ఏపీలో గ్రూప్‌–2 మెయిన్స్ పరీక్షలు వాయిదా

ఆదివారం జరగాల్సిన గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షను మరి కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వం ఏపీపీఎస్సీ కి ప్రభుత్వం లేఖ రాసింది.;

Update: 2025-02-22 10:05 GMT

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ)కు లేఖ రాసింది. ఆదివారం జరగాల్సిన గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షలను మరి కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వం ఏపీపీఎస్సీకి సూచించింది. రోస్టరు తప్పులను సరిచేయకుండా గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించడం మంచిది కాదని ప్రభుత్వం భావించింది. రోస్టర్‌పై అభ్యర్థుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌–2 పరీక్షలో రోస్టర్‌ అంశంపై కోర్టులో ఇదివరకే కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. మార్చి 11న దీని మీద కోర్టులో విచారణ జరగనుంది. దీనిపై అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు ఇంకా సమయం ఉన్నందువల్ల అప్పటి వరకు గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షలు నిర్వొహించొద్దని ఏపీపీఎస్సీకి రాసిన లేఖలో ప్రభుత్వం పేర్కొంది.

ఇదిలా ఉంటే దీని కంటే ముందు శనివారం ఉదయం ఏపీపీఎస్సీ కీలక ప్రకటన విడుదల చేసింది. గ్రూప్‌–2 పరీక్షలు వాయిదా అంటూ సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం సాగుతోందని, దీనిని నమ్మొద్దని, గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షలు య«థాతథంగా ఉంటాయని, నిర్ణయించిన మేరకు ఆదివారం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌ ఏ ఆర్‌ అనురాధ ప్రకటించారు. ఫేక్‌ న్యూస్‌ నమ్మొద్దని, అభ్యర్థులందరూ పరీక్షలకు హాజరు కావాలని వెల్లడించారు.

అంతేకాకుండా గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షలపై సోషల్‌ మీడియాలో తప్పుడు, అసత్య ప్రచారం చేస్తోన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి మీద పోలీసులకు ఫిర్యాదులు చేస్తామని హెచ్చరించారు. ఇది వరకు నిర్ణయించిన షెడ్యూల్‌ మేరకు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్‌–2 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. తప్పుడు, అసత్య ప్రచారాలు నమ్మకుండా ఆదివారం అభ్యర్థులందరూ పరీక్షలకు హాజరు కావాలని స్వయంగా ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌ ఏఆర్‌ అనురాధ వెల్లడించారు. ఇది చెప్పిన కొద్దిసేపటికే గ్రూప్‌– 2 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని సాక్షాత్తు ప్రభుత్వమే ఏపీపీఎస్సీకి లేఖ రాయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆదివారం పరీక్షలు నిర్వహిస్తారా? నిలిపి వేస్తారా? అనే దానిపై అయోమయం నెలకొంది. అయితే ఏపీపీఎస్సీ మాత్రం దీనిపై ఇంత వరకు స్పష్టత ఇవ్వలేదు.

గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షల మీద గతంలో కొంత మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. రోస్టర్‌ విధానంలో మార్పు చేయాలని, ఇది తేలేంత వరకు పరీక్షలను వాయిదా వేయాలని కోర్టులో పిటీషన్‌ దాఖలు చేశారు. అయితే దీనిపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. పరీక్షలను నిలుపుదలను నిరాకరిస్తూ కోర్టు సింగిల్‌ జడ్జి ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రూప్‌–2 అభ్యర్థులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఏపీ వ్యాప్తంగా రోడ్లెక్కి ఆందోళనలు చేపట్టారు. 2023 డిసెంబరు 7న ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్‌ సుప్రీం కోర్టు తీర్పుకు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 77జీవోకు విరుద్దంగా ఉందని దీనిని కోర్టు సింగిల్‌ జడ్డి విస్మరించారని నిరసనలు వ్యక్తం చేశారు.

సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ మరో సారి హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని, ఫిబ్రవరి 23న జరగనున్న గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షలను నిలుపుదల చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షల అనంతరం అభ్యర్థుల నుంచి మరో సారి పోస్టు ప్రాధాన్యతలు తీసుకుంటామని, ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా రూపొందించడం కంటే ముందే ఈ ప్రక్రియను చేపడతామని ఏపీపీఎస్సీ కోర్టుకు తెలిసింది. ఇదే అంశంపై మంత్రి నారా లోకేష్‌ స్పందిస్తూ.. అభ్యర్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు షెడ్యూల్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ నిర్ణయించింది.

Tags:    

Similar News