కోర్టుకెళ్లిన మాజీ సీఎం జగన్.. దాని కోసమే..!

ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ప్రతిపక్ష హోదా లొల్లి హైకోర్టుకు చేరింది. ఈరోజు తాజాగా ఈ అంశంపై మాజీ సీఎం వైఎస్ జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Update: 2024-07-23 13:29 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షం అనేది లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో కూటమికి ప్రత్యర్థిగా ఉన్న తమ పార్టీనే ప్రతిపక్షంగా గుర్తించాలని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలుమార్లు కోరారు. స్పీకర్ అన్నయ్యపాత్రుడికి కూడా లేఖ రాశారు. కానీ ఆయన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. అసెంబ్లీ సమావేశాల నుంచి బాయ్‌కాట్ చేసి బయటకు వచ్చిన తర్వాత కూడా తమను ప్రతిపక్షంగా గుర్తించాలని ఆయన కోరారు. తాజాగా ఇదే అంశంపై ఆయన ఆంధ్ర హైకోర్టును ఆశ్రయించారు. తమకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడిని ఆదేశించాలని జగన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా కల్పించాలంటూ లేఖ రాసినా స్పీకర్ పట్టించుకోలేదని ఆయన తన పిటిషన్‌లో వివరించారు. ఇదిలా ఉంటే వైసీపీ పార్టీకి కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు.

ప్రధాన ప్రతిపక్ష హోదా...

చట్టసభల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కాలంటే, మొత్తం ఆ సభలోని స్థానాల్లో 10 శాతం సభ్యుల సంఖ్య బలం ఉండాలి. ఆ లెక్కన ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని 175 స్థానాల్లో 10 శాతం అంటే 18 సీట్లు సాధించుకున్న పార్టీ నేతకు ప్రతిపక్ష హోదా దక్కుతుంది. దీనివల్ల కొన్ని ప్రాధాన్యాలు ఉండే విధంగా నిబంధనలు రూపొందించారు. మొత్తం స్థానాల్లో ప్రతిపక్ష హోదాకు తగిన సీట్లు సాధించిన పార్టీ నేతకు నిబంధనల మేరకు క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. అసెంబ్లీలో కూడా సీట్ల కేటాయింపులో విపక్షానికి ప్రాధాన్యత ఉంటుంది. అంతేకాకుండా పిఎస్, పిఏతో పాటు సిబ్బంది అలవెన్సులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. మంత్రి స్థాయిలో క్యాబినెట్ హోదా సదుపాయాలు కూడా ఉంటాయి.

ప్రస్తుత పరిస్థితి ఏమిటి

2024 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టిడిపి 135, జనసేన 21, బిజెపికి 8 అసెంబ్లీ స్థానాలు దక్కితే, ఐదు సంవత్సరాలపాటు రాష్ట్రంలో అధికారంలో ఉంటూ ఎన్నికలు ఎదుర్కొన్న వైఎస్. జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సిపి 11 స్థానాలకే పరిమితమైంది. దీంతో వైఎస్ఆర్సిపి లెజిస్ట్రేచర్ పార్టీకి ప్రతిపక్ష హోదాకు అవసరమైన సీట్లు కూడా దక్కలేదు. దీంతో వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష హోదా కూడా అర్హత సాధించలేదు. దీనివల్ల రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి ప్రతిపక్షం లేకుండా పోయింది.

ప్రతిపక్ష సమస్య ఎప్పటి నుంచి..

ఎన్నికల్లో గెలిచిన తరువాత మెజారిటీ సీట్లు సాధించే పార్టీ అధికారం చేపడితే, తక్కువ సీట్లు సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కేది. 1977 వరకు ప్రతిపక్ష నేత హోదా లేదనే విషయం పార్లమెంటరీ రికార్డులు చెబుతున్నాయి. రెండో పెద్ద పార్టీగా మాత్రమే పరిగణించే వారు. 1977లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందడం వల్ల రెండో స్థాయిలో ప్రతిపక్ష నేత హోదాకు పార్లమెంటు, శాసనసభలో చట్టబద్ధత కల్పించారు. అప్పట్లో రూపొందించిన నిబంధనల ప్రకారం ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ నేతలకు కొన్ని సదుపాయాలు కల్పించడం చట్టపరంగా ఆనవాయితీగా మారింది.

Tags:    

Similar News