ఏపీలో ఆపరేషన్ ఘీ స్టార్ట్.. అన్ని ఆలయాల్లో తనిఖీలు..

తిరుపతి ప్రసాదం కల్తీ వివాదాన్ని ఏపీ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. అన్ని ఆలయాల ప్రసాదం నాణ్యతపై తనిఖీలు చేపడుతోంది. ఇందుకోసమే స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించింది.

Update: 2024-09-22 11:23 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం కల్తీ వివాదాన్ని ఏపీ సర్కార్ చాలా సీరియస్‌గా తీసుకుంది. టీటీడీ ప్రసాదం తయారీకి వినియోగిస్తున్న నెయ్యిలో జంతువుల కొవ్వు, చేప నూనె కలిసినట్లు వచ్చి రిపోర్ట్‌పై ఇప్పటికే కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని ఇతర ఆలయాల ప్రసాద నాణ్యతపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అందుకోసం ‘ఆపరేషన్ ఘీ’కి శ్రీకరం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని ప్రముఖ ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతమై చర్యలు చేపడుతోంది. సదరు నియోజకవర్గం ఎమ్మెల్యే, అధికారుల సమక్షంలో తనిఖీలు చేపట్టారు. వీటిలో భాగంగానే శనివారం.. సింహాచలం ఆలయ ప్రసాదాల్లో వినియోగించే ముడిసరుకుల నాణ్యతను భీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు తనిఖీ చేశారు. సింహాచలం ఆలయ ప్రసాదం తయారీకి వినియోగిస్తున్న నెయ్యి రుచిపై ఆయన పెదవి విరిచారు. ప్రసాదం నాణ్యతపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం, అన్నవరం అప్పన్న ఆలయాల్లో కూడా తనిఖీలు చేపట్టారు.

నిబంధనలు అమలవుతున్నాయా?

ఆయా ఆలయాల్లో ప్రసాదాలను అన్ని ప్రమాణాల మేరకే తయారు అవుతున్నాయా? ప్రసాదాలను ఆవునెయ్యితోనే సిద్ధం చేస్తున్నారా? ఆవు నెయ్యి నాణ్యమైనదేనా? అందులో ఏమైనా కల్తీ ఉందా? నాణ్యత ప్రమాణాలను ఎంతమేర పాటిస్తున్నారు? అన్న అంశాలపై తనిఖీ అధికారులు, నేతలు దృష్టిసారిస్తున్నారు. అంతేకాకుండా ప్రసాదాల నాణ్యతపై భక్తులను అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు. ప్రసాదం సహా ముడిసరుకుల శాంపిళ్లను కూడా పరీక్షల కోసం సేకరిస్తున్నారు. ఆదివారం రోజు ఎమ్మెల్యే సత్యప్రభ.. అన్నవరం అప్పన్నను దర్శించుకున్నారు. ఆలయంలో అందిస్తున్న ప్రసాదాన్ని పరిశీలించారు. ప్రసాదం ముడిసరుకులర నిల్వ, టెండర్లకు సంబంధించిన ఫైళ్లను తనిఖీ చేశారు.

పురుగులు పట్టిన రవ్వ

అన్నవరం ఆలయ ప్రసాదం నాసిరకంగా ఉందని, రుచీపచీ లేకుండా పోయిందంటూ భక్తులు ఫిర్యాదు చేయడంతోనే ఈ తనిఖీలు చేపట్టామని ఆమె తెలిపారు. ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడమని, తప్పకుండా దీనిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీటిలో భాగంగానే బన్నీ రవ్వకు పురుగులు పట్టాయని, పంచదార అంతా చీమలు పట్టి ఉండటాన్ని గమనించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సత్యప్రభ. ఇందుకు కారణం ఏంటని అధికారులను వివరణ కోరగా.. దత్తత దేవాలయాలు, వేద పాఠశాలకు సరుకులు పంపించగా ఇవి మిగిలాయని అధికారులు వివరణ ఇచ్చారు. అనంతరం దేవస్థానం నిర్వహించే నమూనాల పరీక్షలు, దేవస్థానానికి గుత్తేదారు అందించే ల్యాబ్ నివేదికలను కూడా ఆమె పరిశీలించారు.

రెండేళ్లుగా మారని గుత్తేదారు..

‘‘ప్రసాదం తయారీకి వినియోగించే ముడిసరుకులు అందించే గుత్తేదారులను ఎంచుకోవడానికి ప్రతి ఆరునెలలకొకసారి టెండర్లు పిలవాల్సి ఉంది. అలాంటప్పుడు గత రెండేళ్లుగా ఒకే గుత్తేదారును ఎందుకు కొనసాగిస్తున్నారు’’ అని ఎమ్మెల్యే.. అధికారులను ప్రశ్నించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని, కనీసం టెండర్లయినా పిలిచారా అని ప్రశ్నించారామే. ఈ సందర్భంగానే టెండర్లకు సంబంధించిన దస్త్రాలను ఆమె పరిశీలించారు. ప్రసాదం తయారీ విధానం, అందులో వినియోగించే నెయ్యి, పంచదార, గోధుమలు, యాలకులను కూడా పరిశీలించి.. వాటి నమూనాలను కూడా తీసుకెళ్లారు ఎమ్మెల్యే.

రేటులో మార్పెందుకు..

అన్నవరం అప్పన్న ఆలయం, సింహాచలం ఆలయానికి ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిని ఒకే గుత్తేదారు అందిస్తున్నారని, అలాంటి సమయంలో ఒక్కో ఆలయానికి ఒక్కో ధర ఎలా ఉందని ప్రశ్నించారామే. ఈ ధరల్లో తేడాపై పూర్తిస్థాయి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడొద్దని, ఏమాత్రం కల్తీ ఉందని గానీ, నాణ్యత సన్నగిల్లిందని కానీ తెలిస్తే వెంటనే సదరు గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలని, వారితో పాటుగా ఆలయం నుంచి ఆ నెయ్యికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సత్యప్రభ ఆదేశించారు.

Tags:    

Similar News