అమరావతి రైతులకు అందిన కౌలు.. ఎన్ని వందల కోట్లంటే..!

అమరావతి రైతులకు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి కౌలు కాలపరిమితిని మరో ఐదేళ్లు పెంచినట్లు తెలిపింది. వారి కౌలు నగదును కూడా విడుదల చేసింది.

Update: 2024-09-17 10:13 GMT

2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడివడిన తర్వాత ప్రత్యేక ఆంధ్రకు ప్రదేశ్‌కి తొలి సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ప్రత్యేక ఆంధ్రప్రదేశ్‌ కంటూ ప్రత్యేక రాజధాని ఉండాలని, ఆ రాజధానిని అమరావతిలో నిర్మించాలని ఆనాటి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్న ప్రకారమే రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి వేల ఎకరాల భూములను సేకరించింది. వారందరికీ పదేళ్ల పాటు వార్షిక కౌలు కూడా చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. చెప్పినట్లే రైతులకు అప్పటి నుంచి ప్రతి ఏటా కౌలు చెల్లిస్తూనే వస్తోంది. 2019లో ప్రభుత్వం మారి అధికారం చేపట్టిన వైసీపీ కూడా ఈ కౌలును చెల్లించింది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మళ్ళీ చేతులు మారి మరోసారి టీడీపీకి చేరింది. కానీ అమరావతి నిర్మాణం మాత్రం ఎక్కడి వేసిన గొంగలి అక్కడే అన్నట్లు టీడీపీ అధికారం పోయినప్పుడు ఎలా ఉండే అక్కడే అంతా ఆగిపోయి ఉంది. దీంతో ఇప్పుడు మరోసారి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. రాజధాని కోసం భూములు అందించిన రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. వారికి తొలుత చెప్పిన పదేళ్ల కాలపరిమితి పూర్తికావడంతో ఈ కౌలు చెల్లింపును మరో ఐదేళ్లకు పొడిగిస్తున్నాట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటించిన విధంగానే సోమవారం.. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు కౌలు డబ్బులను విడుదల చేశారు. వారి ఈరోజు నుంచి ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవచ్చని అధికారులు చెప్పారు.

ఎంతమంది రైతులకు ఎంతంటే..

ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం గతంలో 28,656 మంది రైతులు తమ భూములను ప్రభుత్వానికి అందించారు. రైతులు అందించిన మొత్తం భూమి విస్తీర్ణం 34 వేల ఎకరాలుగా ప్రభుత్వ తెలిపింది. వారిలో చిన్న, సన్నకారు రైతులు కూడా ఉండటంతో వారికి ఆర్థిక సహాయంగా ప్రతి ఏటా కౌలు అందిస్తామని ప్రభుత్వం చెప్పి.. ఆ విధంగానే కౌలు అందిస్తున్నారు. తాజాగా ఈ కౌలు అందించే సమయాన్ని మరో ఐదేళ్లకు పెంచారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అమరావతి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆ నిధుల నుంచే కౌలు

బయట ఎకరాకి ఎంతమొత్తం కౌలు చెల్లిస్తున్నారో అంత మొత్తాన్నే సీఆర్‌డీఏ.. అమరావతి రైతుల ఖాతాల్లో జమ చేసింది. అమరావతి రైతులకు అందించే కౌరు కోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో కూడా రూ.400 కోట్ల కేటాయింపు జరిగింది. ఆ మొత్తం నిధులను రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) విడుదల చేసింది. ఆ నిధుల నుంచి వెంటనే రైతులకు కౌలు చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో హుటాహుటిన రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేశారు అధికారులు. దీంతో పాటుగా అమరావతిలో పెండింగ్‌లో అన్ని అంశాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. వాటిని ఒక్కొక్కటిని ప్రాధాన్యత ప్రాతిపదికన పరిష్కరిస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా అమరావతి నిర్మాణం కోసం ఇంకా పెండింగ్‌లో ఉన్న భూ సేకరణపై పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రత్యేక దృష్టి సారించారు.

రైతులను ఒప్పించే పనిలో మంత్రి..

అమరావతికి ఇంకా పెండింగ్‌లో భూసేకరణ విషయంలో ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములు ఇచ్చేలా రైతులను ఒప్పంచే పనిలో మంత్రి నారాయరణ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే రైతులను ముఖాముఖి నిర్వహించి.. వాళ్లు భూములను ఇవ్వడం వల్ల వారికి ఎటువంటి నష్టం కలగదని వివరిస్తున్నారు. అంతేకాకుండా భూములు ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్‌ను కూడా ఆయన రైతులకు వివరిస్తున్నారు. ఇప్పుడు భూములు ఇస్తే వారికి రాజధాని నిర్మాణం తర్వాత రాజధానిలో కోరిన చోట వారికి ప్లాట్లు ఇస్తామని మంత్రి భరోసా కల్పిస్తున్నారు.

ప్రభుత్వం మాటలను రైతులు నమ్ముతారా..

కాగా మరోసారి భూసేకరణపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం రైతులతో ప్రత్యేక సంప్రదింపులు జరుపుతోంది. భూములు ఇస్తే వారికి రాజధానిలో ప్లాట్లు ఇస్తామని గతంలో చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ చెప్తోంది. కానీ ఈసారి ప్రభుత్వం మాటలను రైతులు నమ్ముతారా? నమ్మి తమ పచ్చని భూములను టీడీపీ ప్రభుత్వం చేతిలో పెడతారా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. 2014-2019 మధ్య 28 వేల 656 మంది రైతులు తమ భూములను రాజధాని కోసం ఇచ్చారు. కానీ రాజధాని పూర్తి కాకపోవడం, ఇంతలో ప్రభుత్వం మారడం.. ఆ తర్వాత రాజధానే మారిపోవడంతో ఐదేళ్లుగా అమరావతి రైతులు నానా అవస్థలు పడ్డారు. నిరసలు తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్లెక్కి ఆందోళనలు చేశారు. అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ రాజధానికి భూములు ఇవ్వడానికి రైతులు ముందుకు వస్తారా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. దానికి తోడు ఈసారైనా ఈ ఐదేళ్ల పాలనలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని ప్రభుత్వం చెప్పలేకుంది. ఒకవేళ మళ్ళీ ప్రభుత్వం మారితే అవస్థలు పడే రైతుల సంఖ్య ఇంక పెరగడమే తప్ప లాభమేమీ ఉండదని కొందరి భావన. మరి ఈ విషయంలో రైతుల నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News