఆంధ్ర క్రి కెట్‌ అసోసియేషన్‌ను ఇక నుంచి రాజకీయ నాయకులు నడిపిస్తారు. ఎంపీ, ఎమ్మెల్యేలు అసోసియేషన్‌ సభ్యులయ్యారు. ఎవరు వారు? ఎలా పదవులు దక్కించుకున్నారు?

Update: 2024-08-18 02:30 GMT

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ నాయకులు రాజకీయాల్లోనే కాదు ఆటల సంఘాల్లోనూ రాణిస్తున్నారు. క్రీడా కారులు కాకపోయినా క్రీడల్లో పాల్గొనే వారిని శాసించే అవకాశాన్ని చేజిక్కించుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణ ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌. ఈ అసోసియేషన్‌ రాజకీయ నాయకుల చేతుల్లోకి పోయింది. గోకరాజు గంగరాజు చేతుల్లో కొంతకాలం, ఆ తరువాత విజయసాయిరెడ్డి చేతుల్లో కొంతకాలం, ఇప్పుడు నారా లోకేష్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది.

ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌కు నోటిఫికేషన్‌ జారీ కాగా ఈనెల 17న స్క్రూట్నీ జరిగింది. దాఖలైన నామినేషన్‌లు అన్నీ సక్రమంగానే ఉన్నాయని ఎన్నికల అధికారి ప్రకటించారు. మొత్తం ఆరు పోస్టులకు ఆరుగురు మాత్రమే నామినేషన్‌లు దాఖలు చేశారు. వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చెప్పొచ్చు. ఎన్నికల అధికారి వచ్చేనెల 8వ తేదీన అధికారికంగా ప్రకటిస్తారు. ఎందుకంటే ఆరోజు ఎన్నిక తేదీ. నిబంధనల ప్రకారం ఎన్నిక జరిగిన తరువాత గెలిచినట్లు ప్రకటిస్తారు.
నామినేషన్‌లు దాఖలు చేసిన వారిలో అధ్యక్ష పదవికి కేశినేని శివనాథ్‌ (చిన్ని), ఉపాధ్యక్ష పదవికి పి వెంకట ప్రశాంత్, కార్యదర్శి పదవికి సానా సతీష్‌బాబు, సహాయ కార్యదర్శి పదవికి పి విష్ణుకుమార్‌ రాజు, కోశాధికారి పదవికి దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్‌ పదవికి దంటు గౌర్‌ విష్ణు తేజ్‌ లు ఉన్నారు. వీరి నామినేషన్‌లు మినహా మిగిలిన వారు ఎవ్వరూ నామినేషన్‌ దాఖలు చేయలేదు. స్క్రూట్నీ కూడా అయిపోవడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు భావించాలి.
కేశినేని శివనాథ్‌ విజయవాడ ఎంపీ. తెలుగుదేశం పార్టీ నాయకుడు. నారా లోకేష్‌ టీమ్‌కు చెందిన వారు. తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కావడం, విజయవాడ పార్లమెంట్‌ సభ్యునిగా ఉన్నందున పూర్తిగా రాజకీయాల్లో ఉన్నారనేది స్పష్టమైంది. అలాగే సహాయ కార్యదర్శిగా ఎన్నికైన వ్యక్తి పి విష్ణుకుమార్‌ రాజు. ఈయన బిజేపీ ఎమ్మెల్యే. పూర్తి స్థాయిలో భారతీయ జనతాపార్టీ రాజకీయాల్లో ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామి కావడంతో ఈయనకు అవకాశం వచ్చింది.
కార్యదర్శిగా ఎన్నికైన సానా సతీష్‌ తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు. కాకినాడ పార్లమెంట్‌ తెలుగుదేశం పార్టీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. పొత్తులో భాగంగా కాకినాడ సీటును జనసేన పార్టీకి కేటాయించారు. ఇక్కడి నుంచి జనసేన తరపున తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ పోటీ చేసి గెలుపొందారు. లేకుంటే సానా సతీష్‌ ఎంపీ అయి ఉండేవారని పలువురు రాజకీయ నాయకులు చెబుతున్నారు. ఉపాధ్యక్షునిగా ఎన్నికైన పి వెంకట ప్రశాంత్‌ లోకేష్‌కు అత్యంత సన్నిహితుడని తెలుగుదేశం పార్టీలోని ముఖ్య నాయకులు తెలిపారు. దండమూడి శ్రీనివాస్‌ మాత్రం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనిషి అని, కౌన్సిలర్‌గా ఎన్నికైన విష్ణుతేజ్‌ మాత్రం ఇప్పటి వరకు కార్యదర్శిగా ఉండి రాజీనామా చేసిన ఎస్‌ఆర్‌ గోపీనాథ్‌రెడ్డి అనుచరుడు. ఆయన కోర్కె మేరకు విష్ణుతేజ్‌కు ఇచ్చినట్లు సమాచారం.
వీరిలో కొందరు పూర్తి స్థాయి రాజకీయ నాయకులు కావడం, మరికొందరు పార్శియల్‌గా రాజకీయాల్లో ఉండటం వల్ల ఏసీఏ రాజకీయ నాయకులు చేతుల్లోకి పోయిందని చెప్పొచ్చు. గతంలో రాజకీయ నాయకులు వెనకుండి తెలియకుండా నడిపించే వారు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులే తెరపైకి వచ్చి అసోసియేషన్‌ను నడిపిస్తున్నారు.
Tags:    

Similar News