అక్టోబర్ 29 నుంచే ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్

ఆంధ్రప్రదేశ్ లో ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీం అమలుకు రంగం సిద్ధమైంది. దీపావళి కానుకగా ఈ స్కీంను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.

Update: 2024-10-25 11:09 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీం అమలుకు రంగం సిద్ధమైంది. దీపావళి కానుకగా ఈ స్కీంను అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. రాష్ట్రంలోని కోటి 15 లక్షల కనెక్షన్లకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈనెల 29 నుంచి ఉచిత గ్యాస్‌ బుకింగ్స్‌ ప్రారంభమవుతాయి. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి బుక్‌ చేసుకోవచ్చు. సిలిండర్‌ బుక్‌ చేసుకోగానే ప్రజలకు ప్రభుత్వం నుంచి సమాచారం వెళ్తుంది. 24 నుంచి 48 గంటల్లో సిలిండర్‌ను అందిస్తారు. పట్టణాల్లో అయితే 24 గంటల్లోనే సరఫరా చేస్తారు.

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలలో ఇదొకటి. ఆంధ్రప్రదేశ్‌లోని మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తామని ఆవేళ చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంపై ఆర్థిక భారం పడకుండా సత్వరమే ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి నాదెండ్ల చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు చేయూతగా ఉండాలనే ఉద్దేశంతో ప్రకటించిన ఈ స్కీంకు ఇటీవలే రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే చమురు కంపెనీలతో చర్చలు జరిగాయని, ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు ఉన్నాయని మంత్రి మనోహర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 55 లక్షల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్‌లను సులభతరం చేయడానికి ప్రభుత్వం విస్తృతమైన అధ్యయనాలను నిర్వహించింది. అర్హతగల దరఖాస్తుదారులు ఉచిత సిలిండర్లు పొందేందుకు వీలుగా LPG కనెక్షన్, తెల్ల రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్‌ని కలిగి ఉండాలి.
అక్టోబర్ 29న ఉదయం 10 గంటలకు బుకింగ్‌లు ప్రారంభమవుతాయి, అక్టోబర్ 30న పంపిణీ కార్యక్రమం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా పథకాన్ని ప్రారంభించనున్నారు. బుకింగ్ చేసుకున్నవారికి ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ వస్తుంది. ఈ పథకం అమలు వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.2,674 కోట్ల భారం పడుతుంది. ఇందులో రూ. 894.92 కోట్లను అక్టోబర్ 29న చమురు కంపెనీలకు బదిలీ చేస్తారు. గ్యాస్ సిలిండర్‌లను స్వీకరించడంలో ఏదైనా సమస్య ఎదురైతే పరిష్కరించడానికి టోల్-ఫ్రీ నంబర్ (1967)ను ఏర్పాటు చేశారు.
Tags:    

Similar News