ఆంధ్రలో ఎన్నికల ప్రచారం ఆదివారం షెడ్యూల్

ఆంధ్రలో జరుగుతున్న ఎన్నికల ప్రచారాలు ఆదివారం రోజున కూడా జోరుగా సాగనున్నాయి. ఈరోజు ఎవరు ఎక్కడ సభలు నిర్వహించనున్నారంటే..

Update: 2024-04-14 03:59 GMT
Source: Twitter

ఆంధ్రలో ఎన్నికల ప్రచార జోరు రోజురోజుకు మరింత పెరుగుతోంది. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ ప్రతి పార్టీ ప్రచారంలో దూకుడు పెంచేస్తున్నాయి. ఎక్కడిక్కడ సభలు, సమావేశాలు నిర్వహించుకుంటూ నేతలను సమన్వయ పరుస్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలో ఈరోజు పార్టీ ప్రచారాలు ఇలా సాగనున్నాయి.

సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ యాత్రకు ఈరోజు విరామం ఇచ్చారు పార్టీ పెద్దలు. నిన్న విజయవాడలో జరుగుతున్న రోడ్‌షోలో సీఎం జగన్‌పై దాడి జరగడం, అందులో ఆయన ఎడమ కంటిపైన గాయం కావడంతో ఈరోజు యాత్రకు విరామం ఇచ్చారు. అంతేకాకుండా తనకు తగిలిన గాయానికి సీఎం జగన్.. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

చంద్రబాబు, పవన్ కల్యాణ్ కొనసాగిస్తున్న ‘ప్రజాగళం’ యాత్రలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈరోజు విశాఖపట్నం జిల్లా పరిధిలోని పాయకరావుపేట, గాజువాకల్లో నిర్వహించే సభల్లో పాల్గొననున్నారు. ఆయన మధ్యాహ్నం 12:55 గంటలకు హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా విశాఖపట్నం బయలుదేరుతారు. మధ్యాహ్నం 2 గంటలకు విశాఖకు చేరుకుంటారు. 2:356కి పాయకరావుపేట చేరుకుంటారు. అక్కడ సూర్యమహల్ సెంటర్‌లో ఏర్పాటు చేయనున్న సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 4:40 గంటలకు షెలికాప్టర్‌లో బయలుదేరి 5:15 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన పాతగాజువాక‌కు వెళతారు. అక్కడ సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం 7:40కి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని తిరిగి హైదరాబాద్‌ బయలుదేరనున్నారు.

ఇక ఏపీసీసీ చీఫ్ షర్మిల చేపట్టిన ‘న్యాయ యాత్ర’ ఈరోజు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో సాగనుంది. ఉదయం 10 గంటలకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సత్యవేడు నియోజకవర్గంలో మరో సభ నిర్వహించనున్నారు. రాత్రి ఏడు గంటలకు నగరి నియోజకవర్గంలో మూడో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

అయితే జగన్‌పై జరిగిన దాడిని షర్మిల తీవ్రంగా ఖండించారు. ‘‘జగన్‌పై దాడి బాధాకరం, దురదృష్టకరం. ఇది ప్రమాదవశాత్తు జరిగిందని అనుకుంటున్నాం. అలా కాకుండా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేయించి ఉంటే దీనిని ప్రతి ఒక్కరూ ఖండించాలి. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. హింసా రాజకీయాలను ఖండించాలి. జగన్‌ త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను’’అని ఆమె ట్వీట్ చేశారు.

Tags:    

Similar News