ఫర్నీచర్ కొనుగోలుపై ఏపీ ప్రభుత్వం బ్యాన్.. కారణం అదే..!

ఆర్థిక ఒడిదుడుకుల మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి శాఖ కూడా దుబారా ఖర్చులను కట్టడి చేసి.. రూపాయిని పొదుపుగా వాడాలని సూచించింది.

Update: 2024-07-11 13:39 GMT

ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉందని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు మార్పు వెల్లడించారు. ఉన్న ఖజానాను బట్టే ఖర్చులను కూడా నిర్ణయిస్తున్నట్లు చెప్పారు. కానీ ప్రజల సంక్షేమం విషయంలో మాత్రం ప్రభుత్వం రాజీ పడదని తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఖజానా ఖర్చు విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రులకు, శాఖల అధికారులకు కూడా కీలక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఖజానా ఖర్చు విషయంలో ప్రతి ఒక్కరూ ఆచితూచి అడుగులు వేయాలని సీఎం, డిప్యూటీ సీఎం వివరించారని తెలుస్తోంది.

అలాంటి ఖర్చులొద్దు

ప్రస్తుతం ఉన్న ఆర్థిక వనరులతో రాష్ట్రాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకెళ్లడం కత్తిమీద సాము వంటి చర్యే. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ పొదుపు మంత్రం పటించాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి రూపాయి చాలా ముఖ్యమని, రూపాయి ఊరికినే రాదంటూ చెప్పుకొచ్చింది. ఒకవైపు సంక్షేమాన్ని, మరోవైపు అభివృద్ధిని కూడా ప్రజలకు సమపాళ్లలో అందించాలని, అదే సమయంలో నగదును ఎగనాదిగనా ఖర్చు చేయొద్దని కూడా అధికారులను సూచించింది ప్రభుత్వం. అందుకోసం దుబారా ఖర్చులకు బైబై చెప్పాలని, ఖర్చు చేసే ప్రతి రూపాయికి లెక్కలు చూపించడమే కాకుండా, ప్రతి రూపాయిని సరైన చోట మాత్రమే ఖర్చు చేయాలని కూడా ప్రభుత్వం వివరించింది.

అనుభవాన్ని రంగరిస్తున్న చంద్రబాబు

రాష్ట్ర ఖజానా అడుగంటుతున్న క్రమంలో ఆంధ్ర రాష్ట్రానికి, ప్రజలకు ఎటువంటి లోటు లేకుండా ముందుకు తీసుకెళ్లడానికి సీఎం చంద్రబాబు తన 40 ఏళ్ల అనుభవాన్ని రంగరించి మరీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో ప్రధమంగా రాష్ట్రంలో జరుగుతున్న దుబారా ఖర్చు నియంత్రణపై ఆయన దృష్టి సారించారు. ఖజానాను పొదుపు చేయడానికి కూడా చంద్రబాబు, ప్రభుత్వం కలిసి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ఫర్నీచర్ కొనుగోలుపై బ్యాన్ విధించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

డిసైడ్ అయిన అధికారులు

ప్రభుత్వం మారగానే తమ కార్యాలయాల్లో ఫర్నీచర్‌ను మార్చేయాలని చాలా మంది అధికారును నిశ్చయించుకున్నారు. కుర్చీలు, సోఫాలు, కంప్యూటర్ బల్లలు కావాలని అర్జీలు కూడా పెట్టేసుకున్నారు. అసలికే ఖాళీ అయ్యే పరిస్థితిలో ఖాజానా ఉండటంతో.. ఇదంతా కూడా దండగ ఖర్చే అని ప్రభుత్వం భావించింది. అంతే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా ఫర్నీచర్ కొనుగోలు చేయడాన్ని 31 మే 2026 వరకు నిషేధిస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. కాగా కొన్నింటికి మాత్రం ఈ ఆదేశాలను నుంచి మినహాయింపు కలిగిస్తూ కొత్త వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.

వీటికే మినహాయింపు

ప్రభుత్వ ఆసుపత్రులు, రెసిడెన్షియల్ స్కూళ్లు, రాజ్‌భవన్, హైకోర్టలకు మినహా మిగిలిన అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు తాము జారీ చేసిన ఆదేశాలు వర్తిస్తాయని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. గత ప్రభుత్వ వైఫల్యం వల్ల మరో రెండేళ్ల వరకు నూతన ప్రభుత్వానికి ఆర్థిక ఒడిదుడుకులు తప్పవని, దానిని దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖలను ఖర్చులను తగ్గించుకునే దిశగా చర్యలు చేపట్టాలని ఆర్థిక శాఖ కోరింది. ఈ నేపథ్యంలోనే సంపద సృష్టించడం అనేది రాత్రికి రాత్రి అయిపోయే పని కాదని, చేపట్టిన పనులకు ఫలితాలు రావడానికి కాస్త సమయం పడుతుందని, అప్పటి వరకు వేచి చూడాల్సిందేనని సీఎం వివరించారు. కావున ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆర్థికంగా ముందుకెళ్లడం అంత సులభం కాదని ప్రభుత్వం వివరించింది.

ఇంకెన్ని చేస్తారో..

ఈ క్రమంలోనే పొదుపు మంత్రం అంటూ ప్రభుత్వ కార్యాలయాలు కొనుగోలు చేసే ఫర్నీచర్‌ను ఈ ప్రభుత్వం బ్యాన్ విధించిందని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పొదుపు మంత్రం పేరిట ముందు ముందు ఇంకెన్నింటిపై బ్యాన్ విధిస్తుందో అని, అదే విధంగా సంపద సృష్టి అంటూ రేట్లు కూడా పెంచుతుందేమో అంటూ మరికొందరు విమర్శలు కూడా గుప్పిస్తున్నారు.

Tags:    

Similar News